నేడే తొలిపోరు


Mon,January 21, 2019 12:46 AM

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మరికొద్ది గంటల్లో తొలివిడత పోలింగ్ మొదలుకానున్నది. పంచాయతీ పోరుకోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. రాత్రివరకు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లాలోని తొలివిడతలో 67గ్రామ పంచాయతీలు, 533వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతు న్న ఐదు మండలాల్లో మొత్తం ఓటర్లు 96,399 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 46, 811, మహిళలు 49,588మంది ఉన్నారు. ఎన్నికల కోసం 636 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,186మంది సిబ్బంది ఎన్నిలక విధు లు నిర్వర్తించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 400మంది పోలీస్ సిబ్బందిని కేటాయించారు.

సర్వం సిద్ధం
పంచాయతీ తొలిపోరుకు అధికార యంత్రాం గం సర్వం సన్నద్ధం చేసింది. జిల్లాలో తొలివిడతలో బోయినిపల్లి, చందుర్తి, రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాలోని 80గ్రామ పంచాయతీలు, 722వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, ఇందులో 13పంచాయతీలు, 189వార్డుస్థానాలు ఏకగ్రీవం అయ్యా యి. 67సర్పంచ్ స్థానాలు, 533వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు 33మంది అబ్జర్వర్లు, 74మంది ఆర్‌వోలను కేటాయించారు. సిబ్బందిని తరలించేందుకు 53వాహనాలు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్పీ రాహుల్‌హెగ్డే ఆధ్వర్యంలో 400మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గ్రామాలకు తరలిన సిబ్బంది..
సోమవారం ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం కానున్నందున ఆదివారం రాత్రి నుం చే ఎన్నికల సిబ్బంది గ్రామాలకు తరలివెళ్లారు. ఎన్నికలు జరిగే మండలాలకు ఎన్నికల సామగ్రిని తరలించారు. వేములవాడ అర్బన్, రూరల్ మం డలాలకు వేములవాడలో, రుద్రంగి, చందుర్తి మండలాలకు చందుర్తిలో, బోయినిపల్లి మండలానికి సంబంధించి బోయినిపల్లి మండల కేం ద్రంలో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను ఎస్పీ రాహుల్‌హెగ్డే, జేసీ యాస్మిన్‌బాషా, డీఆర్వో ఖిమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివా స్ పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సిబ్బందిని తరలించేందుకు ఆర్టీవో కొండల్‌రావు 54ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, వాటిని సిరిసిల్ల నుంచి మండలాలకు తరలించారు.

13 జీపీలు, 189వార్డులు ఏకగ్రీవం
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 13గ్రామ పంచాయతీలు, 189వార్డులు ఏకగ్రీవం అయ్యా యి. మిగిలిన 67సర్పంచ్ స్థానాలకు, 533వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

బోయినపల్లిలో..
బోయినపల్లి మండలంలో మొత్తం ఓటర్లు 28,155మంది ఓటర్లు ఉండగా, ఇందులో 13,839మంది పురుషులు, 14,316మంది మ హిళలు ఉన్నారు. 23పంచాయతీలలో 2రెండు పంచాయతీలు, 42వార్డులు ఏకగ్రీవం అయ్యా యి. మొత్తం అభ్యర్థులు 512 మంది పోటీ చేస్తున్నారు. 21సర్పంచ్ స్థానాలకు 89మంది, 170 వార్డు స్థానాలకు 423 మంది అభ్యర్థులు పోటీ లో ఉన్నారు. ఈ మండలంలో ఎన్నికల కోసం 202 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 354మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

చందుర్తిలో ..
చందుర్తి మండలంలో మొత్తం 23,559 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 11,343 మహిళలు 12,216మంది ఉన్నారు. మొత్తం 19పంచాయతీలకు కట్టలింగంపేట, కొత్తపేట, దేవునితండా గ్రామపంచాయతీలు, 46 వార్డుస్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 16 సర్పంచ్ స్థానాలకు 69మంది, 127వార్డుస్థానాలకు 316 అభ్యర్థులతో కలిపి మొత్తం 385మంది పోటీ చేస్తున్నారు. మండలంలో ఎన్నికల నిర్వహణకు 154పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 180 మంది సిబ్బందిని కేటాయించారు.

రుద్రంగిలో..
రుద్రంగి మండలంలో మొత్తం ఓటర్లు 10,682 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 4,985మంది, మహిళా ఓటర్లు 5,697మంది ఉన్నారు. మొత్తం 10పంచాయతీలకు గాను 7 పంచాయతీలు, 57వార్డులు ఏకగ్రీవం అయ్యా యి. ఇందులో అడ్డబోరు తండా, దెగావత్‌తం డా, చింతామణితండా, బడితండా, రూప్లానాయక్ తండా, వీరునితండా, సర్పంచ్‌తండాలున్నాయి. మిగిలిన 3సర్పంచ్ స్థానాలకు 11 మం ది, 29వార్డులకు 95మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 36పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 90మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

వేములవాడ అర్బన్‌లో ..
వేములవాడ అర్బన్ మండలంలో మొత్తం ఓటర్లు 17,059మంది ఉన్నారు. ఇందులో పు రుషులు 8,481మంది, మహిళలు 8,578 మం ది ఉన్నారు. మొత్తం 11పంచాయతీలు, 91 వార్డుస్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం అభ్యర్థులు 295 మంది పోటీ చేస్తున్నారు. 11సర్పంచ్ స్థానాలకు 51మంది అభ్యర్థులు, 91వార్డు స్థానాలకు 244మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు 104పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 140 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 52 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు.

వేములవాడ రూరల్‌లో..
వేములవాడ రూరల్ మండలంలో మొత్తం ఓటర్లు 16,944 మంది ఉన్నారు. పురుషులు 8,163మంది, మహిళలు 8,781మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 17గ్రామ పంచాయతీలకు గాను ఒక పంచాయతీ, 30వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తుర్కాశినగర్ పంచాయతీ ఏకగ్రీవం కాగా, 16పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 16సర్పంచ్ స్థానాలకు 59మంది, 116 వార్డు స్థానాలకు 279 మంది 338 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు 140 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 241 మంది అధికారులు, విధుల్లో పాల్గొంటున్నారు.

స్వేచ్ఛగా ఓటెయ్యాలి
బోయినపల్లి: జిల్లాలో తొలి విడతగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలనీ, ప్రజలు స్వేచ్ఛగా ఓటెయ్యాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే అన్నారు. ఆదివారం బోయినపల్లి జడ్పీ పాఠశాల క్రీడా మైదానంలో పోలింగ్ కేంద్రాల సిబ్బంది, పోలింగ్ సామగ్రి తరలింపును ఆయన పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందితో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడూతూ, మండలంలోని మాన్వాడ, కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, విలాసాగర్, తడగొండ, బోయినపల్లి గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు చెప్పారు. ఆ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అదనపు బలగాలను నియమించామని తెలిపారు. 100మంది సిబ్బందితో పాటు, స్థానిక ఎస్‌ఐ, మరో ఇద్దరు ఎస్‌ఐలతో భారీ బందోబస్తు నిర్వహించామని చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే పోలీసులకు సమచారం ఇవ్వాలన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటెయ్యాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటరమణ, వేములవాడ రూరల్ సీఐ రఘుచందర్, ఎస్‌ఐ పాకాల లకా్ష్మరెడ్డి తదితరులు ఉన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...