కన్నీటిసంద్రం


Thu,September 13, 2018 01:11 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి/జగిత్యాల/కొడిమ్యాల/మల్యాల : కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన ప్రమాదంతో కొడిమ్యాల మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు అధిక సంఖ్యలో ఉన్న ఆరు గ్రామాలు కన్నీటి సంద్రంలో మునిగాయి. శనివారం పేట, డబ్బు తిమ్మాయపల్లె, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, తిర్మలాపూర్, కోనాపూర్ గ్రామాలకు చెందిన 48మంది మృతిచెందగా, మంగళవారం రాత్రంతా శవజాగరణే అయింది. పది, పన్నెండు శవాలతో గ్రామంలో ఎటూ చూసిన విషాదం కనిపించింది. మృతదేహాల భద్రత పెద్ద సమస్యగా మారగా, రాత్రంతా ఐస్‌గడ్డలపై ఉంచి, ఉనుకతో కప్పిపెట్టారు. విషయం తెలుసుకున్న వైద్యశాఖ అధికారులు, స్వచ్చంధ సంస్థలు, అధికారులు, జాగృతి సంస్థ సభ్యులు ఫ్రీజర్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్, జగిత్యాల, మల్యాల నుంచి ఫ్రీజర్లను బుధవారం ఉదయాన్నే గ్రామాలకు పంపారు. ప్రతి మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్లను సమకూర్చారు.

వర్షంలోనూ అంత్యక్రియలు..
బుధవారం సంబంధిత గ్రామాల్లోని ఏ వీధి చూసినా శవయాత్రలే కనిపించాయి. దహన సంస్కారాలకు తీసుకెళ్తుండగా, సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం పడడంతో వానలోనూ అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతదేహాలను మోసేందుకు ప్రజలు లేక ట్రాక్టర్లపైనే శ్మశానాలకు తీసుకెళ్లారు. ఒక్కో గ్రామంలోని ఒక్కో కుటుంబాన్ని కదిలిస్తే దీనగాథలే వినిపించాయి. గ్రామం వల్లకాడులా మారిందంటూ పలువురి రోదనలు కలిచివేశాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు సైతం ఒక్కో ఇంటిపక్కనే మరో ఇంట్లో శవం ఉండడంతో ఇరుగు పొరుగు వారి బాధలు విని, చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది దేవుడా అంటూ పలువురు రోదించిన తీరు చూపరుల కంటతడిపెట్టించింది.

మృత్యువులోనూ వీడని బంధం..
ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పలువురు చనిపోగా, వారికి ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించడం హృదయవిదారకంలా మారింది.శనివారం పేటకు చెందిన గోలీ అమ్మాయి, గోలి రాజమల్లు భార్య భర్తలు కాగా, కంటి చికిత్స కోసం జగిత్యాల దవాఖానకు వెళ్తుండగా మృత్యువు బస్సు రూపంలో వెంటాడింది. శనివారం పేటకు చెందిన ఎండ్రికాయల సుమలత నిండు గర్భిణి కాగా, జగిత్యాలలో ప్రసవం చేయించుకునేందుకు తన తల్లి ఉత్తెం భూమ లక్ష్మి అత్త వెంకవ్వతో కలిసి వెళ్తుండగా, ముగ్గురూ మృతి చెందారు. హిమ్మత్‌రావుపేటకు చెందిన సాయితేజ, వేముల భాగ్య, శైలజ జగిత్యాలలో పనికోసం వస్తున్న క్రమంలో అమ్మమ్మ వేముల భాగ్య, మనవడు సాయితేజ చనిపోయారు. రాంసాగర్‌కు చెందిన శెర్ల మౌనిక, శెర్ల హేమ తోటి కోడళ్లు వైద్యం కోసం వస్తూ ప్రాణాలు వదిలారు. డబ్బు తిమ్మాయపల్లెకు చెందిన ఒడ్నాల కాశీరాం, ఒడ్నాల లస్మవ్వ జ్వరం వస్తే చూపెట్టుకునేందుకు జగిత్యాలకు వెళ్తుండగా మృత్యువాతపడ్డారు. అదే గ్రామానికి చెందిన గోల్కొండ దేవయ్య, గోల్కొండ లస్మవ్వ తమ కూతురి ఇంటికి వెళ్తూ కానరానిలోకాలకు వెళ్లారు.

