ఆదర్శ సుస్థిర గ్రామం దిశగా ఇప్పలపల్లి


Sun,October 20, 2019 04:32 AM

శంకరపట్నం: ఆదర్శ సుస్థిర గ్రామంగా ఇప్పలపల్లి నిలవాలని యునిసెఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కిషన్‌స్వామి ఆకాంక్ష వ్యక్తం చేశారు. శనివారం ఆదర్శ సుస్థిర పారిశుధ్య గ్రామ రూపకల్పనలో భాగంగా ఇప్పలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ వినోద ఆధ్వర్యంలో గ్రామస్తులకు స్వచ్ఛ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛత నినాదంగా కాకుండా విధానంగా ముందుకు సాగాలన్నారు. పరిశుభ్రత ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదనీ, అది నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. డిసెంబర్ 6న నిర్వహించే యునైటెడ్ నేషన్స్ వాలంటీర్స్ డే నిర్వహణకు ఇప్పలపల్లి గ్రామాన్ని సూచించనున్నట్లు చెప్పారు. నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం, నూరు శాతం ఇంకుడు గుంతల ఏర్పాటు, వ్యక్తిగత పరిశుభ్రత, నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించడం, ప్లాస్టిక్ వస్తువుల వాడకం తగ్గింపు, చిన్న పిల్లల మలం మరుగుదొడ్లలోనే వేయడం, తదితర అంశాల్లో గ్రామం ముందు వరుసలో ఉందని కితాబిచ్చారు. దీనిని నిరంతర ప్రక్రియగా కొనసాగించుటకు పలు సూచనలు చేశారు. ఎస్‌బీఎం కన్సల్టెంట్ రమేశ్ చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పైపు కంపోస్ట్ విధానంలో తడి చెత్తను ఎరువుగా మార్చుకునే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపారు. గ్రామంలో 10 చోట్ల పైపు కంపోస్ట్ పద్ధతిని ఏర్పాటు చేశారు. పారిశుధ్య వస్తువుల కొనుగోలుకు పలువురు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుటకు నిబద్ధతతో కృషి చేస్తున్న సఫాయి కార్మికుడు బొజ్జ లక్ష్మయ్యను ఘనంగా సన్మానించారు. 30 రోజుల ప్రణాళిక సందర్భంగా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలు లవారెడ్డి (గ్రామ పంచాయతీ కార్యదర్శి), పంజాల స్వామి, లకా్ష్మరెడ్డి, లక్ష్మీనారాయణ, తదితరులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ బైరి సంపత్, ఉప సర్పంచ్ వెంగల శ్రీనివాస్, ఎంపీఓ సురేందర్, క్లస్టర్ ఫెసిలిటేటర్ అనూష, కార్యదర్శి లవారెడ్డి, ఏపీఎం సుధాకర్, వార్డు సభ్యులు, సీసీలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles