ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి


Thu,March 21, 2019 01:07 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ/బోయినపల్లి: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, పార్లమెంట్ సభ్యుడు వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్‌లో బుధవారం ఉదయం స్థానిక మహిళా డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకర్స్‌ను కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌ను ఇప్పటికే స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయించామని, ఈ పథకం కింద రూ.250 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు టెండర్ల పక్రియ పూర్తి అయిందని గుర్తుచేశారు. కరీంనగర్ త్వరలోనే రైల్వే జంక్షన్‌గా మారుతుందన్నారు. ఇప్పటికే మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. గజ్వేల్ వరకు ఇప్పటికే రైల్వే ట్రాక్ పూర్తి అయ్యిందని, సిద్దిపేట, సిరిసిల్ల వరకు భూసేకరణ కూడ పూర్తి అయిందని చెప్పారు. గతంలో పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్ పనుల పూర్తికి 20 ఏండ్లకు పైగా పట్టగా.. మనోహరాబాద్ రైల్‌ను కేవలం రెండు, మూడేండ్లలోనే పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు రూ.750 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. అలాగే తీగలగుట్టపల్లి వద్ద ఇప్పటికే ఆర్‌ఓబీ మంజూరు అయిందని, దీనికి నిధులు కూడ వచ్చాయన్నారు. ముంబై రైల్‌ను ప్రారంభించగా, ఇది జిల్లా వాసులకు ఎంతో ఉపయోగపడుతున్నదని చెప్పారు.

గతంలో కరీంనగర్‌కు ఒక్క జాతీయ రహదారి కూడ లేదని, గత ఐదేండ్ల కాలంలో కరీంనగర్‌కు నాలుగైదు జాతీయ రహదారులను మంజూరు చేయించామని గుర్తుచేశారు. అలాగే నగరంలోనే జాతీయ రహదారుల సూపరింటెండెంట్ కార్యాలయాన్ని కూడ ఏర్పాట్లు చేయించామని తెలిపారు. ఈ ఐదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలందరం ఎంతో కృషి చేశామన్నారు. తనను మరోసారి కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధితో పాటుగా, నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. పార్లమెంట్‌లో అనేక చర్చల్లో తాను పాల్గొన్నానని గుర్తు చేశారు. తనకు ప్రజలందరూ మద్దతు ఇచ్చి గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర మేయర్ రవీందర్‌సింగ్, జడ్పీటీసీ శరత్‌రావు, కార్పొరేటర్లు వై సునీల్‌రావు, తాటి ప్రభావతి, నాయకులు కోడూరి సత్యనారాయణగౌడ్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, మునీందర్, చీటీ రామారావు, శ్రీనివాస్, గుర్రం పద్మ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
కరీంనగర్‌లోని ఎంపీ నివాసంలో మానకొండూర్ మండలం చెంజర్ల సర్పంచ్ బోళ్ల వేణు ఆధ్వర్యంలో 200 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీ వినోద్‌కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి పలువురు నాయకులు టీఆర్‌ఎస్ నాయకుడు డాక్టర్ అమిత్ ఆధ్వర్యంలో ఎంపీ వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటుగా సీపీఐకి చెందిన కొట్టె అంజలి, కంజర్ల రేణుక ఆధ్వర్యంలో 50 మందికి పైగా మహిళలు గులాబీ దళంలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా భారీగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయన్నారు. కేంద్రంలో ఎంపీల బలం ఎక్కువగా ఉన్నప్పుడే అధికంగా నిధులు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కరీంనగర్ నుంచి తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నియోజక వర్గానికి అధిక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరైన పథకాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్‌ఎస్ నాయకుడు వీర్ల వెంకటేశ్వర్ రావు పాల్గొనగా.. పార్టీలో చేరిన వారిలో ఆయా గ్రామాలకు చెందిన పెరుక మహేశ్, పెంచాల మహేశ్, బోయిని విష్ణు, నాగార్జున్, మహేశ్, రేణుక, లింగంపల్లి సరస్వతి, సువర్ణ, తిరుమల, ఈశ్వరి తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...