కొండంత విషాదం


Wed,September 12, 2018 02:25 AM

-కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
-బ్రేకులు ఫెయిలై అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
-చివరి మూలమలుపు వద్ద బోల్తా
-57 మంది మృత్యువాత
-మరో 43 మందికి తీవ్రగాయాలు.. చికిత్స
-రోదనలతో దద్దరిల్లిన జగిత్యాల, కరీంనగర్ దవాఖానలు
-పరామర్శించిన మంత్రులు ఈటల, కేటీఆర్, పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీలు కవిత, పొంగులేటి
-ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ:చెల్లాచెదురుగా మృతదేహాలు.. చెట్లు పుట్టలపై తెగిపడిన శరీర భాగాలు.. భయోత్పాతం కలిగించే రక్తపు మరకలు.. క్షతగాత్రుల హాహాకారాలు.. బంధువులు, కుటుంబసభ్యుల రోదనలతో కొండగట్టు హృదయవిదారకంగా మారింది. 100 మందితో ఘాట్‌రోడ్డుపై నుంచి కిందకు దిగుతున్న ఆర్టీసీ బస్సు, మొదటి స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేకులు ఫెయిలై అదుపుతప్పింది. చివరిమూలమలుపు దాటితే ప్రమాదం నుంచే బయటపడే అవకాశముండగా, అదుపులోకి తెచ్చేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడే ఆటోను ఢీకొని కుడివైపు లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 25మంది ప్రాణాలు కోల్పోగా, చికిత్స పొందుతూ మరో 32మంది మృత్యువాతపడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరో 43మందికి తీవ్ర గాయాలు కాగా, క్షతగ్రాతుల ఆర్తనాదాలతో జగిత్యాల, కరీంనగర్‌లోని దవాఖానలు దద్దరిల్లాయి. ఆర్టీసీ చరిత్రలోనే ఇదే అతి పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం కాగా, బాధిత కుటుంబాలకు సర్కారు 5లక్షలు, ఆర్టీసీ మరో 3లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి.

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఘాట్ రోడ్డులో మృత్యు ఘోష మోగింది. జగిత్యాల డిపోకు చెందిన ఏపీ 28జడ్ 2319 నంబర్ ఆర్టీసీ బస్సు, కొడిమ్యాల మండలం శనివారం పేట నుంచి మంగళవారం ఉదయం 10.30గంటలకు బయలు దేరి జేఎన్‌టీయూ క్యాంపస్ మీదుగా కొండగట్టు దేవస్థానం నుంచి ఘాట్ రోడ్డు మీదుగా డ్రైవర్, కండక్టర్‌తో కలిపి 100మందితో కొండ దిగుతుండగా, బ్రేకులు ఫెయిల్ అయి చిట్టచివరి మూల మలుపు వద్దకు రాగానే ఎదురుగా ఉన్న ఆటోను తప్పించబోయి అదుపు తప్పి నేరుగా లోయలోకి వెళ్లి పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో కలిపి 57 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. మరో 43మంది గాయపడ్డారు. మృతిచెందినవారిలో 30మంది మహిళలు, 23మంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. బస్సు లోయలోపడి భారీ శబ్ధం రావడంతో స్థానికులు వెంటనే వచ్చి క్షతగాత్రులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన 5 నిమిషాల్లోపే మల్యాల పోలీసులు వచ్చి, ప్రమాద తీవ్రత ఎక్కువ ఉందని భావించి అంబులెన్సులను పిలిపించి, క్షతగాత్రులను తరలించే ప్రయత్నం చేయడంతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో జగిత్యాల ఆర్డీఓ ఘంటా నరేందర్, ఎస్పీ సింధూ శర్మ, జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, కలెక్టర్ శరత్ చేరుకొని గాయపడిన వారిని జగిత్యాల వైద్యశాలకు పలు 108 అంబులెన్సులు, పోలీసు వాహనాలు, ప్రైవేటు జీపులు, ప్రైవేట్ అంబులెన్సులు, టాటా ఎసీలు, ట్రక్కుల్లో తరలించారు. బస్సులోంచి వెలికి క్రమంలోనే ఒక్కొక్కరు కొన ఊపిరితో ఉన్నవారు ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలంలోనే 25 మంది చనిపోయారు. గాయపడినవారిని జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ దవాఖానలకు తరలించారు. రాత్రి వరకు మృతుల సంఖ్య 57కు చేరుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

