ఆ గ్రామం ఇనగంటి కంచుకోట..


Fri,January 11, 2019 01:46 AM

కమాన్‌పూర్: ఆ గ్రామం ఓ కుటుంబానికి కంచుకోటగా వెలిగింది. స్థానిక సంస్థల్లో ఒకటి కాదు.. రెండు కాదు గ్రామ పంచాయతీగా ఏర్పడిన 68 ఏళ్లలో 41 ఏళ్లు పాలనా పగ్గాలు వారికే కట్టబెట్టింది. ఒకరు 25 ఏళ్ల పాటు పాలించగా, మరొకరు 11 ఏళ్లు, ఇంకొకరు ఐదేళ్ల పాటు పనిచేశారు. ఇప్పటివరకు ఆ గ్రామం తొమ్మిది మంది సర్పంచులకు విజయాన్ని కట్టబెట్టగా, ఇప్పుడు పదో సర్పంచ్ కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కమాన్‌పూర్ మండలంలోని కమాన్‌పూర్ గ్రామ పంచాయతీ 1950వ సంవత్సరంలో ఏర్పడింది. ఈ గ్రామ మొదటి సర్పంచ్‌గా తాండ్ర జగన్నాథాచారి 1950 నుంచి 1957 దాకా పనిచేయగా, 1958లో తిమ్మరాజు రాంకిషన్‌రావు 6 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తదుపరి మూడో సర్పంచ్‌గా రతన్‌లాల్ సైతం 6 నెలల పాటే పనిచేశారు. ఇక 1959లో నాలుగో సర్పంచ్‌గా ఇనగంటి చక్రధర్‌రావు ఎన్నికై దాదాపు 11 ఏళ్ల పాటు 1970 దాకా కొనసాగారు. ఐదో సర్పంచ్‌గా ఇనగంటి నర్సింగరావు 1970 నుంచి 1995 దాకా ఏకంగా 25 ఏళ్ల పాటు పనిచేశారు. ఆరో సర్పంచ్‌గా మెడగోని కనకమ్మ 1995 నుంచి 2001 వరకు కొనసాగగా, ఏడో సర్పంచ్‌గా ఇనగంటి భాస్కర్‌రావు 2001 నుంచి 2006 వరకు పనిచేశారు. ఎనిమిదో సర్పంచ్‌గా దాసరి రాజేశ్వరి 2006 నుంచి 2011 దాకా, తొమ్మిదో సర్పంచ్‌గా కొంతం సత్యనారాయణ 2013 నుంచి 2018 దాకా పనిచేశారు. కమాన్‌పూర్ జీపీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఇనగంటి ఇంటిపేరు కలిగిన ముగ్గురు సర్పంచ్ పీఠాన్ని అధీష్ఠించి 41 ఏళ్లపాటు పనిచేశారు. ఇందులో అత్యధిక కాలం పాటు ఇనగంటి నర్సింగరావు 25 ఏళ్లు, ఇనగంటి చక్రధర్‌రావు 11 ఏళ్లు పనిచేశారు. రెండు పర్యాయాలు ఆపై సర్పంచ్‌లుగా పనిచేసింది కూడా వారిద్దరేకావడం కొసమెరుపు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...