చార్జీల లెక్క పక్కాగా..


Sat,October 12, 2019 01:35 AM

-ప్రయాణికుల ప్రయోజనాలే లక్ష్యంగా ఆర్టీసీ యంత్రాంగం చర్యలు
-నేటి నుంచి కొన్ని రూట్లలో టికెట్ల విధానం
-అంచెలంచెలుగా అన్ని రూట్లలో ప్రవేశపెట్టే యోచన
-డిపోల్లో ప్రతి అద్దె బస్సూ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
-తనిఖీలకు రీజియన్‌లో పది ఆర్టీఏ బృందాలు
-ప్రతి డిపోకూ ముగ్గురు రెవెన్యూ శాఖ ఆపరేటర్లు
-ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సాఫీగా ప్రజారవాణా
-ఏడో రోజు తిరిగిన 130 బస్సులు

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం నాటికి ఏడో రోజుకు చేరుకున్నది. ప్రయాణికులు ఇబ్బంది పడవద్దన్న ఉద్దేశంతో ప్రభు త్వం ఆదేశాలు ఇవ్వగా, యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దాంతో మొదటి రోజు నుంచి సమ్మె ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. ప్రయాణికులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. ప్రజా రవాణా సాఫీగా సాగుతున్నది. కానీ, ఆర్టీసీకి వచ్చే ఆదాయానికి మాత్రం నిత్యం గండి పడుతూనే వచ్చింది. తాత్కాలికంగా నియమించుకుంటున్న డ్రైవర్లు, కండక్టర్లు చార్జీల పక్కన పెట్టి ఇష్టారీతిలో వసూలు చేయడం, ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తాన్ని డిపోల్లో అప్పగించక పోవడంతో ఏ బస్సులో ఎంత మంది ప్రయాణించారు? ట్రిప్పు ట్రిప్పుకు వచ్చే ఆదాయం ఎంత? అనేది లెక్క లేకుండా పోయింది. దీంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడింది. అటు ప్రజలు కూడా నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఆర్టీసీని నమ్ముకుని ఉన్న ప్రయాణికుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం నష్టం భరిస్తూనే బస్సులు నడిపింది. బుధవారం (ఈ నెల 9న) రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేసిన తర్వాత కొంత ఆదాయం పెరిగింది. పూర్తి స్థాయిలో ఆదాయం రాబట్టుకునేందుకు తాత్కాలిక కండక్టర్ల ద్వారానే టికెట్లు, టిమ్ మిషన్ల విధానాలను అమలు చేయాలని యంత్రాంగం యోచిస్తున్నది.

నేటి నుంచి కొన్ని రూట్లలో టికెట్లు..
ఆర్టీసీలో అమలవుతున్న ప్రత్యామ్నాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రవాణా శాఖ కమిషనర్ శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీఏ, ఆర్టీసీ అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు కొన్ని రూట్లలో టికెట్లు ప్రవేశ పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఏ రూట్ల లో ప్రవేశ పెట్టేది స్పష్టమైన సమాచారం లేదు. డిపోల వారీగా ఉన్న టికెట్ల స్టాక్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ ఆర్‌ఎం పీ జీవన్ ప్రసాద్ తెలిపారు. ఏడు రోజులుగా ఆర్టీసీ బస్సులు పెద్ద సంఖ్యలో నడుస్తున్నా ఆదాయం అంతంత మా త్రమే రావడానికి మరో కారణం కూడా ఉంది. ఆర్టీసీలో అద్దె విధానంలో కొనసాగుతున్న బస్సులకు కిలో మీటర్‌కు 15 చొప్పున చెల్లిస్తుంటారు. అద్దె బస్సులు రీజియన్‌లో 206 వరకు ఉన్నాయి. కానీ, 203 మాత్రమే సేవలందిస్తున్నాయి. అద్దె బస్సుల యజమానులు కూడా సమ్మె మొదలైన ఆరు రోజుల్లో ఇష్టారీతిగా నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బస్సు డిపోలకు పోకుండా బస్టాండ్లకు రాకుండా ఇష్టారీతిలో నడుపుతూ, అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు దృష్టికి వచ్చింది. దీంతో అద్దె బస్సులను కూడా నియంత్రించేందుకు అధికారులు పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు. సమ్మెకు ముందులాగే ప్రతి అద్దె బస్సు సంబంధిత డిపోల్లో రిపోర్టు చేసిన తర్వాతే వాటికి కేటాయించిన రూట్లలో నడపాలని నిర్ణయించారు.

