అసెంబ్లీకి ఎమ్మెల్యేలు


Thu,January 17, 2019 02:40 AM

- నేడు ప్రమాణ స్వీకారం
- అసెంబ్లీలోకి నాలుగోసారి కేటీఆర్, చెన్నమనేని
- రెండో సారి రసమయి
- మొదటి సారి సుంకె రవిశంకర్
- రాజధానికి చేరిన శాసనసభ్యులు
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: స్వీయ తెలంగాణలో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగరేసింది. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారపగ్గాలు చేపట్టగా, నేడు అసెంబ్లీ కొలువుదీరబోతున్నది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ప్రొటెం స్వీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ గురువారం ప్రమాణస్వీకారం చేయించనుండగా, ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్లుగా ఉన్నారు. ఆరోసారి శాసనసభలోకి అడుగు పెడ్తున్నారు. వీరి తర్వాత నాలుగోసారి కేటీఆర్, చెన్నమనేని రమేశ్‌బాబు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మూడోసారి గంగుల కమలాకర్, రెండోసారి రసమయి బాలకిషన్, వొడితల సతీశ్‌కుమార్, దాసరి మనోహర్‌రెడ్డి అసెంబ్లీకి వెళ్తుండగా, మాకునూరి సంజయ్‌కుమార్, సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్ మొదటి సారి అడుగుపెట్టబోతున్నారు.

డబుల్ హ్యాట్రిక్ ఈటల..
తెలంగాణ ఉద్యమకాలం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎదురులేని నేతగా ఎదిగారు. ఉపఎన్నికలు సహా ఇప్పటికి ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికై జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత వరుసగా ఆరుసార్లు గెలిచిన ఘనత సొంతం చేసుకున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తొలిసారి 2004లో కమలాపూర్ అసెంబ్లీ స్థానం గెలుపొందిన ఆయన, అప్పటి నుంచి విజయపరంపర కొనసాగిస్తున్నారు.

ఆరోసారి కొప్పుల..
ధర్మపురి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వరుసగా ఆరోసారి గెలిచి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో ఇంత వరకు డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన ఘనత కేవలం సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉండగా, ఈ ఎన్నికతో ఈటల రాజేందర్, హరీశ్‌రావు తోపాటు కొప్పుల సొంతం చేసుకున్నారు. మొదటి సారి 2004లో మేడారం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన, వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. తాజాగా ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలుపొంది, డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అయితే పోటీచేసిన ఆరు సార్లలో ఒక్కసారి (కాంగ్రెస్ అభ్యర్థి కుమారస్వామి-2008) మినహా ఐదు సార్లు అడ్లూరి లక్ష్మణ్‌పై విజయభేరి మోగించారు.

నాలుగోసారి కేటీఆర్, రమేశ్‌బాబు, విద్యాసాగర్‌రావు..
రాష్ట్రంలోనే బంపర్ మెజారిటీతో సిరిసిల్ల నియోజకర్గం నుంచి గెలుపొందిన కేటీఆర్, వరుసగా నాలుగోసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 2006 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2009, 2010, 2014, 2018లో వరుసగా నాలుగుసార్లు గెలిచి చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో ప్రజలకు చేరువై, తన ఆధిక్యాన్ని పెంచుకున్నారు. కేటీఆర్‌తోపాటు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కూడా వెళ్తున్నారు. స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వర్‌రావు తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రమేశ్‌బాబు, 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పునర్విభజనలో భాగంగా ఏర్పడిన వేములవాడ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. విద్యాసాగర్‌రావు కూడా కోరుట్ల నియోజకవర్గం (2009) ఏర్పడినప్పటి నుంచి వరుస విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇప్పటికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డును సొంతం చేసుకున్నారు.

మూడోసారి గంగుల..
కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి గంగుల కమలాకర్ రికార్డు సాధించారు. 2009లో ఓసారి, 2014 రెండోసారి, 2018 మూడోసారి ఎన్నికల్లో గెలుపొందారు. ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించి అనతి కాలంలో ఇటు పార్టీ నాయకత్వాన్ని, ఇటు ప్రజలను మెప్పించారు. నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాలను తనదైన రీతిలో అభివృద్ధి చేస్తూ ముందుకుసాగుతున్నారు.

రెండోసారి రసమయి, దాసరి, వొడితల..
మానకొండూర్, పెద్దపల్లి, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్ రెండోసారి శాసనసభకు వెళ్తున్నారు. ఉద్యమ కాలంలో తన పాట, మాటలతో జనాన్ని ఉర్రూతలూగించి తెలంగాణ సాధనలో తన భూమికను సమర్ధవంతంగా నిర్వహించిన రసమయి, వరుసగా రెండు సార్లు ఘన విజయం సాధించారు. ఇక దాసరి మనోహర్‌రెడ్డి వరుసగా రెండు సార్లు గెలిచి, 46 ఏళ్ల ఆనవాయితీని బ్రేక్ చేశారు. తన తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో కలిసి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సతీశ్‌కుమార్ కూడా, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికయ్యారు.

మొదటి సారి సంజయ్, సుంకె.. కోరుకంటి..
జగిత్యాల, చొప్పదండి, రామగుండం ఎమ్మెల్యేలు డా మాకునూరి సంజయ్‌కుమార్, సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్ తొలిసారి శాసనసభకు వెళ్తున్నారు. జగిత్యాల నుంచి లక్షకుపైగా ఓట్లతో గెలిచిన సంజయ్, 67 ఏళ్ల నియోజకవర్గ చరిత్రలోనే రికార్డు సృషించారు. 61,185 ఓట్ల మెజార్టీ పొంది ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పారు. చొప్పదండి నియోజకవర్గం నుంచి సుంకె రవిశంకర్ విజయం సాధించారు. రామగుండం నుంచి కోరుకంటి మొదటి సారి గెలుపొందారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...