అదుపులోనే జ్వరాలు


Tue,September 17, 2019 03:04 AM

సీజనల్ వ్యాధులపై గత మే నుంచి తీసుకున్న ముందస్తు చర్యలతో ప్రజల్లో అవగాహన పెరిగిందనీ, జిల్లాలో జ్వరాలు పూర్తిగా అదుపులో ఉన్నాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ రాంమనోహర్ రావు స్పష్టం చేశారు. సోమవారం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, జ్వరాల నియంత్రణకు చేపట్టిన చర్యలను వివరించారు. ఇప్పటి వరకు 78 చోట్ల వైద్య శిబిరాలు నిర్వహించామనీ, 76 డెంగీ కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయనీ, ఎప్పటికప్పుడు తీసుకున్న జాగ్రత్తలతో మరణాలు నమోదుకాలేదని వెల్లడించారు. తెల్లరక్త కణాలు పడిపోయిన ప్రతి రోగికీ డెంగీ వచ్చినట్లు కాదనీ, డెంగీని కేవలం ప్రభుత్వ దవాఖానలోనే నిర్ధారిస్తున్నామని చెప్పారు. కొన్ని ప్రైవేట్ దవాఖానలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేట్ కంటే సర్కారు వైద్యశాలల్లోనే మెరుగైన వైద్యం అందుతున్నదనీ, అపోహలను వీడి ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా వ్యాప్తంగా జ్వరాలు పూర్తిగా నియంత్రణలోనే ఉన్నాయనీ, సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ రాంమనోహర్ రావు తెలిపారు. జిల్లాలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, జ్వరాలు రాకుండా ముందస్తుగా తీసుకున్న చర్యలు, ప్రైవేటు దవాఖానల దోపిడీపై పర్యవేక్షణ వంటి అంశాలపై నమస్తే తెలంగాణతో కూలంకశంగా సమాధానమిచ్చారు.

జిల్లాలో జ్వరాల పరిస్థితి ఎలా ఉంది.. నివారణకు తీసుకుంటున్న చర్యలు?
పూర్తిగా అదుపులో ఉన్నాయి. మంత్రి ఈటల రాజేందర్ ఒకసారి హుజూరాబాద్‌లో, మరోసారి కరీంనగర్‌లో రివ్యూ తీసుకున్నపుడు ఇచ్చిన సలహాలు, సూచనలు ఆచరణలో పెడుతున్నాం. ప్రతి సీజన్‌లో జ్వరాలు రావడం సర్వసాధారణం. కాబట్టి నియంత్రించే ప్రయత్నాలు తప్పక చేయాలి. నిరుటితో పోల్చి చూసుకుంటే ఈ సీజన్‌లో జ్వరాలు చాలా తక్కువ. గత ఐదేళ్లలో డెంగీ వ్యాధి బారిన పడిన వారి లెక్కలే తీసుకుంటే 2015లో 143, 2016లో 72, 2017లో 167, 2018లో 216 మందిలో డెంగీ లక్షణాలు కనిపించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 76 మందిలోనే ఈ లక్షణాలు కనిపించాయి. మామూలు విష జ్వరాలు కూడా చెప్పుకోదగ్గ రీతిలో లేవు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మా శాఖతో పాటు ఇతర శాఖలు తీసుకున్న ముందస్తు చర్యలు కారణంగా చెప్పవచ్చు.

ముందస్తు చర్యలు ఎప్పుడు తీసుకున్నారు.. ఎలాంటివి తీసుకున్నారు.?
జిల్లాలో మొత్తం 139 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. వీటి పరిధిలోని పంచాయతీలతో కలిసి పారిశుధ్య పనులు చేపట్టేందుకు ప్రతి ఉప కేంద్రానికి రూ.10 వేలు మంజూరు చేశాం. వీటిలో బ్లీచింగ్ ఫౌడర్, క్లోరినేషన్ మాత్రలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ప్రతి ఉప కేంద్రం ద్వారా కొనుగోలు చేసి పంచాయతీలకు అందించాం. డయేరియా నివారణ మాత్రలు గ్రామాల్లో పంపిణీ చేశాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా గ్రామస్తుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ఫీవర్ సర్వే పేరుతో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో ఇంటింటి సర్వే చేయించాం. ఎస్ ఫాం ద్వారా వీటి నివేదికలు తెప్పించుకున్నాం. ప్రతి శనివారం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని జ్వరాల పరిస్థితిపై సమీక్షలు నిర్వహించాం. ఎక్కడైనా జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటే అక్కడికి ర్యాపిడ్ యాక్షన్ టీంను పంపించి వైద్య శిబిరాలు నిర్వహించాం. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు 78 శిబిరాలు నిర్వహించాం. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో ఉండే ఈ ర్యాపిడ్ యాక్షన్ టీంలో ఇద్దరు వైద్యులు, సూపర్‌వైజర్లు, ఒక హెల్త్ ఎడ్యుకేటర్, మాస్ మీడియా టీం ఉంటుంది. వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించడంతోపాటు పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపైనా ఈ బృందం అవగాహన కల్పిస్తుంది. ఇందుకోసం టీంలోని మాస్ మీడియా సభ్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాం. మే, జూన్ నెలల నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

