తల్లి మృతిపై అనుమానాలు


Thu,January 17, 2019 02:39 AM

కరీంనగర్ క్రైం : జీవన భృతి కోసం కేసు పెట్టిందనే నెపంతో కొడుకే తల్లిని హత్య చేశాడని కూతురు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు అధికారులు మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం చేశారు. వివరాలు.. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌కు చెందిన అంకమల్ల రామమ్మ (70) 2018 సెప్టెంబర్ 1న మృతి చెందింది. అనారోగ్యంతో చనిపోయిందని కొడుకు పోశయ్య బంధువులకు సమాచారం ఇచ్చి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు. రామమ్మ మృతిపై ఆమె చిన్న కొడుకు రాజయ్య, కూతురు కనకలక్ష్మి అనుమానం వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. తిరిగి అదేనెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.

కాగా రామమ్మ అంతకు ముందు జీవన భృతి ఇవ్వడం లేదని కొడుకు పోశయ్యపై ఫిర్యాదు చేయగా కోర్టు అతడికి జైలుశిక్ష విధించింది. జైలు నుంచి వచ్చిన పోశయ్య తల్లి బాధ్యతలు తీసుకుంటానని రాజయ్య ఇంటి నుంచి తీసుకెళ్లిన నెల రోజులకే రామమ్మ మృతి చెందింది. అయితే ఉద్దేశపూర్వకంగానే రామమ్మ మృతికి కారణమయ్యాడని కనకలక్ష్మి కోర్టుకు ఫిర్యాదు చేయడంతో మృతదేహానికి పోస్టుమార్టం చేసి నివేదిక సమర్పించాలని మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం కరీంనగర్ తహసీల్దార్ కుమారస్వామి, కాకతీయ వైద్య కళాశాల బృందం, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు గ్రామస్తుల సమక్షంలో పంచనామా చేసి మృతదేహాన్ని అదేస్థలంలో పూడ్చి పెట్టారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...