రూటు మార్చడం వల్లే ప్రమాదం
ఈ బస్సు జగిత్యాల, ధరూర్, రాజారాం, మల్యాల ఎక్స్ రోడ్డు, కొండగట్టు దిగువన బస్టాండ్, దొంగలమర్రి పోలీస్ చెక్‌పోస్టు, నాచుపెల్లి, జేఎన్‌టీయూ కళాశాల, డబ్బు తిమ్మాయ్యపల్లె, రాంసాగర్, హిమ్మత్‌రావుపేట, తిర్మలాపూర్, శనివారంపేటకు రోజూ వెళ్తుంది. తిరిగి ఆదే మార్గంలో జగిత్యాలకు చేరుకుంటుంది. కానీ, వేములవాడ డిపోకు చెందిన కొన్ని ఆర్టీసీ బస్సులు కొండగట్టు గుట్టపైకి భక్తుల కోసం వెళ్తూ, ఘాట్ రోడ్డు ద్వారా జగిత్యాలకు రాకపోకలు సాగిస్తున్నాయనీ, జగిత్యాల డిపో మేనేజర్ హన్మంతరావు కూడా శనివారం పేట బస్సును దేవస్థానంలో రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో జేఎన్‌టీయూ కళాశాల నుంచి తిరుగు ప్రయాణంలో కొండగట్టు దేవస్థానం మీదుగా, ఘాట్ రోడ్డు ద్వారా జగిత్యాలకు వారం రోజులుగా నడిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సు రూటు మార్చడం, ఆయా గ్రామాల్లో ప్రయాణికులు ఎక్కువ మంది ఎక్కడం, దాదాపు 100మందితో నిండిపోవడం వల్లే బస్సు అదుపు తప్పి ప్రమాదం సంభవించిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

-బస్సులోనే చిక్కుకొని..డ్రైవర్
ప్రమాద విషయం తెలిసి కొండగట్టు ఆలయ ఉద్యోగులు, మండల రెవెన్యూ ఉద్యోగులు, పోలీసు శాఖ సిబ్బంది చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మల్యాల, కొడిమ్యాల ఎస్‌ఐలు మిథున్ కుమార్, సతీష్ బస్సుల్లో చిక్కుక్కున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ప్రయాణికులంతా కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, డబ్బు తిమ్మాయపల్లె, శనివారంపేట, కోనాపూర్ గ్రామాల వారని తెలిసి వెంటనే తిర్మలాపూర్ సహకార సంఘం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రయాణికులందరినీ తీసిన తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ బస్సులోనే చిక్కుకోవడంతో అతడిని తీసేందుకు రాడ్లను ఉపయోగించి, బయటకు తీసి చికిత్స కోసం జగిత్యాలకు తరలించగా పరిస్థితి విషమించి చనిపోయాడు. కాగా అతడు మరో నెలలో రిటైర్డ్ కావాల్సి ఉందని తెలిసింది.

-కారణాలపై పోలీస్, రవాణా శాఖ అధికారుల ఆరా
ప్రమాదానికి కారణాలపై పోలీస్, రవాణా శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఎం కిషన్ రావు, ఏఎంవీఐ అభిలాష్ ఘటనా స్థలానికి చేరుకొని, బస్సును పరిశీలించారు. రోడ్డు నుంచి 30 ఫీట్ల లోతులో ఉన్న లోయలో పడడంతో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ సమయంలోనే కలెక్టర్ శరత్ వచ్చి బస్సులో ఉన్న విలువైన వస్తువులను సీజ్ చేయాలని రవాణా శాఖ అధికారి కిషన్‌రావును ఆదేశించారు. సంఘటనా స్థలానికి మల్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల రూరల్ సీఐలు నాగేందర్ గౌడ్, సతీష్ చందర్ రావు, రవి కుమార్, రాజేశ్, ఉమ్మడి జిల్లా ఎస్‌ఐలు, సీఐలు చేరుకొని కారణాలను వివిధ కోణాల్లో పరిశీలించారు.

-ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు
ఘటనా స్థలాన్ని మంత్రులు కేటీఆర్, పట్నం మహేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, బొడిగ శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, డీఐజీ ప్రమోద్, కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, జగిత్యాల టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ కుమార్, టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవి శంకర్, కాంగ్రెస్ నాయకులు కట్కం మృత్యుంజయం, మేడిపల్లి సత్యం, ఆర్టీసీ ఎండీ, ప్రిన్సిపల్ సెక్రటరీ రవాణ శాఖ సునీల్ శర్మ, ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ కొమురయ్య, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, కరీంనగర్ రీజినల్ మేనేజర్ జీవన్ సాగర్, జాయింట్ డైరెక్టర్ విజిలెన్స్ డైరెక్టర్ రాంచందర్ రావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలు అడిగి తెలుసుకున్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...