ప్రస్తుత సీజన్‌లో పీహెచ్‌సీలకు వచ్చే రోగుల సంఖ్య పెరిగిందా?, రోజుకు ఎంత మందిని పరీక్షిస్తున్నారు. ఓపీ పరిస్థితి?
ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత ఓపీ పెరిగింది. సాధారణంగా ఒక్కో పీహెచ్‌సీలో సగటున రోజుకు 100 మంది కాగా, సీజన్‌లో పది శాతం పెరిగింది. సగటున 110-120 మందికి ఒక్కో పీహెచ్‌సీలో ఓపీ నడుస్తోంది. జ్వరంతో వచ్చే వారికి రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తున్నాం. జ్వరం విపరీతంగా ఉంటే పీహెచ్‌సీల్లోనే అడ్మిట్ చేసుకుని కుదుట పడిన తర్వాతనే పంపిస్తున్నాం. పరిస్థితి విషమంగా ఉంటే ఏరియా దవాఖానలకు దగ్గరుండి తీసుకెళ్తున్నాం. నెలలో ఒక్కో పీహెచ్‌సీలో 3 నుంచి 4 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాం.

మెడికల్ ఎమర్జెన్సీ ఉంది కదా.. వైద్యులు, సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు?
చాలా బాగా పనిచేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వడం లేదు. ఉదయం 9 గంటలకల్లా పీహెచ్‌సీ, సబ్ సెంటర్లలో ఉండాలి. జిల్లాలో మొత్తం 16 పీహెచ్‌సీలు ఉండగా గంగాధర, చొప్పదండి, చల్లూరు, వావిలాల, శంకరపట్నం పీహెచ్‌సీల్లో 24 గంటల వైద్య సేవలు అందిస్తున్నాం. ఇందులో నిత్యం వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇక్కడ ఉదయం, సాయంత్రం ఓపీ నిర్వహిస్తున్నాం. ఇక మరో 10 రెగ్యులర్ పీహెచ్‌సీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ఓపీలో ఎక్కువ మంది ఉంటే రెండు మూడు గంటలు అదనంగా పని చేస్తున్నారు. సిబ్బంది పర్యవేక్షణ కూడా పకడ్బందీగా జరుగుతోంది. ప్రతి రెండు పీహెచ్‌సీలకు ఒక ప్రోగ్రాం ఆఫీసర్‌ను నియమించాం. ప్రతి నిత్యం ఈ ఆఫీసర్ పీహెచ్‌సీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. సాయంత్రం నివేదిక ఇస్తారు. దాని ఆధారంగా జిల్లా స్థాయిలో మేం పర్యవేక్షిస్తున్నాం..

* డెంగీ, విష జ్వరాల తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించారా?, అక్కడ తీసుకుంటున్న చర్యలు?
ఒక ప్రాంతమని కాకుండా కొత్తపల్లి పెరి అర్బన్, కరీంనగర్ అర్బన్ పరిధిలో కొంత ఎక్కువ జ్వరాలు ఉన్నట్లు గుర్తించాం. డెంగీ కేసులు కూడా ఇక్కడే ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తపల్లి పరిధిలోని 19 డెంగీ కేసులను గుర్తించాం. కరీంనగర్ అర్బన్‌లో 20, ఇక పీహెచ్‌సీల పరిధిలో చూస్తే చిగురుమామిడిలో 3, మానకొండూర్‌లో 6, రామడుగులో 2, తిమ్మాపూర్‌లో 7, చొప్పదండిలో 4, గంగాధరలో 6, సైదాపూర్‌లో 2, శంకరపట్నంలో 3, చల్లూరులో 1, వావిలాలలో 2, వీణవంకలో 1 కేసు నమోదైంది. జనవరి నుంచి ఇప్పటి వరకు డెంగీగా అనుమానించి 1,664 మందికి ఎలిసా పరీక్షలు నిర్వహించగా కేవలం 76 మందికి మాత్రమే డెంగీ నిర్దారణ జరిగింది. ఇక అనుమానిత 246 మందిని పరీక్షిస్తే కేవలం నలుగురిలో చికెన్ గున్యా, 17,345 మందిని పరీక్షిస్తే కేవలం ఐదుగురిలో మలేరియా లక్షణాలు కనిపించాయి. చికెన్ గున్యా, మలేరియా వ్యాధులు దాదాపు నియంత్రణలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది..

