బంద్ పాక్షికం


Sun,October 20, 2019 04:34 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కమాన్‌చౌరస్తా/ తెలంగాణ చౌక్/సుభాష్‌నగర్) ఆర్టీసీ బంద్ శనివారం జిల్లాలో పాక్షికంగా ముగిసింది. ఉదయం నుంచే కరీంనగర్ బస్టేషన్, రెండు డిపోల ఎదుట పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏసీపీలు, పలువురు సీఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు బస్టేషన్ ఆవరణలో మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు సంయమనంగా వ్యవహరించారు. బస్టేషన్ లోపలికి వెళ్లే గేటు వద్ద ఆందోళనకు దిగిన పలు పార్టీల కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కార్మికులు మాత్రం బస్టేషన్‌లోనే ఉండి బస్సులు బైటికి రాకుండా చూశారు. అయితే మధ్యాహ్నం 12.30 గంటలకు మంచిర్యాల నుంచి వచ్చిన ఓ బస్సును గమనించిన కార్మికులు ఒక్కసారిగా దానివైపు పరుగులు తీశారు. బస్సు వన్‌డిపో ఎదుట ఆగగానే తాత్కాలిక డ్రైవర్ ఎస్ అశోక్‌పై దాడికి యత్నించారు. గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై డ్రైవర్‌తోపాటు కండక్టర్ సాయికిరణ్‌కు రక్షణ వలయంగా నిలిచి వన్ డిపోకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తాత్కాలిక డ్రైవర్, కండక్టర్‌ను కార్మికులు బూతులు తిట్టారు. మరికొద్ది సేపటికి గోదావరిఖని డిపోకు చెందిన మరో బస్సు పోలీసు ఎస్కార్ట్‌తో బస్టేషన్‌లోకి వచ్చింది. ఈ బస్సుకు తాత్కాలిక డ్రైవర్‌గా ఉన్న జీ విఠల్‌పై వేడి చాయ్ పోశారు. అతనితో సహా కండక్టర్ నరేశ్‌పై దాడికి ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులు వారిని వన్ డిపోకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కార్మికుల వైపు నుంచి ఓ రాయి వచ్చి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్‌కు తగిలింది. ఆయన తప్పించునే క్రమంలో వీపుపై పడింది. లేదంటే తన తలకు తగిలేదని కానిస్టేబుల్ వాపోయాడు. మధ్యాహ్నం 12 గంటల వరకే బంద్‌కు అనుమతి ఉన్నదని మధ్యాహ్నం 1.30 అవుతోందనీ, ఇక ఆందోళన విరమించాలని వన్ టౌన్ సీఐ విజయ్‌కుమార్ కార్మికులతో మాట్లాడారు. ఆందోళన చేపట్టమని చెప్పి, బస్సులను మాత్రం బయటకి రానీయకుండా భీష్మించుకు కూర్చున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మంథని, సిద్దిపేట డిపోలకు చెందిన రెండు బస్సులు బస్టేషన్‌కు వచ్చాయి. కార్మికులు దూరంగా ఉండి కేకలు వేశారేగాని దగ్గరికి వెళ్లలేదు. అడ్డుకునేందుకు ప్రయత్నించ లేదు. కాగా, కొద్దిసేపు ఒకే చోట కలిసి ఆందోళన చేసిన విపక్షాల నాయకులు ఎవరి దారిలో వారు ఆందోళనలు చేశారు. ఎవరికీ వారే ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు.