రీజియన్‌లో 10 ఆర్టీఏ బృందాలు..
ఆర్టీసీ ఆదాయాన్ని పూర్తి స్థాయిలో రాబట్టే ప్రయత్నంలో ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో ప్రతి డిపోకు ఒక ఆర్టీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డీటీసీ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీఏ శాఖలోని మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పుడు అదే అధికారుల నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్-1 డిపోకు ఏఎంవీఐ జీ కవిత, కరీంనగర్-2 డిపోకు ఏఎంవీఐ ఎండీ సంధాని, హుజూరాబాద్‌కు ఎంవీఐ టీ ఈశ్వర్ సింగ్, గోదావరిఖనికి ఏఎంవీఐ టీ మధు, మంథనికి ఏఎంవీఐ కోల రవీందర్, జగిత్యాలకు ఏఎంవీఐ అభిలాష్, మెట్‌పల్లికి ఏఎంవీఐ జీ శివస్వప్న, కోరుట్లకు ఏఎంవీఐ పీ రవికుమార్, సిరిసిల్లకు ఏఎంవీఐ టీ విజయ్‌కుమార్, వేములవాడకు ఏఎంవీఐ ఏ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఏర్పాటు చేశారు. ఈ డిపోల పరిధిలో నడిచే ప్రతి బస్సునూ ఆపి ఈ బృందాల సభ్యులు తనిఖీలు చేస్తారు. చార్జీల వసూలు నుంచి డ్రైవర్ల పనివిధానం వరకు అన్ని విధాలుగా వీరు ప్రయాణికులను అడిగి తెలుసుకుంటారు. అతిక్రమించిన వారిపై అప్పటికప్పుడే చర్యలు తీసుకుంటారు. శనివారం నుంచి ఆర్టీసీ అధికారులు ఏ రూట్లలో టికెట్లు ప్రవేశ పెడతారు, ఏ రూట్లలో టిమ్ మిషన్లను ఇస్తారనే సమాచారం ఈ బృందాలకు ఎప్పటికపుడు అందుతుంది. దీనిని బట్టి ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. అవసరమైతే పోలీసుల సహకారాన్ని కూడా తీసుకోనున్నారు.

తిమ్మాపూర్‌లో ఆర్టీఏ హెల్ప్‌లైన్..
జిల్లాకొకరి చొప్పున ఇది వరకే ఆర్టీసీ అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీఏ ఆధ్వర్యంలో కూడా 24 గంటలు పనిచేసే విధంగా హెల్ప్‌లైన్ ప్రారంభిస్తున్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీఏ ఉప కమిషనర్ కార్యాలయంలో ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇందులో అధిక చార్జీలు వసూలు చేసినా, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు దురుసుగా ప్రవర్తించినా, రాష్ డ్రైవింగ్ చేసినా, ఇతర ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్‌లైన్ నంబర్ 9391578144కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని డీటీసీ శ్రీనివాస్ తెలిపారు. అయితే బస్సు నంబర్‌తోపాటు ప్రయాణిస్తున్న సమయాన్ని ప్రయాణికులు తప్పని సరిగా తెలపాలని కోరారు. టికెట్లు ప్రవేశ పెట్టిన రూట్లలో టికెట్ ఇవ్వకుండా చార్జీలు వసూలు చేసినా, టికెట్లు కేటాయించని రూట్లలో నిర్దేశించిన పట్టికకు మించి చార్జీలు వసూలు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని టీడీసీ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

అంచెలంచెలుగా అన్ని రూట్లలో టికెట్లు..
సమ్మె నేపథ్యంలో సంస్థ గాడి తప్పకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇతర శాఖల ఉద్యోగులను కేటాయించాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు.. రెవెన్యూ శాఖ నుంచి ప్రతి డిపోకు ముగ్గురు ఆపరేటర్లను కేటాయించారు. వీరు శనివారం నుంచి విధుల్లోకి వస్తారు. టిమ్ మిషన్ల ఆపరేటింగ్ గురించి తాత్కాలిక కండక్టర్లకు వీరు అవగాహన కల్పిస్తారు. అంతే కాకుండా డిపోలో అవసరమైన సేవలందిస్తారు. వీరిని డిప్యూట్ చేస్తూ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే శనివారం నుంచి కొన్ని రూట్లలో తప్పని సరిగా టికెట్లు ప్రవేశ పెట్టాలన్న ఆదేశాలు ఉండగా, రెవెన్యూ శాఖ కంప్యూటర్ ఆపరేటర్లను వినియోగించుకుని టిమ్ మిషన్లను ఉపయోగంలోకి తేవాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. అయితే టికెట్లు ఆయా డిపోల్లో ఎంత స్టాక్ ఉన్నాయనేది తేలిన తర్వాతనే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఆర్‌ఎం అన్ని డిపోల మేనేజర్లతో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చించారు.

యథావిధిగా నడిచిన బస్సులు..
సమ్మె ఆరో రోజుకు చేరుకున్నా ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాగుతున్నాయి. శుక్రవారం 670 బస్సులు నడపాల్సిన చోట 388 ఆర్టీసీ, 198 అద్దె చొప్పున 586 బస్సులు నడిపారు. అంటే అన్ని రూట్లలో 87 శాతానికి మించి బస్సులు నడిచాయి. ఇవేకాకుండా 19 స్కూల్ బస్సులు, 62 కాంట్రాక్టు క్యారియర్ బస్సులు, మరో 250 మాక్సి క్యాబ్‌లు నడిచినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్ తెలిపారు. దీంతో ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూశామన్నారు. కరీంనగర్ బస్టేషన్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులు సాధారణ స్థితిలో కనిపించారు. ఎక్కడ కూడా బస్సులు రావడం లేదనే ఫిర్యాదులు రాలేదు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...