ఇక మున్సి‘పోల్స్‌'!


Wed,October 23, 2019 02:37 AM

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఏర్పాట్లను చట్టబద్ధంగా చేపట్టలేదంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలను కోర్టు కొట్టివేస్తూ ఎన్నికలకు అనుమతి ఇవ్వడంతో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు ఉన్న ఇబ్బందులు తొలిగిపోవడంతో నగరపాలక, పురపాలక సంఘాల్లో సందడి కనిపిస్తోంది. కాగా, ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లోనూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై గత జూలైలోనే పనులు చేపట్టారు. ఈ విషయంలో ఆయా మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల విభజన, ఓటర్ల కులగణన సరిగా లేదంటూ పలువురు నాయకు లు కోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు బెంచ్‌ ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పడంతో ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చిన స్టేలపైనా త్వరలోనే నిర్ణయం వెలువడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మున్సిపల్‌ ఎన్నికల కు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఎన్నికలకు సంబంధించి అన్ని ము న్సిపాలిటీల అధికారులు దృష్టి సారిస్తుండగా.. నాయకుల్లో ఆశలు నెలకొన్నాయి. ఇన్నాళ్లూ మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అన్న సంశయంలో ఉన్న నాయకులు కోర్టు తీర్పుతో తమ వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.

ముందస్తు ఏర్పాట్లు
మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఓటరు, కుల గణన పూర్తి చేసి డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, రామగుండం కార్పొరేషన్లతోపాటు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లోనూ ఓటరు, కుల గణన పూర్తి చేసిన అధికారులు ఆగస్టులోనే ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల లెక్కలు, పురుష, మహిళల ఓటర్ల లెక్కలు సైతం అధికారికంగా ప్రకటించారు. వీటితోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్‌ బూత్‌ల గుర్తింపు, స్ట్రాంగ్‌ రూంల ఎంపికను కూడా పూర్తి చేశారు. పోలింగ్‌ బూత్‌లలో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన అంచనాలు కూడా సిద్ధం చేసుకున్నారు. కావాల్సిన సామగ్రికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఇప్పటికే డివిజన్లు, వార్డుల వారీగా కుల ఓటర్ల లెక్కలను ఆయా మున్సిపల్‌ అధికారులు ప్రకటించారు. హైకోర్టు ఎన్నికలకు ఓకే చెప్పడంతో ఇక రిజర్వేషన్ల ప్రకటనపైనే నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్తగా ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు కావడంతో ఈసారి నగరపాలక సంస్థ మేయర్‌ స్థానాల రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితోపాటు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలపైనా ఆసక్తి కనిపిస్తున్నది. అలాగే డివిజన్లు, వార్డుల రిజర్వేషన్‌కు సంబంధించి కూడా అంతటా ఉత్కంఠ నెలకొన్నది. కాగా, మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో అధికారులు అధికారికంగా ప్రకటించిన డివిజన్లు, వార్డుల వారి కుల ఓటర్ల జాబితా ప్రకారమే రిజర్వేషన్లు తీసుకుంటారా?, లేక ఇప్పటికే హైకోర్టుకు వెళ్లిన వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేసిన రిజర్వేషన్లు ప్రకటిస్తారా? అన్న విషయంలో సందిగ్ధం నెలకొంది. ఈ విషయంపైనే బల్దియాలో జోరుగా చర్చ సాగుతున్నది.

ఆశావహుల సందడి..
మున్సిపాలిటీల ఎన్నికలకు కోర్టు వివాదం ముగియడంతో ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావహుల్లో సందడి నెలకొంది. గతంలో అధికారులు డివిజన్లు, వార్డుల వారీగా ప్రకటించిన ఓటర్ల జాబితాను అనుసరించి తమ డివిజన్లు, వార్డులు ఎవరికి రిజర్వేషన్‌ అవుతాయన్న విషయంలో అంచనా వేసుకున్నారు. దాని ప్రకారం ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు వ్యూహాలను తయారు చేసుకుంటున్నారు. ఆగస్టులోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయన్నప్పుడే పలువురు ఔత్సాహిక నాయకులు డివిజన్లు, వార్డుల్లో జోరుగానే ప్రచారాలు ప్రారంభించారు. కాగా, ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో నగర, పట్టణ నాయకులు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...