తల్లులకు కడపు కోత..
హిమ్మత్‌రావుపేటకు చెందిన శైలజ, సాయి తల్లీ కొడుకులు కాగా ప్రమాదంలో సాయి మృత్యువాత పడ్డాడు. శైలజ దవాఖానలో కోలుకుంటున్నది. శనివారం పేటకు చెందిన గర్భిణి నామాల మౌనిక, తల్లి ఆరె లక్ష్మీతో కలిసి చెకప్ కోసం జగిత్యాలకు వెళ్తుండగా తల్లి లక్ష్మీ ముందే మౌనిక చనిపోయింది. రాంసాగర్‌కు చెందిన కీర్తన తన కూతురు రితన్య, ఎనిమిది నెలల కొడుకు దీయాక్షన్‌తో కలిసి జగిత్యాల దవాఖానకు వెళ్తున్న క్రమంలో కూతురు రితన్య ప్రమాదంలో కన్నుమూసింది. కీర్తనకు గాయాలు కాగా దీయాక్షన్ మృత్యుంజయుడిగా నిలిచాడు. శనివారంపేటకు చెందిన గాజుల హర్షకు జ్వరం రావడంతో జగిత్యాలలో దవాఖానాకు వెళ్తుండగా హర్ష కన్నుమూయగా తల్లి లత తీవ్రంగా గాయపడింది. పేగు పంచుకొని పుట్టినవాళ్లు తమ కళ్లెదుటే మృత్యువాత పడడంతో ఆ తల్లుల కడుపుకోత చూడలేక ఎందరో తల్లులు కంటతడిపెట్టారు

డబ్బు తిమ్మాయపల్లిలో పది మంది..
కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయ్యపల్లెలో పది మంది మృతి చెందగా, వారి దీనగాథలు వర్ణణాతీతంగా ఉన్నాయి. గోల్కొండ దేవయ్య, లస్మవ్వ భార్యా భర్తలు కాగా, వారిద్దరూ మృత్యువాత పడ్డారు. అదే గ్రామంలో గాజుల చిన్నయ్య, గాజుల రాజవ్వ దవాఖానకు వెళ్తూ చనిపోయారు. ఒడ్నాల కాశీరాం, ఒడ్నాల లస్మవ్వ కూడా జ్వరానికి చికిత్స కోసం వెళ్తున్న క్రమంలోనే చనిపోయారు. పిడుగు రాజిరెడ్డికి కిరాణా షాపు ఉండగా, సరుకుల కోసం జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో మృత్యువాతపడ్డాడు. పూండ్ర లలిత సాక్షర భారత్ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తూ, జిల్లా కేంద్రంలో సమావేశానికి వెళ్తూండగా మరణించింది. లలిత మృతితో శ్రీతేజ, రాజురెడ్డి తల్లి లేని పిల్లలయ్యారు. లైశెట్టి కళావతి తన బంధువులను కలిసేందుకు వెళ్తూ, డబ్బు అమ్మాయి ఇంట్లోకి కిరాణా సామగ్రి కొనుగోలుకు వెళ్తూ మృత్యువాత పడ్డారు. ఒకే గ్రామంలో పది మంది మృతితో గ్రామంలో తీరని విషాదం మిగిలింది.

రాంసాగర్‌లో తొమ్మిది మంది..
రాంసాగర్‌లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన శేర్ల హేమ, శేర్ల మౌనిక తోటికోడళ్లు వైద్యం కోసం జగిత్యాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దయాల ఆనంద్, తిరుమల ముత్తయ్య సైతం వైద్యం కోసం వెళ్తూనే మృత్యువాతపడ్డారు. దాగెల స్వామి, అనిత భార్య భర్తలు కూడా చికిత్స కోసం వెళ్తుండగా భర్త స్వామి చనిపోయాడు. అనిత జగిత్యాల ఓం సాయి వైద్యశాలలో కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతున్నది. తల్లితండ్రులు ఇద్దరూ ఇంటి వద్ద లేక చిన్నారులు ఎవరూ లేని వారిగా మిగిలారు. మెడిచెల్మల గౌరు, బండపెల్లి చిలుకమ్మ బంధువుల ఇంటికి వెళ్తూ చనిపోయారు. తన మనవరాళ్లు వినయశ్రీ, కావ్యశ్రీ కవలలను దవాఖానలో చూపించేందుకు తన కూతురు నిర్మలతో కలిసి మేడిచెల్మల రాజేశం బస్సులో వెళ్తుండగా ప్రమాదంలో రాజేశం ఊపిరాడక చనిపోయాడు. కూతురు నిర్మల కరీంనగర్ సన్‌షైన్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నది. కవలలు వినయశ్రీ, కావ్యశ్రీ సురక్షితంగా బయటపడ్డారు. బైరి కీర్తన తన పిల్లలు రితన్య, దీయాక్షన్‌తో దవాఖానకు వెళ్తున్న క్రమంలో కూతురు రీతన్య మృతి చెందగా, కీర్తనకు తీవ్రగాయాలయ్యాయి. మండలంలో చిన్న గ్రామం కావడం, ఒకే సారి ఊరిలో తొమ్మిది మంది చనిపోవడం, మరికొందరు క్షతగాత్రులుగా మారడంతో గ్రామంలో ఘటన పేరెత్తితేనే వణుకుతున్నారు.