మధ్యాహ్నం వరకే ప్రభావం..
ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు ఎంత ప్రయత్నించినా మధ్యాహ్నం వరకే బంద్ ప్రభావం కనిపించింది. నగరంలో ఉదయం చాలా దుకాణాలు తెరుచుకున్నాయి. కార్మికులు, విపక్షాల కార్యకర్తలు బైక్‌లపై తిరుగుతూ బలవంతంగా బంద్ చేయించారనే ఆరోపణలు వచ్చాయి. రాజీవ్ చౌక్‌లో ఓ సెల్‌పాయింట్ నిర్వాహకుడు సీపీఎం నాయకులతో వాగ్వాదానికి దిగాడు. ఎందుకు బంద్ పాటించాలని వారిని నిలదీశాడు. ఎంత అడ్డుకున్నా ఆ పార్టీ నాయకులు బలవంతంగా అతని దుకాణం మూయించారు. మధ్యాహ్నం 12 తర్వాత నగరంలోని అనేక చోట్ల దుకాణాలు తెరుచుకున్నాయి. అప్పటికే పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్టు చేశారు. కార్మికులు డిపోలకే పరిమితమయ్యారు. నగరంలోని పెట్రోల్ బంక్‌లు మధ్యాహ్నం నుంచే పనిచేయడం ప్రారంభించాయి. ఆటోలు, సీసీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లను మాత్రం ఎవరూ అడ్డుకోలేదు. యథావిధిగా ఈ వాహనాలు నడవడంతో ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బందులూ కలగలేదు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లోనూ బంద్ పాక్షికంగా కనిపించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే బంద్ జాడలే లేవు. శంకరపట్నం మండల కేంద్రంలో మధ్యాహ్నం వరకు ప్రభావం కనిపించింది. మానకొండూర్ మండల కేంద్రంలో బంద్ ప్రభావం అస్సలు కనిపించ లేదు. చిగురుమామిడిలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు కొద్ది సేపు రాస్తారోకో చేశారు. ఆ తర్వాత బంద్ ప్రభావమే కనిపించ లేదు. చొప్పదండిలో ఉదయం నుంచే దుకాణాలు తెరుచుకున్నాయి. ఇక్కడ బంద్ పాటించాలని చెప్పిన వారే లేకుండా పోయారు. ఇక రామడుగు మండలంలోని ముఖ్యమైన గ్రామాలైన రామగుడు, గోపాల్‌రావు పేటలో కూడా బంద్ పాటించ లేదు. తిమ్మాపూర్ మండలంలో ఉదయం కొద్ది సేపు బంద్ ప్రభావం కనిపించినా ఆ తర్వాత యథావిధిగా మారింది. మొత్తానికి ఆర్టీసీ కార్మికుల బంద్ ప్రభావం మధ్యాహ్నం వరకే కనిపించింది. అయితే ఉదయం నుంచే పరిస్థితిని గమనిస్తే ప్రజా జీవనం ఏమాత్రం స్తంభించ లేదు. ఇటు స్కూళ్లు, కాలేజీలకు ముందే సెలువులు ప్రకటించడంతో ఎవరికీ ఇబ్బంది కలగలేదు.

సాయంత్రం నడిచిన బస్సులు..
బంద్ నిర్వహించే సమయంలో మంచిర్యాల డిపోకు చెందిన ఓ బస్సు పోలీసు ఎస్కార్ట్‌తో కరీంనగర్ చేరుకుంది. ఆ తర్వాత గోదావరిఖని డిపో బస్సు, మరికొద్ది సేపటికి మంథని, సిద్దిపేట డిపోలకు చెందిన బస్సులు కరీంనగర్ బస్టేషన్‌కు చేరుకున్నాయి. ప్రయాణికులను బస్టేషన్ బయటనే దింపిన ఈ బస్సులు కొద్ది సేపు వన్ డిపో ముందు నిలిచి వెళ్లిపోయాయి. మధ్యాహ్నం వరకు కరీంనగర్ రీజియన్‌లోని గోదావరిఖని డిపోకు చెందిన 12, మంథని డిపోకు చెందిన 6 బస్సులు తిరిగినట్లు ఆర్‌ఎం పీ జీవన్ ప్రసాద్ తెలిపారు. ఇందులో మూడు బస్సులు కరీంనగర్ వరకు వచ్చి వెళ్లాయి. బస్సులకు పోలీసులు రక్షణ కల్పించారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి బస్సులు నడిపించేందుకు అధికారులు ప్రయత్నించారు. కరీంనగర్-1 డిపోలో 3, 2 డిపోలో 3, గోదావరిఖనిలో 14, మంథనిలో 9, జగిత్యాలలో 6, మెట్‌పల్లిలో 3, కోరుట్లలో 11 చొప్పున మొత్తం 49 బస్సులు నడిపినట్లు ఆర్‌ఎం జీవన్ ప్రసాద్ తెలిపారు. అద్దె బస్సుల అందుబాటులో లేక పోవడంతో అన్ని ఆర్టీసీ బస్సులనే నడిపించినట్లు ఆయన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ఆయా డిపోల మేనేజర్లు, నోడల్ అధికారులు డిపోల్లో ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. ఆర్‌ఎం జీవన్ ప్రసాద్ వన్ డిపోలో ఉండి రీజియన్‌లో పరిస్థితులను ఎప్పటికపుడు తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు నివేదించారు. మొత్తానికి చిన్న చిన్న ఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా ముగిసింది.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...