తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


Mon,January 21, 2019 12:45 AM

కలెక్టరేట్: జిల్లాలో నేడు జరిగే తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన జారీ చేశారు. తొలి విడత జిల్లాలోని వేములవాడ, వేములవాడరూరల్, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 80 గ్రామపంచాయతీలకుగాను 13 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 722 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇందులో 188 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 67 సర్పంచ్ స్థానాలకు 279 మంది, 533 వార్డులకు 1,357 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు శిక్షణను ఇచ్చారు. 33 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎన్నికల ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది పోలింగ్ పర్సన్స్ చేరుకున్నారని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి
సోమవారం జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఓటరు ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు అనేది ఓ వజ్రాయుధంలాంటిదని, ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటు ద్వారా సుపరిపాలనను ఆశించవచ్చని పేర్కొన్నారు. ఓటు హక్కు పొందడం ఒక ఎత్తైతే దాన్ని సద్వినియోగం చేసుకోవడం మరో విషయమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు హక్కును దుర్వినియోగపర్చుకోవద్దని సూచించారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని అన్నారు.

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి:
గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి గొడవలకు వెళ్లకుండా ఓటింగ్‌లో పాల్గొనాలన్నారు. ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేశామన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరు కాని పలువురు పీవో, ఓపివోలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కారణాలు తెలపాల్సిందిగా గైర్హాజరైన సిబ్బందిని కలెక్టర్ వెంకట్రామరెడ్డి షోకాజ్ నోటీసులో ఆదేశించారు. తొలివిడత ఎన్నికల విధులకు హాజరు కాని సిబ్బందిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేస్తామన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...