ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తాం


Tue,October 9, 2018 01:09 AM

కలెక్టరేట్: అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని, జిల్లాలో పక్కాగా అమలు చేస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామరెడ్డి వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశం సోమవారం ఆయన నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల నియమావళిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చిందని, నిబంధనల ఉల్లంఘన కిందకు వచ్చే అంశాలేమిటో స్పష్టం చేసిందని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనలు ఉండకూడదని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లను తొలగిస్తున్నామని, బస్‌స్టేషన్లలో పోస్టర్లు, బ్యానర్లు తొలగించాల్సి ఉంటుందని, ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలని, గోడపత్రికలు అతికించాలని వివరించారు. ఎన్నికల పనుల కోసం నేతలు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించరాదని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే 1950 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. గతంలో మంజూరైన పనులు కొనసాగించవచ్చని, కొత్త పనులు ప్రారంభించరాదని స్పష్టం చేశారు.

చెల్లింపు కథనాలపై కఠిన చర్యలు..
పత్రికలు, టీవీలకున్న నిబంధనలే సామాజిక మాధ్యమాలకు వర్తిస్తాయని, ఎన్నికల సమయంలో పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో ఎలాం టి చెల్లింపు కథనాలను ప్రచురించినా, ప్రసారం చేసినా వాటిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల కథనాలను కచ్చితమైన సమాచారంతో ప్రచురించాలని, అప్పుడే ఓటర్లకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటుందని తెలిపారు. ఎన్నికల కథనాలను అందించడంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అర్థవంతమైన పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని, ఒక్క కథనంతో చాలా నష్టం జరిగే అవకాశముందని, ఇష్టానుసారం ప్రచారం చేయొద్దని తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు ఫలానా కథనాలు వేయాలని, తమ కథనాలే ప్రచురించాలని మీడియాపై వివిధ రకాల ఒత్తిళ్లు వస్తాయని తెలిపారు. రహస్య ఓటింగ్ ప్రదేశానికి తప్ప అన్ని ప్రాంతాలకూ మీడియా వెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. మొదటి దశ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధముంటుందని, ఎందుకంటే మిగతా ఎన్నికలపై అవి ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అన్నారు. అభ్యర్థులు చివరి 48 గంటల్లో టీవీ ఛానల్స్ ద్వారా కూడా ప్రచారం చేయొద్దని పేర్కొన్నారు. చెల్లింపు కథనాల్లో నేరుగా డబ్బులు చెల్లించకపోయినా, ఏదో రూపంలో మీడియాకు లబ్ధి చే కూర్చేలా వ్యవహరించినా చర్యలుంటాయన్నారు.

ఈవీఎంల పనితీరుపై
అవగాహన..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతోపాటు ఈ ఎన్నికల్లో అందుబాటులోకి రానున్న వివిప్యాట్ల పనితీరుపై పాత్రికేయులకు కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు ఓటు హక్కు వినియోగంపై వారి సందేహాలు నివృత్తి చేస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామరెడ్డి వివరించారు. సమావేశంలో జేసీ యాస్మిన్‌బాషా, శిక్షణ కలెక్టర్ రాహుల్‌శర్మ, డీపీఆర్వో మామిండ్ల దశరథం పాల్గొన్నారు.

రాజకీయ పార్టీలు సహకరించాలి
సోమవారం సాయంత్రం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామరెడ్డి సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల నియమావళి అమలుపై వా రికి అవగాహన కల్పించారు. నిబంధనల ఉల్లంఘన కిందకు వచ్చే అంశాలను వెల్లడించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించా రు. జేసీ యాస్మిన్‌బాషా, శిక్షణ కలెక్టర్ రాహుల్‌శర్మ, రిటర్నింగ్ అధికారులు ఖిమ్యానాయక్, శ్రీనివాసరావు, రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


ఫిర్యాదులను పరిష్కరించాలి
ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని స్వయంగా వినతులను స్వీకరించారు.183 ఫిర్యాదులు ప్రజల నుంచి రాగా అందులో డబుల్ బెడ్‌రూం మం జూరు కోరుతూ 57, రెవెన్యూ శాఖకు సంబంధించినవి 69, పెన్షన్ కోసం 57 దరఖాస్తులు వచ్చా రు. అనంతరం కలెక్టర్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో జేసీ యాస్మిన్‌బాషా, శిక్షణ కలెక్టర్ రాహుల్‌శర్మ, డీఆర్వో ఖి మ్యానాయక్ అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

ఓటు హక్కు వినియోగంపై ్రప్రచారం నిర్వహించండి
గ్రామస్థాయి బూత్ లెవల్‌లో ప్రతి వికలాంగుడూ ఓటుహక్కును వినియోగించుకునేలా దివ్యాంగులు ఓటు వేసేందుకు వారందరికీ అవగాహన కల్పించాలని సాహితీ దివ్యాంగుల సంక్షేమ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు తడుక శ్రీనివాస్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

మౌలిక వసతులు కల్పించండి
బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలంటూ టీఆర్‌ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ ప్రజావాణిలో కలెక్టర్ వెంకట్రామరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట కొక్కుల ప్రసాద్, జిందం మల్లేశం, అన్నారపు రాజు, ఎన్.కొమురయ్యలు ఉన్నారు.

సమస్య పరిష్కరించండి
కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన లింగంపెల్లి లచ్చవ్వ తనకున్న భూమిని పట్టాదారు పాసుపుస్తకంలో నమోదు చేయడం లేదని, సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో కలెక్టర్‌ను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులను సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...