సజావుగా రాకపోకలు


Sun,October 13, 2019 12:40 AM

- ఎనిమిదో రోజు 85 శాతం నడిచిన సర్వీసులు
- నేటి నుంచి పెరగనున్న మరిన్ని బస్సులు
- రీజియన్‌లో 15 బస్సుల్లో టికెట్ల విధానం అమలు
- నేడు మరిన్ని వాహనాల్లో..
- పెద్ద సంఖ్యలో తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు
- ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ప్రాధాన్యత
- నేడు ఆయా డిపోలకు వెళ్లాలని ఆర్‌ఎం విజ్ఞప్తి

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆర్టీసీలో కార్మికుల సమ్మె కొనసాగుతున్నా బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.. ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో రాకపోకలు ఎప్పట్లాగే సజావుగా సాగుతున్నాయి.. ఎనిమిదో రోజు శనివారం 366 ఆర్టీసీ, 202 అద్దె బస్సులు (85 శాతం) తిరిగాయి.. వీటితోపాటు 19 స్కూల్‌, 62సీసీ బస్సులు, 230మ్యాక్సీ క్యాబ్‌లు నడిచాయి. ప్రయాణికులు ఇబ్బందిపడకుండా, సంస్థకు ఆర్థికంగా నష్టం రాకుం డా చూసుకునేందుకు అధికారులు 15బస్సుల్లో టికెట్లు ప్రవేశ పెట్టారు. అనుభవజ్ఞులైన విశ్రాంత ఉద్యోగుల సేవలను నేటి నుంచి వినియోగించుకోవడంతోపాటు మరిన్ని బస్సులు నడుపనున్నారు.

ఆర్టీసీలో కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఇది వరకు పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగులు, కార్మికుల సేవలను వినియోగించుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రోజు వారీగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుంటున్న అధికారులు ఆదివారం నుంచి విశ్రాంత ఉద్యోగులైన వోల్వో బస్సు డ్రైవర్లు, నిర్వాహకులకు రోజు వారీగా భారీ వేతనం అందించి సేవలు వినియోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వోల్వో బస్సు డ్రైవర్లకు, నిర్వాహకులకు రోజుకు 2 వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. అలాగే ఐటీఐ సాఫ్ట్‌వేర్‌లో అనుభవమున్న వారికి 1,500, ఇతర విభాగాల్లో అనుభవమున్న వారికి 1000 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. డ్రైవర్లు, విశ్రాంత డ్రైవర్లకు 1,500, కండక్టర్లు, విశ్రాంత కండక్టర్లకు 1000, వివిధ విభాగాల్లో పనిచేసి విశ్రాంతి పొందుతున్న ఆఫీసర్లకు 1,500, విశ్రాంత మెకానిక్‌లు, సూపర్‌వైజర్లకు 1,500, మెకానిక్‌, శ్రామిక్‌, క్లరికల్‌ స్టాఫ్‌తో పాటు ఇతర విభాగాల్లో పనిచేసే వారికి 1,000 చెల్లించి రోజు వారీగా సేవలు వినియోగించుకోనున్నామని ఆర్టీసీ ఆర్‌ఎం పీ జీవన్‌ ప్రసాద్‌ తెలిపారు. ఆసక్తి ఉన్నవారి ఆదివారం ఉదయం అందుబాటులో ఉన్న డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

యథావిధిగా నడిచిన బస్సులు..
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు. శనివారం 670 బస్సులు నడపాల్సి ఉండగా 366 ఆర్టీసీ, 202 అద్దె బస్సులను నడిపించారు. మరో 19 స్కూల్‌, 62 సీసీ బస్సులు, మరో 230 వరకు మ్యాక్సీ క్యాబ్‌లు నడిపించారు. ఆర్టీఏ కమిషనర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నుంచే కొన్ని బస్సుల్లో టికెట్లు ప్రవేశ పెట్టారు. అద్దె బస్సుల తప్పనిసరిగా డిపోల్లో రిపోర్టు చేసి వెళ్లాలని ఆదేశాలిచ్చారు. రీజియన్‌ పరిధిలో 15 బస్సుల్లో టికెట్లు ప్రవేశ పెట్టారు. ఆదివారం మరిన్ని బస్సుల్లో టికెట్లు ప్రవేశ పెడుతున్నట్లు ఆర్‌ఎం తెలిపారు. కరీంనగర్‌తోపాటు పలు చోట్ల ఉన్న బస్టాండ్లలో జనం కిటకిటలాడారు. ప్రతి చోట ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు నడిపించారు. ఈ రోజు 85 శాతానికిపైగా బస్సులు నడిపించారు. నేటి నుంచి మరిన్ని బస్సుల సంఖ్యను పెంచి, నడిపించనున్నారు. కాగా, ఆర్టీఏ అధికారుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల సభ్యులు పలు చోట్ల తనిఖీలు చేశారు.


37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...