సిరిసిల్లకు పారిశ్రామిక హంగులు

Tue,January 10, 2017 11:42 PM


రాజన్న సిరిసిల్ల, ప్రతినిధి నమస్తేతెలంగాణ : నూతనంగా ఏర్పడ్డ సిరిసిల్ల జిల్లా పారిశ్రామిక నగరంగా రూపుదిద్దుకోబోతున్నది. వస్త్ర పరిశ్రమ పొదిలో మరో అధునాతన టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు తెలంగాణ సర్కారు సన్నాహాలు ప్రారంభించింది. ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా నాడు ఉపాధి కోసం వలస బాట పట్టిన యువత నేడు స్వగ్రామాలకు తిరుగుముఖం పట్టింది. వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా టీఎస్ ఐపాస్ సంస్థ భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.

ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ పార్కు


ఆధునికీకరణ దిశగా వడివడి అడుగులు వేస్తున్న సిరిసిల్ల పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టెక్స్‌టైల్ రంగాన్ని పూర్తిస్థాయిలో ఆధునికీకరణ చేసి, నాణ్యమైన వస్ర్తాల తయారీకి కసరత్తు ప్రారంభించింది. ఇందు కోసం 300 ఎకరాల్లో 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల సిద్దిపేట రహదారులు జాతీయ రహదారులుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈప్రాంతం రవాణా పరంగా అభివృద్ధి చెందనుంది. ఈరోడ్డుకు ఆనుకుని ఉన్న సర్ధాపూర్ వద్ద సుమారు 3వేల ఎకరాల స్థలాన్ని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్ ఐపాస్)కు కేటాయించింది. అందులో రెండవ పార్కు ఏర్పాటు చేయడానికి, అందులో మౌలిక వసతులపై టీఎస్ ఐపాస్ ప్రాజెక్టు మేనేజర్ ఉమామహేశ్వర్‌రావు, లక్ష్మీనారాయణల ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం సిరిసిల్లను సందర్శించింది. వస్త్ర యజమానులు, చేనేత జౌళిశాఖ అధికారులతో సమీక్షించింది.

కాగా తెలంగాణకే తలమానికమైన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇప్పటికే వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. గత ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ లేక చతికిలపడ్డ మరమగ్గాలను యజమానులు పాత సామాన్ల కింద అమ్ముకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ మంత్రి కావడం పరిశ్రమకు, కార్మికులకు మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం సారంపల్లి వద్ద ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ పార్కు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నది. ఈ పార్కులో ఐదు నుంచి పదివేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ పార్కు కేవలం 65 ఎకరాల్లో ఏర్పాటు చేయడం వల్ల, స్థలాభావంతో సాంకేతికపరంగా ఆధునికీకరించలేక పోయింది. ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కులో ప్రాసెసింగ్ యూనిట్లు, డైయింగ్‌లు, అపెరల్ పార్కులు, సైజింగ్‌లు నెలకొల్పుతారు. ఇక్కడ ఉత్పత్తి అయిన వస్ర్తాలు ప్రాసెసింగ్ చేయాలంటే హైదరాబాద్, ముంబాయి ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ పార్కులో అన్ని హంగులతో మౌలిక వసతులు కల్పించబడుతున్నందున ఉత్పత్తి చేసిన వస్ర్తాలకు ఇక్కడే మార్కెట్ వ్యవస్థ నిర్మాణం చేసుకోవచ్చు.

పారిశ్రామిక వేత్తల చూపు సిరిసిల్ల వైపు


వస్త్ర పరిశ్రమ రంగంలో ముంబాయి, భీవండీలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న సిరిసిల్ల వైపు వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దృష్టిసారించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టెక్స్‌టైల్ రంగానికి అనేక రాయితీలు ఇస్తున్నది. ఇటు కార్మికులకు వ్యక్తిగత రుణ మాఫీ చేయడం, ఆసాములకు రాజీవ్‌విద్యామిషన్ ద్వారా వస్త్ర ఉత్పత్తులకు ఆర్డర్లు ఇచ్చింది. మాక్స్‌సోసైటీలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్న క్రమంలో మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ఇతర రాష్ర్టాల నుంచి పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉండగా వచ్చే బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం నూతన టెక్స్‌టైల్ పాలసీని ప్రకటించబోతున్నది. పారిశ్రామిక వేత్తలకు, కార్మికుల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా పాలసీ రూపొందిస్తున్నది.

దేశంలోని టెక్స్‌టైల్‌రంగ పారిశ్రామిక వేత్తలంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కులో విద్యుత్ రాయితీలు, యారన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తారు. అలాగే పట్టణంలో ఉన్న మూడు వందల డైయింగ్ యూనిట్లను ఒకే చోటకు చేర్చడం వల్ల మూడువేల మందికి ఉపాధి కలుగుతుంది. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న సుమారు 5వేల మంది మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం కోసం గార్మెంట్, అపెరల్ పార్కులను ఏర్పాటు చేయనున్నది. ఇప్పటికే టీఎస్ ఐపాస్ రూపొందించిన ప్రణాళికలతో పాటు పార్కులో యజమానులకు కల్పించే సౌకర్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రాయితీలపై సమీక్షించి వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదించనున్నట్లు అధికారులు తెలిపారు.

మార్కెట్ సౌకర్యం కలుగుతుంది


ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం వల్ల వస్త్ర ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కలుగుతుంది. హైదరాబాద్‌లాంటి ప్రాంతాలకు వెళ్లి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.
-దార్నం లక్ష్మీనారాయణ,అర్బన్ బ్యాంకు చైర్మన్ సిరిసిల్ల

ప్రాసెసింగ్ యూనిట్‌తో ఇబ్బందులు దూరం


టెక్స్‌టైల్స్ పార్కు ఉన్నప్పటికీ ప్రాసెసింగ్ యూనిట్లు లేక నాణ్యమైన వస్ర్తాలను తయారు చేయలేకపోతున్నం. ఇంటిగేటెడ్ టెక్స్‌టైల్ పార్కు ద్వారా ఆ ఇబ్బందులుండవు. ఇక్కడే డైయింగ్ చేసుకోవచ్చు.
-అన్నల్‌దాస్ అనిల్, ఇన్వెస్టర్ సిరిసిల్ల

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ అమలు


ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ అమలవుతుంది. విద్యుత్ రాయితీలు వర్తిస్తాయి. డైయింగ్, గార్మెంట్ పరిశ్రమలన్నీ ఒకేచోట ఉంటాయి. మంత్రి కేటీఆర్ కృషితో వేలాది మందికి ఉపాధి కలుగుతుంది.
-మంచె శ్రీనివాస్, పారిశ్రామిక వేత్త సిరిసిల్ల

మహిళలు, కార్మికులకు మంచి భవిష్యత్తు


ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ పార్కు సిరిసిల్లకు రావడం వల్ల కార్మికులు, మహిళలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. 10వేల మంది కార్మికులు, 5వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. డీపీఆర్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం.
-అశోక్‌రావు, చేనేత జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్

107
Tags

More News

మరిన్ని వార్తలు...