డెంగీ నిర్ధారణ ఎలా జరుగుతోంది.?
డెంగీని నిర్ధారించేది కేవలం ప్రభుత్వ దవాఖాన మాత్రమే. ఎలిసా పరీక్షలు నిర్వహించే యంత్రాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. తెల్లరక్త కణాలు పడిపోయిన ప్రతి రోగికి డెంగీ సోకినట్లు కాదు. ఎలిసా పరీక్షలు నిర్వహిస్తే తప్ప డెంగీ నిర్ధారణ కాదు. కొన్ని ప్రైవేట్ దవాఖానాల్లో ఇదే జరుగుతోంది. పాపం నిరుపేదలను నిలువునా దోచుకుంటున్నారు. డెంగీ పేరిట లేని పోని భయాలు కల్పిస్తున్నారు. ఆడ్మిట్ అయినపుడు లక్షల్లో ఉన్న తెల్లరక్త కణాలు రోజు రోజుకూ పడిపోతున్నాయని భయపెడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి పరీక్షలు నమ్మద్దు. కేవలం ప్రభుత్వ దవాఖానల్లో మాత్రమే ఎలిసా, ఎన్‌ఎస్-1, ఆర్‌డీటీ పరీక్షలు నిర్వహిస్తారు. వీటి తర్వాతనే డెంగీ నిర్దారించాల్సి ఉంటుంది. దీనికొక కమిటీ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు..

ప్రైవేట్ దవాఖానల్లో దోపిడీ పెరిగిందనీ, దానిని నియంత్రించాలని ఇటీవల మంత్రి ఈటల మీకు ఆదేశాలు ఇచ్చారు. ఎంత వరకు వచ్చింది.?
అదే పనిలో ఉన్నాం. జిల్లాలో మొత్తం 310 ప్రైవేట్ దవాఖానలు, 49 డయాగ్నో సెంటర్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఒక సర్క్యులర్ జారీ చేస్తున్నాం. ప్రతి 15-20 ప్రైవేట్ దవాఖానలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ పర్యవేక్షణలో ఈ బృందాలు పనిచేస్తాయి. ప్రతి రోజూ ప్రైవేట్ దవాఖానలను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ఆయా దవాఖానలకు ఎలాంటి రోగులు వస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సోకింది విషజ్వరమా, ఇతర వ్యాధులా, ఇలా ప్రతి రోగిపై ప్రతి విషయాన్ని సేకరించి ప్రతి రోజూ సాయంత్రం నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇస్తున్నాం. ప్రైవేట్ దవాఖానల్లో దోపిడీ అడ్డగోలుగా జరుగుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కొక్కరు పశువులు, బంగారం, ఆస్తులు అమ్ముకుంటున్నారు. అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. మామూలు జ్వరాలకు కూడా అవసరం లేని పరీక్షలు చేస్తూ భయానికి గురి చేస్తున్నారు. ఇవన్నీ రోగుల నుంచి నిత్యం మాకు ఎదురవుతున్న అనుభవాలు. మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలతో ఇలాంటి చర్యలను పూర్తిగా అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు.

