మూడో రోజూ రయ్ రయ్!


Tue,October 8, 2019 03:29 AM

-యథాతథంగా నడిచిన ఆర్టీసీ, అద్దె బస్సులు
- రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంపు
- అన్ని రూట్లలోనూ రవాణా
- కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
కరీంనగర్ ప్రతినిధి/రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ సమ్మె మూడో రోజు కాస్త రద్దీ పెరిగింది. అన్ని బస్‌స్టేషన్లలో సందడి కనిపించింది. కరీంనగర్ రీజియన్‌లో మధ్యాహ్నం వరకు 589 బస్సులు నడపాల్సి ఉండగా, 487 తిరిగాయి. సాయంత్రం 6 గంటల వరకు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే 302 ఆర్టీసీ బస్సులు, 203 అద్దె బస్సులు నడిచాయి. మరో 57 పాఠశాల బస్సులు, మరో 43 కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులు నడిచాయి. ప్రజలు ఇబ్బంది పడవద్దన్న ఉద్దేశ్యంతోపాటు ఆర్టీసీపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు మూడు రోజులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. సోమవారం కావడంతో వేములవాడకు వెళ్లే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆ రూట్లో బస్సులు పెంచారు. మొత్తంగా చూస్తే సోమవారం మధ్యాహ్నం వరకు రీజియన్‌లో 85 శాతం బస్సులు నడిచాయి. ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ఈ రోజు 302 మంది తాత్కాలిక డ్రైవర్లు, మరో 302 మంది కండక్టర్లను నియమించారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను రోజు వారీగా నియమిస్తున్నారు.

అన్ని రూట్లలో పెరిగిన సర్వీసులు..
కరీంనగర్ రీజియన్‌లోని పది బస్సు డిపోల పరిధిలో అన్ని రూట్లలో సోమవారం సర్వీసులు పెంచారు. మంగళవారం దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల మధ్య బస్సులు పెంచి నడిపారు. జగిత్యాల, సిరిసిల్ల నుంచి కాంట్రాక్టు క్యారియర్స్ కూడా ఎక్కువగానే నడుస్తున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లాలో రైలు సదుపాయం లేని మార్గాల్లోనూ ఎక్కువ బస్సులు తిరిగాయి. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు సోమవారం ఒక్క రోజు 120కిపైగా బస్సులు నడిపినట్లు ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్ తెలిపారు. సోమవారం మొత్తంగా 589 బస్సులు నడపాల్సి ఉండగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 288 ఆర్టీసీ, 199 అద్దె బస్సుల చొప్పున 487 బస్సులు నడిపారు. సాయంత్రం 6 గంటల వరకు 302 ఆర్టీసీ బస్సులు, 203 అద్దె బస్సుల చొప్పున మొత్తం 505 బస్సులు నడిపారు. రీజియన్‌లో అందుబాటులో ఉన్న 206 అద్దె బస్సుల్లో కొద్ది రోజులుగా 3 బస్సులు సేవలు అందించడం లేదు. 203 అద్దె బస్సులు ఉండగా సోమవారం అన్ని బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు. మరోపక్క కార్మికుల సమ్మె కొనసాగుతుండగా, పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...