హిమ్మత్‌రావుపేటలో తొమ్మిది మంది
హిమ్మత్‌రావుపేటలో తొమ్మిది మంది కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోగా వారి కుటుంబాల రోదనలు మిన్నంటాయి. వేముల భాగ్య తన కూతురు శైలజ, మనవడు సాయితో కలిసి జగిత్యాలకు వస్తుండగా, మనవడు సాయి, భాగ్య చనిపోయారు. కూతురు శైలజ కరీంనగర్ చికిత్స పొందుతున్నది. గండి లచ్చవ్వ వైద్యం, ఇంటి సామగ్రి కోసం జగిత్యాలకు వస్తుండగా మృత్యువాత పడింది. ఆరె మల్లయ్య జగిత్యాలలో బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకునేందుకు వెళ్తూ చనిపోయాడు. పోలు లక్ష్మీ, పందిరి సత్తెవ్వ దవాఖానకు వెళ్తున్న క్రమంలో మృతి చెందారు. మల్యాల అనిల్, పడిగెల స్నేహలత కళాశాలకు వెళ్తూ కానరాని లోకాలకు తరలారు. నేదూరి మధునవ్వ, శనివారం పేటకు చెందిన తన కూతురు గుడిసె లక్ష్మీతో కలిసి జగిత్యాలలో దవాఖానకు వెళ్తూ మార్గమధ్యలో మధునవ్వ చనిపోయింది. లక్ష్మీ తీవ్రగాయాలతో కరీంనగర్ సన్‌షైన్‌లో చికిత్స పొందుతున్నది.

శనివారం పేటలో 12మంది..
బస్సు ప్రమాదంలో శనివారంపేటకు చెందిన 12మంది చనిపోవడం స్థానికంగా తీరని దుఃఖం మిగిల్చింది. నామాల మౌనిక, హిమ్మత్‌రావుపేటకు చెందిన తన తల్లి ఆరె లక్ష్మీతో కలిసి జగిత్యాలలో షాపింగ్, వైద్యం కోసం వెళ్తుండగా మౌనిక మృత్యువాత పడింది. తల్లి లక్ష్మీ కరీంనగర్‌లో చికిత్స పొందుతున్నది. గోలి అమ్మాయి, గోలి రాజమల్లు భార్య భర్తలు జగిత్యాలలో కంటి పరీక్షల కోసం వెళ్తూ మృతి చెందారు. గుడిసె రాజవ్వ, శేర్ల లక్ష్మి, జగిత్యాలకు వివిధ పనుల కోసం వెళ్తూ మృత్యువాతపడ్డారు. కంబాల సునీత కోర్టు పని కోసం, శేర్ల గంగవ్వ ధర్మాజిపేటలోని తన కూతురిని కలిసేందుకు వెళ్తూ ప్రమాదంలో చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఎండ్రికాయల సుమలత 9నెలల గర్భిణి కాగా, ఎండ్రికాయల వెంకవ్వ, ఉత్తెం భూమలక్ష్మీ, ఉత్తం నందిని, ఉత్తం లత కలిసి ప్రసవం కోసం వెళ్తుండగా వెంకవ్వ, సుమలత, భూమలక్ష్మీ, నందిని చనిపోయారు. లత తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నది. గాజుల లత, తన కొడుకు హర్షతో కలిసి వైద్యం కోసం వెళ్తుండగా హర్ష మృతిచెందాడు. లత తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నది.

తిర్మలాపూర్‌లో ఆరుగురు..
ప్రమాదంలో తిర్మలాపూర్‌కు చెందిన ఆరుగురు చనిపోయారు. గ్రామానికి చెందిన తిప్పర్తి వెంకటరత్నమ్మ, తైదల పుష్ప, శ్యామకూర మల్లవ్వ, సోమిడి పుష్పలత, దాసరి సుశీల, కంకణాల ఎల్లవ్వ వివిధ పనుల కోసం జగిత్యాలకు వస్తూ మృత్యువాత పడ్డారు.

కోనాపూర్‌లో ఇద్దరు..
కూతురు సుమలత ప్రసవం కోసం కోనాపూర్‌కు చెందిన ఉత్తెం భూలక్ష్మీ, తన మనవరాలు ఉత్తెం నందినితో కలిసి బస్సులో ప్రయాణిస్తూ ఇద్దరూ మృతి చెందారు.

