మెట్టకు పట్టాభిషేకం


Thu,September 6, 2018 01:24 AM

- నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో సమగ్రాభివృద్ధి
- కోట్లాది రూపాయలతో మారిన రూపురేఖలు
- శరవేగంగా గౌరవెల్లి రిజర్వాయర్ పనులు
- చకచకా శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు ఆధునికీకరణ
- మహాసముద్రం గండి పునరుద్ధరణతో నెరవేరిన దశాబ్దాల కల
- త్వరలోనే మిడ్‌మానేరు కుడికాలువ ద్వారా 29వేల ఎకరాలకు సాగునీరు
- సీఎం దత్తతతో మారిపోయిన చిన్నముల్కనూర్
- అద్దాల్లా రహదారులు.. మండలాల్లో గోదాములు
- కొత్తగా 40 గ్రామ పంచాయతీలు
- 17 కోట్లతో సమీకృత భవన నిర్మాణాలు

ప్రధాన ప్రతినిధి/సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాడు కరువుతో తల్లడిల్లిన మెట్టప్రాంతం నేడు ప్రగతి పథానా దూసుకెళ్తున్నది.. గత పాలకుల వివక్షకు గురైన హుస్నాబాద్ నియోజకవర్గం, టీఆర్‌ఎస్ సర్కారు పాలనలో సమగ్రాభివృద్ధి చెందుతున్నది.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిధుల వరద పారించడంతో అన్ని రంగాల్లోనూ పరుగులు పెడుతున్నది.. 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్ పనులు శరవేగంగా కొనసాగుతుండగా, మహాసముద్రం గండి పునరుద్ధరణతో దశాబ్దాల కల సాకారమైంది.. 23 కోట్లతో శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు ఆధునికీకరిస్తుండగా, ఈ సీజన్ నుంచే మధ్యమానేరు ప్రాజెక్టు కుడికాలువ ద్వారా 29వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.. ఇంకా అద్దాల్లాంటి రోడ్లు, 17 కోట్లతో సమీకృత భనవ నిర్మాణాలు, పాలిటెక్నిక్ కాలేజీ, మినీట్యాంక్ బండ్‌గా ఎల్లమ్మ చెరువు, కొత్త గోదాములు, కొత్త పంచాయతీలు , ఇంటింటికీ సంక్షేమ పథకాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం నాలుగున్నరేళ్లలోనే ఆవిష్కృతమైంది. అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్న హుస్నాబాద్ నుంచే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుడుతుండడం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్నది.

స్వరాష్ట్రంలో మెట్టప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో కోట్లాది రూపాయలు రాగా, అన్నిరంగాల్లోనూ అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఇక్కడి చిరకాల కోరిక అయిన గౌరవెల్లి రిజర్వాయర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహాసముద్రంగండి చెరువు పనులు పూర్తయ్యాయి. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టును సుందరీకరిస్తుండగా, మిషన్ కాకతీయతో చెరువులు పునర్జీవం పోసుకున్నాయి. హుస్నాబాద్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మినీట్యాంక్ బండ్‌గా సుందరీకరణ తదితర పనులు పూర్తవుతున్నాయి. సీఎం దత్తతతో చిన్నముల్కనూర్ గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ హుస్నాబాద్ నియోజకవర్గానికి మహర్దశ పట్టగా, నమస్తే ప్రత్యేక కథనం.. - కరీంనగర్

జిల్లాల పునర్విభజనతో హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలోకి విస్తరించి ఉంది. సిద్దిపేట జిల్లాలో నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్‌తో పాటు అక్కన్నపేట, కోహెడ మండలాలు, కరీంనగర్ జిల్లాలో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు, వరంగల్ అర్బన్ జిల్లాలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు ఉన్నాయి. భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌ల సహకారంతో స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు చేపట్టడంతో ఆ ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో ఇక్కడ అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉండేది. గిరిజన తండాలను మదిర గ్రామాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ఆ గ్రామాలకు మహర్దశ వచ్చింది. ఎన్నో ఏండ్లు ఎదురుచూస్తున్న ప్రజలకు కొద్ది నెలల కిందనే పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలో 40 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి.

శరవేగంగా గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు..


