మా వాళ్లను రప్పించరూ..


Mon,October 7, 2019 02:51 AM

వీర్నపల్లి : ఉపాధికోసం మస్కట్‌కు వెళ్లిన వీర్నపల్లి వాసుల ఆశలు నిరాశగానే మిగిలాయి. హత్య కేసులో జైల్లో మగ్గుతూ, తొమ్మిదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..వీర్నపల్లి మండలం బాబాయి చెరువుతండాకు చెందిన మూడవత్ నాజ్య, బావుసింగ్ నాయక్ తండాకు చెందిన భూక్య సరియా, రంగంపేటకు చెందిన అజ్మీరా వస్రామ్, కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన లకావత్ నారాయణ కలిసి 2002లో కంపెనీ వీసాపై మస్కాట్‌కు వెళ్లారు. అందరూ కలిసి ఒకే గదిలో ఉంటూ డ్యూటీకి వెళ్లేవారు. కొద్దిరోజుల తర్వాత కంపెనీ నుంచి బయటకు వచ్చి పనులు చేశారు. 2009లో లకావత్ నారాయణను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేయగా, అతనితో కలిసి ఉన్న నాజ్య, సరియా, వస్రామ్‌లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించా రు. క్షమాభిక్ష పిటిషన్‌లో జాప్యం జరగడంతో ముగ్గురికి 21 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. గత తొమ్మిదేళ్లుగా జైల్లో మగ్గుతున్న తమ వారిని విడిపించాలంటూ బాధితుల కుటుంబీకులు రోదిస్తున్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో ప్రతినెలా కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారని అజ్మీరా వస్రామ్ భార్య హంసవ్వ తెలిపింది. కాగా సంబంధం లేని కేసులో తమవారిపై నేరం మోపి జైల్లో ఉంచారనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...