నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి


Wed,September 19, 2018 03:01 AM

-మౌలిక వసతులు కల్పిస్తున్నాం
-మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని
-వేడుకల ఏర్పాట్లపై ఉత్సవ సమితితో సమీక్ష
సిరిసిల్ల టౌన్: గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా నిమజ్జన వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, పోలీస్, సెస్ అధికారులతో నిమజ్జన వేడుకల ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. నిమజ్జన వేడుకల సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. వార్డుల వారీ గా సమస్యలు గుర్తిస్తూ, వెనువెంటనే పరిష్కరించేందుకు సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పలుచోట్ల మిషన్ భగీరథ పైప్‌లైన్ కోసం తవ్విన గుంతలు ఉన్నాయనీ, ఆయా ప్రాంతాలలో సీసీ నిర్మాణాలు పూర్తి చేస్తున్నామన్నారు. కమిషనర్ రమణాచారి మాట్లాడుతూ, విగ్రహాల నిమజ్జనం కోసం అనువైన ప్రదేశం కోసం మానేరువాగు, కార్గిల్‌లేక్ ప్రాంతాలను పోలీస్ అధికారులతో పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

విద్యుత్ లైన్లలో సమస్యలు రాకుండా ముందస్తుగా సెస్ అధికారులతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సీఐ శ్రీనివాసచౌదరి చెప్పారు. వీలైనంత త్వరగా నిమజ్జనం పూర్తి చేసేందుకు మున్సిపల్ సిబ్బంది సహకారం తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ తవుటు కనకయ్య, కౌన్సిలర్లు, హిందూ ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు.

మండపాల వద్ద అన్నదానం
గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా సుభాశ్‌నగర్, గీతానగర్‌లో ఏర్పాటుచేసిన గణేష్ మండపాల వద్ద మంగళవారం అన్నదానం కార్యక్రమాలు జరిగాయి. టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని ముఖ్య అతిథులుగా పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ సామల దేవదాస్, గాజుల బాలయ్య, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...