అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి


Fri,September 7, 2018 02:56 AM

- డెలివరీ మెకానిజం మెరుగవ్వాలి
-అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ వెంకట్రామి రెడ్డి
కలెక్టరేట్ : జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ పథకా లు అందేలా చూడాలనీ, అన్ని ప్రభుత్వ శాఖలు డెలివరీ మెకానిజంను మరింత మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి, యువజన క్రీడల అధికారి, టౌన్, కంట్రీ ప్లానింగ్, ట్రాన్స్‌పోర్ట్, వ్యవసాయ శాఖ, వెటర్నరీ, జౌళి తదితర శాఖల ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. తొలుత ఉపాధి కల్ప న కార్యాలయం ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. జిల్లా లో 13800 మంది కార్యాలయంలో నమోదు చేసుకున్నారన్నారు. ప్రతినెలా జాబ్‌మేళాను నిర్వహించి వివిధ ప్రైవేట్ కంపెనీల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిసుస్తున్నామనీ గతనెల 22న నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 32 మందికి ప్లేస్‌మెంట్ కల్పించి నియామక ఉత్తర్వులు అందించామని జిల్లా ఉపాధి కల్పన అధికారి నీల రాఘవేందర్ కలెక్టర్‌కు తెలిపారు. అభ్యర్థులు, కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఉపాధి కల్పన అధికారికి కలెక్టర్ సూచించారు. అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రైవేట్ రంగంలో అపార అవకాశాలను తెలియజేయాలన్నా న్నారు. వచ్చే వారంలోగా న్యాక్ ప్రతినిధులతో ప్రతిపాదనలు తీసుకుని భవన నిర్మాణానికి వీలుగా 10 గుంటల భూమిని న్యాక్‌కు స్వాధీనపర్చాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో వివిధ క్రీడలకు సంబంధించి టోర్నమెంట్‌లు నిర్వహించాలనీ, వాలీబాల్, కబడ్డీ అసోసియేషన్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా యువజన క్రీడల అధికారి అనిల్‌కుమార్‌ను ఆదేశించారు. డీఈ వో, పీఈటీల సహకారంతో దసరా సెలవు రోజుల్లో క్రీడా యాక్టివిటీస్ వారం రోజులపాటు నిర్వహించాలన్నారు. సిరిసిల్లలో మినీ స్టేడియాన్ని పూర్తి చేసేందుకు మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టీఎఫ్‌ఐడీసీ నిధులు రూ.3 కోట్లతో పెండింగ్, అభివృద్ధి పనులు అతి త్వరలో పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. వేములవాడ లో మినీ స్టేడియాన్ని పూర్తి చేసేందుకు చొరవ చూపుతామన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గంలోని 5 మండల కేంద్రాల్లో మినీ స్టేడియాల నిర్మాణానికి వీలుగా స్థల కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు. పట్టణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న స్టేడియానికి నూతన కలెక్టరేట్‌కు సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు. జిల్లాలో 10 మంది లబ్ధిదారులకు 10 రోజుల్లో బోర్‌బావులను డ్రిల్ చేసేలా ముందుకు సాగాలన్నారు. గత సంవత్సరం తవ్విన 8 బోరుబావులు, కొత్తగా తవ్వనున్న 10 బోర్లు మొత్తం 18 బోర్లకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. వేములవాడ ఆలయం, జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో తిను బండారాల నాణ్యతను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని లీగల్ మెట్రాలజీ అధికారి రవీందర్‌ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని వ్యవసాయ గోదాముల్లో నిల్వ సామర్థ్యం గతంలో 5,200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 45,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి చేరిందన్నారు. రూ.3 కోట్ల 40 లక్షలతో సుభాష్‌నగర్‌లో నిర్మిస్తున్న సమీకృత రైతుబజార్ మూడు ఎకరాలలో నిర్మిస్తున్నామని జిల్లా మార్కెటింగ్ అధికారి షాబొద్దీన్ కలెక్టర్‌కు తెలిపారు. రబీ సీజన్‌లో రైతులకు ఫర్టిలైజర్ కొరత లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారి రణధీర్‌ను ఆదేశించారు. జిల్లాలో 21 మంది రైతుల మరణాలు సంభవించగా 17 మందికి బీమా పరిహారం అందించారనీ, మిగతా వారికి త్వరగా అందించాలన్నారు. అనంతరం కలెక్టర్ గొర్రెల ప్రత్యేక అభివృద్ధి పథకంపై పశుసంవర్ధక శాఖ అధికారులతో చర్చించారు. ఈ నెలాఖరులోగా 1000 యూనిట్లను పంపిణీ చేసే దిశగా పనులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు చనిపోయిన 1450 జీవాలకు సంబంధించి బీమా పరిహారం తీసుకొని చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి లబ్ధిదారులకు అందించాలన్నారు. హరితవనాలలో హరితహారంను అగ్రెసివ్‌గా చేపట్టాలని డీఎఫ్‌వో శ్రీనివాస్‌ను కలెక్టర్ ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్ 100 కిలోమీటర్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవడంపై కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలు సమీక్ష సందర్భంగా డీసీవో మహ్మద్ అలీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సమావేశాలకు హాజరుకాలేదు. గైర్హాజరైన అధికారులకు కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. పునరావృతమయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో జేసీ యాస్మిన్‌బాషా, శిక్షణ కలెక్టర్ రాహుల్‌శర్మ, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...