కడ చూపుకోసం తల్లుల ఆరాటం..
తమ పిల్లలు తమ కళ్లెదుటే మృత్యువాత పడడంతో, వారి కడసారి చూపు కోసం తల్లులు ఆరాటపడడం చూపరులను కంట తడి పెట్టించింది. వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతూ తమ కన్న బిడ్డల దహన సంస్కారాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో వచ్చి పిల్లలను కడసారి చూసి ముద్దాడడం కన్నీరుపెట్టించింది. శనివారంపేటలో గాజుల లత, తన కొడుకు హర్ష, రాంసాగర్‌లో బైరి కీర్తన తన కూతురు రీతన్య, హిమ్మత్‌రావుపేటలో శైలజ, తన కొడుకు సాయి, కోనాపూర్‌లో ఉత్తెం లత, కూతురు నందిని మృతి చెందగా వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్సులలో కన్న పేగు కడసారి చూపు కోసం తీసుకొచ్చారు. పిల్లల దహన సంస్కారాల తర్వాత చికిత్స కోసం దవాఖానలకు తరలించారు.

వైద్యం కోసం వెళ్లే వారే అధికం..
కొడిమ్యాల మండలానికి చెందిన ఆరు గ్రామాల్లో మృతులు 48మంది కాగా, వారిలో 30మందికిపైగా వివిధ కారణాలతో దవాఖానలకు, వైద్య పరీక్షలకు వెళ్లేవారు ఉన్నారు. ఇటీవల మండలంలోని డబ్బుతిమ్మాయ్యపల్లె, రాంసాగర్, తిర్మలాపూర్, శనివారంపేట, హిమ్మత్‌రావుపేట మధ్య దూరభారం బాగా లేకపోవడంతో వైరల్ జ్వరాలు వ్యాపించడంతో వైద్య సిబ్బంది శిబిరాలు ఏర్పాటు చేసినా కొందరు జగిత్యాలలోని పలు దవాఖానలకు చికిత్స కోసం బయలుదేరారు. ఈ క్రమంలోనే మంగళవారం ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో అత్యధికంగా వైద్యంకోసం జగిత్యాలకు వెళ్లేవారున్నారు.

తక్షణ సాయం అందించిన ఆర్డీఓ..
ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కింద 20వేలను జగిత్యాల ఆర్డీవో ఘంటా నరేందర్, ఆయా మండలాల తహసీల్దార్ల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పంపిణీ చేశారు. కొడిమ్యాల మండలానికి చెందిన 48 మంది సభ్యులకు 9.60లక్షలు, మల్యాల మండలంలో ముగ్గురికి 60వేలు అందజేశారు.

తొమ్మిది మందికి రైతుబీమా వర్తింపు
ఆరు గ్రామాలకు చెందిన 9మంది మృతులకు రైతుబంధు పథకం వర్తించనుంది. రాంసాగర్‌కు చెందిన ఆనందం, శనివారంపేటకు చెందిన గోలి అమ్మాయి, గోలి రాజమల్లు, బొల్లారపు బాబు, కుంబాల సునంద, తిర్మలాపూర్‌కు చెందిన సోమిడి పుష్ఫ, కోనాపూర్‌కు చెందిన ఉత్తెం భూలక్ష్మీ, డబ్బు తిమ్మాయ్యపల్లెకు చెందిన పుండ్ర లలిత, డబ్బు అమ్మాయికి రైతుబీమా బాండ్లను ఇప్పటికే పంపిణీ చేయగా, వారి నామినీలకు 5లక్షల చొప్పున అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఎంపీ, జడ్పీ అధ్యక్షరాలు పరామర్శ
కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవి శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆరు గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. అందరి ఇళ్లకూ వెళ్లి కలుస్తూ, భరోసా ఇస్తూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు భారీ వర్షంలోనూ నిరంతరాయంగా తిరిగారు. గడప, గడపకూ వెళ్తూ 48 మంది కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయా చోట్ల పార్థివ దేహాలకు పూల మాలలు వేసి, నివాళులర్పించారు. కుటుంబసుభ్యలను అన్నివిధాలా ఆదుకుంటామనీ, అధైర్యపడవద్దని వెన్నుతట్టారు. వారి వెంట ఎంపీపీ మెన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, నాయకులు పునుగోటి కృష్ణారావు, వీర్ల వెంకటేశ్వర్ రావు, సురుగు శ్రీనివాస్, సంపత్, చింతపంటి యాదయ్య, జనగాం శ్రీనివాస్, వై సునీల్ రావు, మరాఠి గంగారెడ్డి, ఏలేటి నర్సింహరెడ్డి, ఏడేల్లి పరుశురాం, ఉప్పు చంద్రశేఖర్, వికృతి నాగరాజు, కాసాని లచ్చన్న, మల్లేశ్ యాదవ్ తదితరులున్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...