బస్సులన్నింటినీ నడిపించాలి


Wed,October 23, 2019 02:37 AM

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని డిపోల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బస్సులన్నింటినీ నడిపించాలని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు. మంగళవారం ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో నోడల్‌ ఆఫీసర్లు, ఆర్టీసీ అధికారులు, డిపో మేనేజర్లు, పోలీస్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను రిజర్వ్‌లో ఉంచుకోవాలని సూచించారు. గరుడ, రాజధాని వంటి స్పెషల్‌ బస్సులు నడిపేందుకు తాత్కాలిక డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ ఇవ్వాలని సూచించారు. జిల్లాలో మూడు డిపోల్లో 55 గరుడ, వజ్ర, రాజధాని, మెట్రో లాంటి స్పెషల్‌ బస్సులు ఉన్నాయనీ, వాటన్నింటినీ నడిపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్సుల సమయం షెడ్యూల్‌ పాటించాలనీ, ప్రయాణికులకు టికెట్లు ఇచ్చింది లేనిది తాసిల్దార్లు, ఎస్‌ఐలు తనిఖీ చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.

ఆర్టీసీలో అద్దె బస్సులన్నింటినీ పూర్తిస్థాయిలో నడిపించాలనీ, ప్రైవేట్‌ బస్సులను డిపోలో పార్కింగ్‌ చేసేందుకు అనుమతించాలని సూచించారు. బస్సులు బస్టాండ్‌ నుంచి రోడ్లపైకి వచ్చే వరకు పోలీస్‌ ఎస్కార్టు ఏర్పాటు చేయాలనీ, తాత్కాలిక డ్రైవర్లను, కండక్లర్లను ఆర్టీసీ కార్మికులు బెదిరింపులకు గురి చేయకుండా రక్షణ కల్పించాలని ఆదేశించారు. బస్టాండ్‌లో పోలీసులు మప్టీలో విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలనీ, అన్ని బస్సుల్లో అన్ని రకాల బస్‌పాస్‌లు ప్రయాణానికి అనుమతించేలా కండక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. జిల్లాలో మూడు డిపోల్లో మరమ్మతులో ఉన్న బస్సులన్నింటినీ ప్రైవేట్‌ మెకానిక్‌లతో వెంటనే మరమ్మతులు చేయించి నడిపించాలన్నారు. సమావేశంలో ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ జీవన్‌ ప్రసాద్‌, నోడల్‌ అధికారులు జిల్లా పరిషత్‌ ముఖ్య ప్రణాళికా అధికారి వెంకటమాధవరావు, కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఆర్డీఓలు ఆనంద్‌కుమార్‌, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...