అడవి బిడ్డలకు భరోసా


Wed,November 6, 2019 02:15 AM

- భూ పట్టాలపై అమాత్యుడి హామీ
వీర్నపల్లి: దశాబ్దాలుగా రెవెన్యూ, అటవీ భూములను సాగుచేస్తూ జీవనోపాధి పొందుతున్న మారుమూల ప్రాంతవాసుల కల త్వరలోనే సాకారం కానున్నది. అర్హులైన రైతులకు పట్టాలివ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన గిరిజనులు, కొంతమంది ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతుల భూములను సాగు చేసుకుంటున్నారు. ఆ భూములపై ఎలాంటి హక్కు పత్రాలు లేకపోవడంతో వారు ఇబ్బందిపడ్డారు. వారి సమస్యను పరిష్కరించాలని జడ్పీటీసీ గుగులోతు కళావతి, నాయకులు గత అక్టోబర్‌ 15న హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్‌ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు 16న ఆర్డీవో రంగంపేటలో పర్యటించారు.

తీరనున్న రైతుల సమస్య
రంగంపేట, ఎర్రగడ్డతండా గ్రామాలు కంచర్ల రెవెన్యూ పరిధిలో ఉన్నాయి. రైతుల భూములకు గత ప్రభుత్వాలు పట్టా పాస్‌పుస్తకాలు అందించగా, సదరు రైతులు బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు. తదనంతరం భూరికార్డుల ప్రక్షాళనలో సదురు భూములు అటవీశాఖ పరిధిలోకి వెళ్లడంతో కొత్త పాస్‌ పుస్తకాలు జారీ కాలేదు. అటు దశాబ్దా కాలంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములను పట్టాలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.

కదిలిన అధికార యంత్రాంగం
మంత్రి కేటీఆర్‌ కలెక్టర్‌ను అదేశించిన మరోసాటి రోజే గ్రామస్తులతో ఆర్డీవో శ్రీనివాసరావు సమావేశమయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యను అడిగి తెలుసుకున్నారు. అటవీ, రెవెన్యూ భూముల సమస్య కొలిక్కి రావాలంటే సర్వే చేయాలని నిర్ణయించారు. రెండు శాఖల సమన్వయంతో సర్వే పనులు ప్రారంభించారు. రెండు బృందాలతో అటవీ, రెవెన్యూ భూ సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. సర్వే పనులను ఆర్డీవో, శిక్షణ కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పరిశీలించారు. మరో నెల రోజుల్లో సర్వే పనులు పూర్తికానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

310 మంది రైతులకు ప్రయోజనం
రెవెన్యూ, పోడు భూములకు ప్రభుత్వం పట్టాలిస్తే సుమారు 310మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. సర్వే నంబర్‌ 10లో సుమారు 620ఎకరాలకు 250మంది రైతు లు సాగు చేసుకుంటుండగా, మరో 180ఎకరాల పోడు భూములకు 60మంది గిరిజనులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో ఏళ్ల తరబడిగా ఇబ్బందిపడుతున్న రైతులు హక్కు పత్రాలు పొందనున్నారు. సర్వే పనులు ప్రారంభం, పట్టాల పంపిణీకి గ్రీన్‌సిగ్నల్‌ రావడంపై గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...