నేడే తొలి సంగ్రామం


Mon,January 21, 2019 12:48 AM

(రాజన్నసిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని ఐదు మండలాల్లో పోలింగ్ జరనుంది. మొత్తం 80 పంచాయతీలకు గానూ 13 ఏకగ్రీవం కాగా, 67 సర్పంచు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 279 మంది పోటీలో ఉన్నారు. 722 వార్డు స్థానాలకు 189 స్థానాలు ఏకగ్రీవం కాగా, 533కి ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 1,357 మంది బరిలో ఉన్నారు. కాగా, సోమవారం ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. ఎన్నికలు జరుగుతున్న వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి మండల కేంద్రాల్లో ఆదివా రం ఉదయం నుంచి అధికారులు సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారులు సామగ్రితో ఆదివారం సాయంత్రం గ్రామాలకు చేరుకున్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల సామగ్రి పంపిణీని ఎస్పీ రాహుల్ హెగ్డే, వేములవాడ రూరల్‌లో డీఆర్వో ఖిమ్యా నాయక్ తదితరులు పరిశీలించారు.

గ్రామాల్లో 144 సెక్షన్ అమలు..
ఎన్నికలు జరుగుతున్న 67 గ్రామాల్లో పోలీసు అధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ముగ్గురి కంటే ఎక్కువ మంది కనిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉండాలి. ఎన్నికల రోజు అభ్యర్థులుగానీ, అభ్యర్థుల తరపున మరెవరైనా గానీ టిఫిన్స్ పెట్టడం, వాహనాల్లో ఓటర్లను చేరవేయడం చేయరాదు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించరాదు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు తీయరాదు. కుంకుమలు చల్లుకోవడం, పూల దండలు వేసుకోవడం చేయరాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...