కొనుగోళ్లకు వేళాయే..!


Tue,March 19, 2019 03:18 AM

-జిల్లాలో 173 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
-1.41 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణే లక్ష్యం
-ఆన్‌లైన్ ద్వారా అక్రమాలకు చెక్
-రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
-మద్దతు ధర ఏ-గ్రేడ్‌కు 1,770
-సాధారణ రకానికి 1,750
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ధాన్యం కొనుగోళ్లకు జిల్లా అధికారులు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 1.41లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు, అందుకు అనుగు ణంగా 173 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారం లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిం చేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ప్రతిఏటా మద్దతు ధర పెంచుతూ వస్తున్నది. ఈ ఏడాది ఏ-గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్‌కు 1,770, సాధారణ రకానికి 1,750 చొప్పున చెల్లిస్తున్నది. మధ్య దళారీల బెడద నివారించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 173ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ సీజన్‌లో 1.41లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ మొదటివారంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నా రు. జిల్లా వ్యాప్తంగా 173కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 114, ఐకేపీ ద్వారా 55 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా 3, మెప్మా ఆధ్వర్యంలో ఒక కేం ద్రం ఏర్పాటు చేయనున్నారు. ధాన్యం విక్రయించడానికి వచ్చే రైతులకు కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పిస్తున్నారు.

పక్కాగా ప్రణాళిక
రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు సివిల్ సప్లయ్‌శాఖ అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయంతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పంట చేతికొస్తున్న వేళ అధికారులు కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సివిల్ సప్లయ్, ఐకేపీ, మార్కెటింగ్ శాఖలు సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. యాసంగిలో ధాన్యం సేకరణపై జిల్లా అధికారులతో కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జేసీ యాస్మిన్‌బాషా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అక్రమాలకు చోటులేకుండా ఆన్‌లైన్ పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సివిల్‌సప్లయ్ అధికారులు సంబంధిత శాఖలతోపాటు రైస్‌మిల్లర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

రైస్‌మిల్లుకు అనుసంధానం
జిల్లాలోని రైస్‌మిల్లులకు అనుసంధానంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల్లో ధాన్యం ఆరపోసుకునేందుకు టర్ఫాలిన్లు, తేమ యంత్రాలు, ధాన్యం శుద్ధి యంత్రాలు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. వాహన యజమానులతో ఇప్పటికే అధికారులు సమావేశాలు నిర్వహించారు.
గన్నీ సంచులు సిద్ధం
కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ధాన్యాన్ని నింపేందుకు గన్నీసంచులు సిద్ధం చేశారు. మొత్తం 18లక్షల 96వేల35 గన్నీ సంచులు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం 26లక్షల 4వేల94 గన్నీ సంచులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ధాన్యం ఆరపోసుకునేందుకు 2,762టర్ఫాలిన్లు, తేమ శాతాన్ని పరిశీలించే 174 మిషన్లు, ధాన్యం శుభ్రం చేయడానికి 173యంత్రాలు, తూకం వేయడానికి 127 యంత్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను నిల్వ చేయడానికి 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 11వ్యవసాయ గోదాములను సిద్ధం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఒక అకౌంట్ ఆఫీసర్, ఇద్దరు మండల స్థాయి కోఆర్డినేటర్లు, ఒక రిసోర్సు పర్సన్‌ను కేటాయించారు.

రైతులకు మౌలిక వసతులు
ఎండ తీవ్రత పెరుగుతున్నందున కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల వద్ద ప్రాథమిక ఆరోగ్య సిబ్బందితోపాటు మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు, నీడ వసతి కోసం చలువ పందిళ్లు కూడా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం ఆరపోసేందుకు టర్ఫాలిన్లను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తున్నది. ఏ-గ్రేడ్ రకం క్వింటాల్ ధాన్యానికి 1,770, సాధారణ రకానికి 1750గా ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించింది.
అక్రమాలకు చెక్
ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆన్‌లైన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్‌రైస్) కోసం మిల్లర్లకు అప్పగించే విషయంలో అక్రమాలకు తావులేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నది. మిల్లర్ల కెపాసిటీని బట్టి అందరికీ సమానంగా ధాన్యాన్ని ఇవ్వాలని నిబంధన విధించినట్లు సమాచారం. ప్రధానంగా ధాన్యం కొనుగోలుంచి మొదలుకొని మిల్లర్లకు చేరేవరకు ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీంతో అక్రమాలకు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు.

నాణ్యతా ప్రమాణాలు ఇలా
కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే ధాన్యంలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా చూసుకోవాలి. మట్టిరాళ్లు, పెళ్లలు 1శాతం. చెత్త, తాలు 1శాతం. చెడిపోయిన, రంగు వెలసిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం 4శాతం. పూర్తిగా తయారు కాని ముడుచుకు పోయిన ధాన్యం 3శాతం, తక్కువ రకం మిశ్రమ ధాన్యం 7శాతం, తేమ 17శాతంలోపు ఉండాలి.

48 గంటల్లో డబ్బు చెల్లింపు
పంట పండించే రైతుల ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఒక వైపు దళారీల దందాకు చెక్‌పెడుతూ రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నది. కొనుగోలు చేసిన ధాన్యానికి 48గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నది. దీంతో రైతులు దళారీలకు ధాన్యం అమ్మే పద్దతికి స్వస్తి పలుకుతున్నారు. పైగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా రైతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎండాకాలం కావడంతో వడదెబ్బ మారిన పడకుండా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...