మెట్టప్రాంతమైన హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నది. ఈ రిజర్వాయర్‌ను 1.14టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని మొదట్లో ప్రతిపాదనలు చేశారు. కానీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేయించి 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని సూచించారు. రిజర్వాయర్ నిర్మాణం వల్ల గుడాటిపల్లి, తెనుగుపల్లి, మద్దెలపల్లి, సౌలపల్లి, చింతలతండా తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. సుమారుగా రూ. 2వేల కోట్లతో రిజర్వాయర్ పనులను చేపట్టింది. భూనిర్వాసితులకు రూ. 104కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. ఈ రిజర్వాయర్ కింద సుమారు లక్షా6వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. రిజర్వాయర్ కుడి కాల్వ నుచి 90 వేల ఎకరాలకు, ఎడమ కాల్వ నుంచి 16వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని గ్రామాలతో పాటు పక్కనే ఉన్న కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందనుంది. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులకు గత జనవరి మాసంలో మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేయడంతో ఆ రోజు నుంచి శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. మరికొద్ది నెలల్లోనే గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి నీటిని నింపి ఈ ప్రాంతానికి సాగునీరు అందించే లక్ష్యం పెట్టుకున్నారు.

మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం...


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, భీమదేవరపల్లి, చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి మండలాల్లోని 332 చెరువు పనులకు గానూ రూ. 144.32కోట్లు మంజూరు చేసి చెరువు పనులు చేపట్టింది. దాదాపుగా చెరువు పనులన్నీ కూడా పూర్తయ్యాయి. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ కోసం ప్రభుత్వం రూ.6.55కోట్లు కేటాయించింది. ఇటీవలే మరిన్ని నిధులు కూడా మంజూరు చేయడంతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హుస్నాబాద్ పట్టణానికి తలమాణికంగా ఈ చెరువు నిలవనున్నది. పట్టణ ప్రజలకు ఎంతో ప్రయోజనకరం కానుంది. కోహెడ మండలంలోని శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు సుందరీకరణ కోసం రూ. 23కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం త్వరితగతిన పనులు చేపట్టింది. ఈ చెరువు కింద సుమారుగా 3 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగులోకి రానుంది. పోరెడ్డిపల్లి వద్ద వాగుపై చెక్‌డ్యాం, బ్రిడ్జి నిర్మాణానికి రూ. 13కోట్లు, గుండారెడ్డిపల్లి వద్ద చెక్‌డ్యాం నిర్మాణానికి రూ. 3కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయించింది. సింగరాయ ప్రాజెక్టుకోసం రూ. 5కోట్లు కేటాయించింది. .

29వేల ఎకరాలకు మధ్యమానేరు నుంచి సాగునీరు


మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గానికి మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్టు పరిధిలో మొత్తం 2,52,882ఎకరాల ఆయకట్టుకు ఉండగా, ఈ సీజన్ నుంచే కుడికాలువ ద్వారా 80 వేల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించింది. ఈ కాలువ 75 కిలోమీటర్ల పొడవు ఉండగా, ఇప్పటికే పనుల ప్రక్రియ పూర్తయింది. దీనికి అనుసంధానంగా డిస్ట్రిబ్యూటరీ సిస్టంలో భాగంగా పలు పిల్లకాలువల నిర్మాణం, ఇందుకు కావాల్సిన భూసేకరణ లాంటి పనుల కోసం కొద్ది నెలల క్రితమే ప్రభుత్వం 90 కోట్లను కేటాయించింది. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు 10 కోట్లు, కరీంనగర్ జిల్లాకు 38 కోట్లు, సిద్దిపేట జిల్లాకు 42 కోట్లు కేటాయించారు. ఆ మేరకు పనులు దాదాపు పూర్తి చేశారు. మధ్యమానేరు జలాశయానికి అనుకున్న స్థాయిలో నీరు రాగానే.. ఈ ప్రాజెక్టు కుడికాలువ ద్వారా నిర్దిష్ట ప్రాంతాల్లోని 80 వేల ఎకరాలకు సాగునీరందించనున్నారు. ఇందులో హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో 28,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నారు.

మహాసముద్రం గండి కల సాకారం..


హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఉమ్మాపూర్ గ్రామ సమీపంలో రెండు గుట్టల లోయల మధ్యన మహాసముద్రంగండి చెరువు ఉంటుంది. సుమారు 50 ఏళ్ల కిందటనే ఈ చెరువుకు గండి పడింది. అప్పటి నుంచి ఆ చెరువు కింది రైతాంగం గండి పూడ్చాలని అప్పటి సమైక్య ప్రభుత్వాలను వేడుకున్నా ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక స్థానిక శాసనసభ్యుడు వొడితెల సతీశ్‌కుమార్ ఈ చెరువుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2015లోనే సీఎం కేసీఆర్, భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెరువును సందర్శించారు. చెరువు గండిని పూడ్చటంతో పాటు ఆధునీకరించడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తానని హామీ ఇచ్చి రూ. 3.87కోట్లు మంజూరు చేశారు. చెరువు గండిని త్వరితగతిన మరమ్మతు చేపట్టి 17మీటర్ల ఎత్తులో కట్ట నిర్మాణం పూర్తి చేశారు. ఏండ్లుగా వట్టిపోయిన మహాసముద్రం గండి చెరువులోకి నీరు చేరడంతో కింద ఉన్న పలు గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో పాతాళగంగ పైకి వచ్చింది. ఈ చెరువుతో హుస్నాబాద్ పట్టణంతో పాటు మండలంలోని ఉమ్మాపూర్, నాగారం, మహ్మదాపూర్, రాములపల్లి, పోతారం(ఎస్), సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట, ఆకునూరు, పెర్కపల్లి, చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి, బొమ్మనపల్లి తదితర గ్రామాల్లో బావుల్లో భూగర్భజలాలు గత ఏడాది నుంచే గణనీయంగా పెరిగాయి. ఎన్నడూ లేనంతగా బావుల్లోకి నీళ్లు రావడం మహాసముద్రంగండి వల్లనే సాధ్యమైందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