ప్రభుత్వ వైద్య సేవలు ఇంత బాగా అందుతుండగా రోగులు ప్రైవేట్‌కు ఎందుకు పోతున్నారు?
నిజం చెప్పాలంటే ప్రైవేట్ కంటే ప్రభుత్వ దవాఖానాల్లోనే మెరుగైన వైద్యం లభిస్తోంది. ప్రభుత్వ వైద్యులు ప్రత్యేకంగా శిక్షణ పొంది ఉంటారు. ప్రతి దవాఖానలో వైద్య బృందాలు ఉంటాయి. ఇందులో ఒక్కో విభాగం నుంచి నిష్ణాతులైన వైద్యులుంటారు. ప్రైవేట్ కంటే వీరు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. కానీ, ప్రజల్లో ఒక అపోహ ఉంది. దయచేసి నేనొక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి అపోహలు మానుకోండి. చిన్న జ్వరానికే లక్షలు ఖర్చు చేయకండి. ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. మా సేవలను వినియోగించుకోండి. మునుపటిలా ప్రభుత్వ వైద్యులు పట్టింపు లేకుండా వ్యవహరించడం లేదు. ప్రతి రోగి విషయంలో పర్యవేక్షణ జరుగుతోంది. ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావులేదు. మేము మీ సేవ కోసమే ఉన్నామనే విషయాన్ని మర్చిపోకండి. ముఖ్యంగా పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రభుత్వ వైద్యాన్ని నమ్మి మా వద్దకు రండి. ఇపుడు డెంగీ బూచిని చూపి కొన్ని ప్రైవేట్ దవాఖానలు విపరీతంగా దోపిడీ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రైవేట్ దవాఖానల్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న రోగుల కోసం లెఫ్ట్ అగనెస్ట్ మెడికల్ అడ్వజరీ (లామా) అనే విధానాన్ని వినియోగించుకుని ప్రభుత్వ దవాఖానాలకు రండి. మేము అంతకన్నా మెరుగైన వైద్యాన్ని అందించి మీ ప్రాణాలు కాపాడుతాం.

ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో రోగులకు సరిపడా మందులు ఉన్నాయా?
మందులకు ఎక్కడా కొరత లేదు. గత మే, జూలై నెలల్లోనే అన్ని పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లకు మందులు సరఫరా చేశాం. ఆశా వర్కర్ల వద్ద కూడా అందుబాటులో ఉంచాం. ముఖ్యంగా బ్లీచింగ్ ఫౌడర్, క్లోరినేషన్ మాత్రలు, ఐవీ ఫ్లూయిడ్స్, మెట్రోజీ ఐవీ ప్లూయిడ్స్, సిఫ్రాన్ ఐవీ ఫ్లూయిడ్స్, యాంటిబెటిక్ క్యాప్సల్స్, చర్మ సంబంధిత వ్యాధులకు సంబంధించిన మాత్రలు, కడుపునొప్పి, జ్వరాలు, వాంతులు, విరోచనాలకు సంబంధించి ప్రతి రోగానికి మందులు అందుబాటులో ఉంచాం. ముఖ్యంగా మేమే ఇంటింటికీ తిరిగి జ్వర పీడితులను గుర్తించి మందులు ఇస్తున్నాం. ప్రభుత్వ వసతి గృహాలను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. గతంలో ఒక్కో వసతి గృహంలో నెలకొకసారి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించే వారిమి. ఇపుడు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నందున 15 రోజులకు ఒకసారి పరీక్షిస్తున్నాం. వసతి గృహ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. పరిసరాలను దగ్గరుండి శుభ్రం చేయిస్తున్నాం.

30 రోజుల ప్రణాళికలో ఎక్కువగా వైద్య సంబంధిత అంశాలే ఉన్నాయి కదా.. మీ సిబ్బంది పాల్గొంటున్నారా.?
పంచాయతీ, రెవెన్యూతో పాటు మా శాఖ కూడా 30 రోజుల ప్రణాళికలో భాగస్వామ్యమైంది. మా సిబ్బంది, వైద్యులు సాధ్యమైనన్ని ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సూపర్‌వైజర్లు విస్తృతంగా పాల్గొని ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామంలో జరిగే పనుల్లో మా భాగస్వామ్యం ఉంది. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత వంటి పనులే కాకుండా మొక్కలు కూడా విరివిగా నాటుతున్నాం..

జిల్లా ప్రజలకు చివరగా మీరిచ్చే సూచన?
జిల్లాలో ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారికి నాదొక్కటే విజ్ఞప్తి. డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులకు ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం లభిస్తోంది. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో జ్వర పీడితులకు ప్రత్యేకంగా వార్డు ప్రారంభించాం. మీ కోసం అన్ని రకాల వైద్య నిపుణులు అహర్నిషలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి దోపిడీకి గురికాకండి. ప్రభుత్వ దవాఖానలను నమ్మండి. ప్రభుత్వ వైద్యులపై నమ్మకం పెంచుకోండి. ప్రభుత్వ వైద్యంపై అపోహలు పెట్టుకోవద్దు. ఎల్లవేళలా మీకు సేవలు అందిస్తాం.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...