నేటి నుంచే ఆర్మీ ర్యాలీ


Mon,October 7, 2019 02:52 AM

కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లా కేంద్రంలోని డాక్టర్ బఆర్ అంబేద్కర్ స్టేడియంలో సోమవారం ఆర్మీ రిక్రూట్‌ర్యాలీ ప్రారంభం కానున్నది. ఈ నెల 17 వరకు పది రోజుల పాటు జరిగే ఈ ర్యాలీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 46,734 మంది యువకులు హాజరుకానున్నారు. హెడ్‌క్వార్టర్ రిక్రూట్‌మెంట్ జోన్ చైన్నై పరిధిలోని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న ర్యాలీలో సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ ఫార్మా, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మన్ ఉద్యోగాల కోసం అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుండగా మొదట యువకుల ఆడ్మిట్ కార్డును పరిశీలించి స్టేడియంలోకి అనుమతి ఇస్తారు. 1.6 కిలోమీటర్లను 5 నిమిషాల 30 సెకండ్లలోపు పూర్తిచేసిన వారినే ఇతర శారీరక పరీక్షలకు అనుమతి ఇస్తారు. అనంతరం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి సికింద్రాబాద్‌లో జరిగే రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. దీనిలో ఉత్తీర్ణలైన వారికి సంవత్సరం పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

వాటిని విజయవంతంగా పూర్తి చేసిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వచ్చే యువకులకు కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నారు. పచ్చబొట్లు, దొడ్డికాళ్లు, ఇతర శారీరక లోపాలు, అంధత్వం, గుండె జబ్బులు ఉంటే అనుమతి నిరాకరిస్తారు. కాగా, ఈ సంవత్సరం నుంచి కొత్తగా మరో నిబంధన చేర్చారు. ర్యాలీకి వచ్చే యువకులు నీట్‌గా షేవ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. శారీరక, వైద్య పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా రాత్ర పరీక్షలకు యువకులను ఎంపిక చేస్తారు. అడ్మిట్ కార్డులో ఉన్న తేదీ, సమయం ప్రకారమే ర్యాలీకి రావాలి. ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి సుమారు 4 వేల మంది అభ్యర్థులకు అర్హత పరీక్షలు నిర్వహిస్తుండగా మధ్యాహ్నం వరకు పరుగు పందెం, ఇతర శారీరక పరీక్షలను పూర్తి చేయనున్నారు.

ఏర్పాట్ల పరిశీలన..
సోమవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభం కానున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను జేసీ, నోడల్ అధికారి జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ ఆర్మీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని 33 జిల్లాల నుంచి సుమారు 46 వేల మంది యువకులు పాల్గొంటున్నారనీ, 10 రోజుల పాటు ఈ ర్యాలీ జరుగుతుందన్నారు. ర్యాలీ నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరుపున బారికేడ్లు, రన్నింగ్ ట్రాక్, 10 రోజుల పాటు మెడికల్ క్యాంప్, 108 సేవలు, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, తాత్కలిక మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జేసీ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్మీ అధికారులు, ఏసీపీ అశోక్, జిల్లాకు చెందిన పలు విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...