ఓటరు నమోదు వంద శాతం పూర్తి చేయాలి


Sun,September 16, 2018 02:48 AM

-ప్రత్యేక దృష్టి సారించాలి
-బీఎల్‌వోలకు కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశం
-నాగారం పోలింగ్ స్టేషన్ పరిశీలన
కోనరావుపేట: ఓటరు నమోదు కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని నాగారం గ్రామంలో పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ జాబితా సవరణను బీఎల్వోలు నిర్వహించగా ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రతి ఓటరు వివరాలు నమోదు కావాల్సి ఉందని, అందుకు బీఎల్వోలు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలోని ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకొని, మృతుల వివరాలు తొలగింపజేసేందుకు కృషి చేయాలని తెలిపారు. బీఎల్వోలు విధులు సరిగా నిర్వర్తించకపోతే చర్యలు తప్పవన్నారు. గ్రామాలలో చాలా మంది యువతి, యువకులకు ఓటు హక్కు లేదన్నారు. కావున ఓటు హక్కుపై విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని తెలిపారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని ఓటు హక్కు కల్పించేందుకు బీఎల్వోలు బాధ్యత వహించాలని సూచించారు. ఓటర్లు నమోదులో ఎలాంటి తప్పులు లేకుండా జాబితా సిద్దం చేయాలని ఆదేశించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదును పరిశీలించారు. ఎంతమేరకు నమోదు, ఎన్ని దరఖాస్తులు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉన్న కార్యాలయల్లో కూడా ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ పిట్టల సదానందం, ఎంపీడీవో శ్రీనివాస్, వీఆర్వో, మండల బీజేపీ అధ్యక్షుడు గోపాడి సురేందర్‌రావు, తదితరులు ఉన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...