సాఫీగా ప్రజారవాణా


Wed,October 23, 2019 02:38 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలోని నాలుగు జిల్లాల్లో మంగళవారం మొత్తం 554 బస్సులు నడిచాయి. కాగా, కరీంనగర్‌ జిల్లాలో ఈరోజు 206 బస్సులు నడపాల్సి ఉండగా.. 86.41 శాతంతో 115 ఆర్టీసీ, 63 అద్దె బస్సులు నడిపారు. పెద్దపల్లి జిల్లాలో 149 బస్సులు నడపాల్సి ఉండగా, 94.63 శాతంతో 101 ఆర్టీసీ, 40 అద్దె బస్సులు నడిపించారు. జగిత్యాల జిల్లాలో 198 బ స్సులు నడపాల్సి ఉండగా 90.91 శాతంతో 115 ఆర్టీసీ, 65 అద్దె బస్సులు నడిచాయి. సిరిసిల్ల జిల్లాలో 103 బస్సులు నడపాల్సి ఉండగా 35 ఆర్టీసీ, 20 అద్దె బస్సుల చొ ప్పున 53.40 శాతం బస్సులు నడిపారు. కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో పది డిపోలు ఉండగా.. కోరుట్ల డిపోలో మంగళవారం వంద శాతానికి మించి బస్సులు నడిపారు. మరికొన్ని డిపోల్లో 90 శాతానికి పైగా నడిచాయి. కోరుట్ల డిపోలో మొత్తం 59 బస్సులకు మంగళవారం 46 బస్సులు నడపాల్సి ఉంది. కాగా, 36 ఆర్టీసీ, 12 అద్దె బస్సులను కలుపుకొని 104 శాతంతో మొత్తంగా 48 బస్సులు నడిపించారు. హుజూరాబాద్‌, గోదావరిఖని, మెట్‌పల్లి, మంథని డిపోల్లో 90 శాతానికి పైగా బస్సులు నడిచాయి.

టికెట్‌ చార్జీలపై దృష్టి
ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులు నడిపిస్తున్న ఆర్టీసీ అధికారులు ఆయా బస్సుల నుంచి టికెట్‌ చార్జీల వసూళ్ల విషయంలోనూ దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా చార్జీలకు మించి వసూళ్లు చేయకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. రీజియన్‌ పరిధిలో 554 బస్సులు నడవగా 469 బస్సుల్లో టిమ్స్‌ వినియోగించారు. కరీంనగర్‌-1, 2, గోదావరిఖని, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ డిపోల పరిధిలో నడిచిన అన్ని బస్సుల్లోనూ టిమ్స్‌ ద్వారానే టికెట్లు ఇచ్చారు.

అద్దె బస్సుల టెండర్లకు భారీ స్పందన
రీజియన్‌ పరిధిలో పది డిపోలకు 9 డిపోల పరిధిలోని 19 రూట్లలో నడిపేందుకు 32 ఎక్స్‌ప్రెస్‌లు, 11 పల్లె వెలుగు బస్సుల కోసం ఆర్టీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించగా విశేష స్పందన లభించింది. 43 బస్సులకు 1862 దరఖాస్తులు వచ్చాయి. వీటికి మంగళవారం ఎంపిక పక్రియ పూర్తి చేసినట్లు ఆర్‌ఎం జీవన్‌ ప్రసాద్‌ తెలిపారు. వీటిలో రెడీ ఫర్‌ యూజ్‌ అర్హత ఉన్న 11 బస్సులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వగా, మిగిలిన 32 బస్సులకు టెండర్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. అద్దె బస్సులన్నింటికీ అగ్రిమెంట్‌ అందించిన రోజు నుంచి 90 రోజుల్లోగా 2019 మోడల్‌తో పాటు సాంకేతిక నిబంధనలన్నింటినీ పూర్తి చేసుకుని ఆర్టీసీకి అందించాల్సి ఉంటుందని చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రతిపాదనలన్నింటినీ కేంద్ర కార్యాలయానికి పంపించామనీ, అక్కడి నుంచి అనుమతులు రాగానే వాటిని తీసుకుంటామన్నారు.

కాగా, వివిధ రూట్లలో నడిచే బస్సుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్‌, జగిత్యాల రూట్‌లలో మూడు ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు 251 దరఖాస్తులు రాగా కరీంనగర్‌, జమ్మికుంట రూట్‌లో 4 పల్లె వెలుగు బస్సులకు 221 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే కోరుట్ల, వేములవాడ రూట్‌లో 2 పల్లె వెలుగు బస్సులకు 182 దరఖాస్తులు, కోరుట్ల, కాగజ్‌నగర్‌ మూడు పల్లె వెలుగు బస్సులకు 172 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. సిరిసిల్ల, జేబీఎస్‌ రూట్‌లలో ఒక ఎక్స్‌ప్రెస్‌ కోసం కేవలం 9 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...