వెండితో రాజన్నకు అదనపు ఆదాయం


Wed,November 6, 2019 02:16 AM

వేములవాడ, నమస్తే తెలంగాణ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారికి వెండితో అదనపు ఆదాయం ఇక సమకూరనుంది. దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్న సన్నిధికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. స్వామివారి సన్నిధికి వచ్చే భక్తులు మొక్కుల రూపంలో బంగారు, హుండీలో వెండి కానుకలను సమర్పించుకునే అనవాయితీ ఉంది. అయితే భక్తులు సమర్పించిన ఈ కానుకలను ఇప్పటికే ఆలయ అధికారులు బ్యాంకుల్లో భద్రపరుస్తుండగా నిల్వలు పెరిగిపోతున్నాయి. ఇక వెండి నిల్వలు 4టన్నులకు చేరుకోగా బ్యాం కుల్లో కూడా వాటి నిల్వలు భారీగా పెరిగిపోయాయి. బంగారం కానుకలు కూడా నిల్వ చేస్తున్నారు. గతంలోనే 43 కిలోల బంగారాన్ని అప్పటి ఆలయ అధికారులు బ్యాంకులో గోల్డ్‌బాండ్‌ పేరిట వడ్డీకి బాండ్‌ చేశారు. దీంతో సాలీన స్వామివారికి రూ. 10 నుంచి 12లక్షల ఆదాయం ఆలయ ఖజానాకు చేరుతుంది. వెండి నిల్వలను కూడా బాండ్‌ చేసేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ అనుమతులను ఆలయ ఈవో కృష్ణవేణి కోరగా ఇటీవలే మంజూరుచేశారు. ఇందులో భాగంగా కొంత వెండి నిల్వలను బాండ్‌ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఏటా పెరుగుతున్న కానుకలు
రాజన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన వెండి కానుకలు ప్రతి యేడాదికి పెరిగిపోతున్నాయి. స్వామివారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు వెండి కానుకలను హుండీలో సమర్పిస్తుండగా వాటిని హుండీ లెక్కింపు సమయంలో ఆలయ అధికారులు తూకం వేసి భద్రపరిచే విధానం ఉంది. బ్యాంకుల్లో ఈ నిల్వలను జమచేస్తుండగా 4 టన్నుల వరకు చేరుకోవడంతో గోల్డ్‌బాండ్‌ చేసేందుకు బ్యాంక్‌ అధికారులను సంప్రదించారు.

ఉన్నతాధికారుల అనుమతులు
కానుకల ద్వారా స్వామివారికి సమకూరిన వెండిని బ్యాంకులో బాండ్‌ చేసేందుకు రాష్ట్రదేవాదాయశాఖ అధికారులు అనుమతిని ఇచ్చారు. స్వామివారికి 4టన్నుల వరకు వెండి ఉండగా ఇందులో మొదటి విడుతగా 860 కిలోల వెండిని రాష్ట్ర ప్రభుత్వ మింట్‌లో దాని ని శుద్ధిచేసి గోల్డ్‌బాండ్‌గా మార్చేందుకు అనుమతిని ఇచ్చారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అనుమతులు మంజూరైనందున వాటిని హైదరాబాద్‌కు తరలించేందుకు తగిన భద్రత కావాలని ఆలయ అధికారులు, జిల్లా పోలీసు యం త్రాంగాన్ని లేఖ ద్వారా కోరినట్లు తెలిసింది.

సుమారు 3 కోట్ల వరకు వెండి బాండ్‌
స్వామివారికి భక్తుల నుంచి కానుకల ద్వారా అందిన వెండిని కరిగించి బాండ్‌ చేసేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇం దులో భాగంగా మొదటి విడుతలో 860 కిలో ల వెండిని ప్రభుత్వ మింట్‌లో శుద్ధిచేసే అవకా శం ఉంది. దీంతో సదరు వెండిని బ్యాంకులో బాండ్‌ చేయడం ద్వారా ప్రస్తుత మార్కెట్‌కు అంచనాగా 3 కోట్ల వరకు విలువ ఉండే అవకాశం ఉంటుంది. సదరు వెండిని బాండ్‌ చేసుకున్న బ్యాంక్‌ అధికారులు ఏటా ఆర్థికసంవత్సరం ముగింపు మార్చి 31నాటికి అప్పటి రేటుకు అనుగుణంగా వడ్డీని ఆలయ ఖజానాకు అందించే అవకాశం ఉంటుంది. దీంతో స్వామివారికి వెండి ద్వారా వచ్చే వడ్డీతో ఆదాయం మరింత సమకూరనుంది.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...