రైతుబంధు మొదటి విడుతలో రూ.62.63 కోట్లు పంపిణీ


రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ద్వారా హుస్నాబాద్, కోహెడ, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సైదాపూర్, వంగర, దుద్దెనపల్లిలో రూ. 6.65కోట్లతో గోదాముల నిర్మాణం చేపట్టింది. హుస్నాబాద్‌లో రైతు బజార్ నిర్మాణానికి కోటి రూపాయలు కేటాయించింది. ఈ పనులు కూడా త్వరితగతిన వేగంగా జరుగుతున్నాయి. రైతుబంధు పథకం కింద చిగురుమామిడి మండలంలో 9,456, సైదాపూర్‌లో 10,909, హుస్నాబాద్‌లో 7,456, కోహెడలో 10,766, అక్కన్నపేటలో, 10,264, భీమదేవరపల్లిలో 8,701, ఎల్కతుర్తిలో 8,950 మొత్తం నియోజకవర్గంలో 66వేల 502 మందికి రూ. 62.63 కోట్లు రైతుబంధు పథకం కింద పంపిణీ చేశారు. దీంతో అర్హులైన ప్రతి రైతుకు బీమా బాండ్లను అందించారు. రైతులకు సబ్సిడీపై నియోజకవర్గ వ్యాప్తంగా 50 ట్రాక్టర్లను అందించారు. గత ఏడాది హుస్నాబాద్ ప్రాంతంలో వడగళ్ల వర్షం కురవడంతో రైతులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు 22 గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి ఆ రైతులందరినీ ఓదార్చి వారందరికీ ఇన్‌పుట్ సబ్సిడీని అందించి ప్రభుత్వం ఆదుకున్నది.

ఆదర్శం చిన్న ముల్కనూర్


నాటి ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన చిన్నముల్కనూర్ గ్రామం, స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్లింది. 2015 జూలైలో గ్రామాన్ని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకోవడంతో అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. గడిచిన మూడేళ్లలో 70కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. దీంతో గ్రామం రూపురేఖలే మారిపోయాయి. 18.37కోట్లతో 245 డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించారు. 66.30లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. సీసీ కెమెరాల ఏర్పాటు, సౌర విద్యుత్‌తో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామానికి వచ్చే ప్రతి రోడ్డు డబుల్ రోడ్లుగా మార్చారు. గ్రామంలో ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణం పూర్తిచేసి వైద్యంను అందుబాటులోకి తెచ్చారు. గ్రామంలో తాగునీటి వసతి కోసం 40లక్షలతో బోర్లు, మోటార్లు, 5లక్షలతో పైపులైన్లు వేయగా, 10లక్షలతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను నిర్మించారు. మిషన్ భగీరథ కింద 55లక్షలు కేటాయించారు. ఈ పనులు కూడా పూర్తయి చేసి, త్వరలోనే ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రజా అవసరాల కోసం భవనాల నిర్మాణానికి ప్రత్యేక స్థలాలను కేటాయించారు. మిషన్ కాకతీయ కింద గ్రామంలోని చెరువులు, కుంటలను 2.12కోట్లతో పునరుద్ధరించారు. ఊర చెరువుకు 97.80లక్షలు, దోమకుంటకు 53.58లక్షలు, రుద్రకుంటకు 53.40లక్షలు, పల్లేనికుంటకు 8లక్షల కేటాయించి పనులు పూర్తి చేశారు. గ్రామంలో నెలకు 4లక్షలు పింఛన్ల కింద ఇస్తున్నారు. హరితహారం కింద మూడు విడతల్లో 45,380మొక్కలను నాటారు. వందశాతం ఐఎస్‌ఎల్ నిర్మాణాలు పూర్తి చేసి, గ్రామాన్ని స్వచ్ఛతలోనూ ఆదర్శంగా నిలిపారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...