పేదల దేవుడిపై కానుకల వర్షం


Sun,September 9, 2018 02:51 AM

వేములవాడ, నమస్తే తెలంగాణ:దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఏటా కోటిన్నరకు పైగా స్వామివారిని దర్శించుకుంటారు. ఇందులో 80 శాతం మంది నిరుపేదలే ఉండడంతో, స్వామివారిని పేదల దేవుడని కీర్తిస్తారు. ఇక స్వరాష్ట్రంలో రాజన్న క్షేత్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తుండగా, ఏటేటా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే రాజన్నకు బంగారం, వెండిని మొక్కుల రూపంలో భక్తులు చెల్లిస్తుంటారు. దీంతో గడిచిన ఐదేళ్లలో స్వామివారికి 26 కేజీల బంగారం, 9 క్వింటాళ్ల 25కిలోల వెండి కానుకలు సమకూరాయి. ఇప్పటికే స్వామివారికి 28 కిలోల బంగారం గోల్డ్ బాండ్ రూపంలో బ్యాంకులో ఉండగా, దాదాపు రూ. 8 లక్షల వడ్డీ కూడా వస్తున్నది. ఇటీవలి కాలంలో వచ్చిన బంగారాన్ని కూడా గోల్డ్ బాండ్ రూపంలో డిపాజిట్ చేసేందుకు దేవాదాయశాఖ ఉన్నతాధికారులను కోరగా అనుమతులు కూడా వచ్చాయని ఆలయ ఈవో దూస రాజేశ్వర్ వెల్లడించారు.

ఏటా కోటిన్నరమంది భక్తులు..
రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి క్షేత్రానికి ఏటా కోటిన్నరకు పైగా భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి, శ్రీరామనవమి, శివకల్యాణం లాంటి ఉత్సవాలకు వేల సంఖ్యలో తరలివస్తుంటారు. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలోనూ అధికసంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.
బంగారం, వెండి కానుకలు..
రాజన్నను దర్శించుకున్న భక్తులు వెండి, బంగారం ఆభరణాలను కానుకల రూపంలో స్వామివారికి సమర్పిస్తుంటారు. ఇందులో హుండీ ద్వారా అధిక మొత్తంలో మొక్కులు చెల్లిస్తుండగా, మరికొందరు స్వామివారిసేవలో ఉపయోగించే వస్తువులను నేరుగా ఆలయానికే బహూకరిస్తున్నారు. స్వామివారి లింగాకారం, పానవట్టం, నాగఫణిలాంటి ఆభరణాలు ఎక్కువగా సమకూరుతున్నాయి. వీటితోపాటు భక్తుల నిలువు దోపిడీ, అమ్మవారికి ఆభరణాలు కూడా భక్తు లు సమర్పించుకుంటున్నారు. ఈ విధంగా సాలీన నాలుగున్నర కిలోల బంగారం, క్వింటాల్‌కు పైగా వెండి ఆభరణాలు స్వామివారికి సమకూరుతున్నాయని ఆలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
71 కేజీల బంగారం నిల్వలు..
భక్తులు సమర్పించిన కానుకలతోపాటు ఇప్పటికే ఉన్న భరణాలు కలిపి రాజన్న ఆలయానికి మొత్తం 71.765 కిలోల బంగారం నిల్వలు చేరాయి. రాజన్నతోపాటు అనుబంధ ఆలయాల్లోని దేవతామూర్తులకు 16.192 కిలోల ఆభరణాలున్నాయి. ఇందులో 28 కేజీల బంగారం ఇప్పటికే 2010లో గోల్డ్‌బాండ్ రూపంలో బ్యాంకు లో జమచేయగా, స్వామివారికి దాదాపు రూ.8లక్షల వడ్డీ సమకూరుతున్నది. మొత్తంగా వడ్డీ రూపంలో స్వామివారికి రూ.64లక్షలు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వీటితోపాటు ఇప్పటిదాకా చేరిన బంగారాన్ని కూడా గోల్డ్‌బాండ్ రూపంలో బ్యాంకులో జమచేసేందుకు దేవాదాయశాఖ కమిషనర్‌ను కోరగా, ఇటీవలే అనుమతులు మంజూరు చేశారు.

3900 క్వింటాళ్లకుపైగా వెండి నిల్వలు..
స్వామివారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలు దాదాపు 3900 క్వింటాళ్లకుపైగా చేరాయి. రాజన్న ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలతో కలిపి ఏడు క్వింటాళ్ల 14కిలోల ఆభరణాలున్నాయి. స్వామివారి నిత్యసేవలతోపాటు పల్లకీ సేవలకూ వెండి వాహనాలు, వెండి ఆభరణాలనే వినియోగిస్తున్నారు. హుండీ ద్వా రా సమకూరిన 3900 క్వింటాళ్ల 952కిలోల వెండి కానుకలను యథావిధిగా బ్యాంకుల్లో భద్రపరిచారు.

ఐదేళ్లలో 26కేజీల బంగారం..
స్వామివారికి కానుకల రూపంలో గత ఐదేళ్లలో 26కేజీల బంగారం, 925కిలోల వెండి వస్తువులు సమకూరాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా 3.475 కిలోల బంగారం, 187.100 కిలోల వెండి, 2014-15లో 3.647 కిలోల బంగారం, 163.050 కిలోల వెండి, 2015-16లో 3.427 కిలోల బంగారం, 193.200 కిలోల వెండి, 2016-17లో 4.312 కిలోల బంగారం, 166 కిలోల వెండి, 2017-2018లో 4.682 కిలోల బంగారం, 105.650 కిలోల వెండి వచ్చింది. వీటితోపాటు నేరుగా స్వామివారికి కానుకల రూపంలో అందిన బంగారు అభరణాలతో కలిపి మొత్తం 26 కేజీలు, వెండి కానుకలు 9 క్వింటాళ్ల 25 కిలోలకు చేరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
గోల్డ్‌బాండ్‌కు అనుమతి..
స్వామివారికి భక్తులు సమర్పిస్తున్న బంగారం, వెండి కానుకల ను ఎప్పటికప్పు డు బ్యాంకుల్లో భద్రపరుస్తు న్నం. బంగారా న్ని గోల్డ్‌బాండ్ పేరిట బ్యాంకులో పెట్టేందుకు దేవాదాయశాఖ కమిషనర్ ఇప్పటికే అనుమతిచ్చారు. గతంలో స్వామివారికి 28 కేజీల బంగారం గోల్డ్‌బాండ్ ఉన్నది. సాలీనా రూ. 8లక్షల వడ్డీ సమకూరుతున్నది. అలాగే మరో 26 కేజీల బంగారాన్ని కూడా పెడతాం. వెండి నిల్వలు పెరిగిపోతున్న విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. గత ఐదేళ్లలో భక్తుల నుంచి బంగారం, వెండి కానుకలు స్వామివారికి అధికంగానే సమకూరుతున్నాయి.
- దూస రాజేశ్వర్,

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...