ప్రమాదరహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల


Tue,January 10, 2017 11:38 PM


సిరిసిల్లటౌన్: కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదాలను నిరోధించే విధంగా రవాణా, పోలీస్ శాఖలు చర్యలు చేపట్టాయి. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా విద్యార్థులను చైతన్యపరుస్తూ పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్న లక్ష్యంతో ఇరు శాఖల అధికారులు ముందడుగు వేస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ హంసవాహిణి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబందనలపై అవగాహన కల్పించారు. భావి పౌరులకు రోడ్డు భద్రతపై వక్తలు చేసిన సూచనలు వారి మాటల్లోనే..

సామాజిక బాధ్యతగా గుర్తించాలి


-జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి, కొండల్‌రావ్
రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలి. జిల్లాలో అధికశాతం మరణాలు ప్రమాదాల బారిన పడి జరిగినవే ఉన్నాయి. 2014-2015లో జరిగిన 189 రోడ్డు ప్రమాదాల్లో 77మంది, 2015-2016లో జరిగిన ప్రమాదాల్లో 86 మంది మరణించారు. ప్రమాదాల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతోంది. అవగాహన లోపం, అతి వేగం వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక నిబంధనలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

చట్టాన్ని గౌరవించాలి


-డీఎస్పీ, సుధాకర్
వాహనదారులు చట్టాన్ని గౌరవించడం అలవరుచుకోవాలి. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు పట్టణంలో అవగాహన సదస్సులు నిర్వహించాం. మద్యం మత్తులో వాహనాలు నడిపేవారికి జరిమానాలు విధిస్తున్నాం. అజాగ్రత్తగా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. అయినప్పటికీ వాహనదారులు అజాగ్రత్తగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ట్రాఫిక్ నియమాలు, చట్టంపై అవగాహన పెంచుకోవాలి.

రోడ్ల అభివృద్ధికి నిధులు


-సెస్ చైర్మన్, దోర్నాల లకా్ష్మరెడ్డి
నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్ల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. ఇరుకు రోడ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి రోడ్ల విస్తరణకు మంత్రి అత్యధిక నిధులు కేటాయిస్తున్నారు. రానున్న కాలంలో జిల్లాలో రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. జిల్లా కేంద్రంలో కూడళ్ల విస్తరణ పనులకు ఇప్పటికే మంత్రి నిధులు మంజూరు చేశారు. త్వరలోనే రోడ్ల వెడల్పుతో పాటు కూడళ్ల విస్తరణ జరుగుతుంది. వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల సౌకర్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి రోడ్లకు అనుగుణంగా వాహనదారులు వాహనాలు నడపాలి.

ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు


-సీఐ, విజయ్‌కుమార్
ప్రమాదాలు నివారణ కోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. పట్టణ ప్రదాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడిపిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి కేసులు నమోదు చేశాం. ప్రధాన చౌరస్థాలలో నిత్యం వాహన తనిఖీలు చేపడుతున్నాం. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో వాహనాల సంఖ్యకు సరిపడా విశాలమైన రోడ్లు లేవు. ఇది గమనించి వాహనాలు నడపాల్సిన అవసరం ఉంది. యువత బైక్‌లు అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. దీనిపై పూర్తి బాధ్యత వారి తల్లిదండ్రులు తీసుకోవాల్సి ఉంటుంది.

అవగాహన లోపంతో ప్రమాదాలు


-కొండ హరీష్
నేటి యువత సరదా కోసం వాహనాలు అతివేగంగా నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీని వల్ల అనేక సందర్భాల్లో రోడ్డుపై సక్రమంగా వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనం ఇచ్చే ముందు కనీస జాగ్రత్తలు వివరించాల్సి ఉంటుంది. అవగాహన లోపంతో ఇష్టారీతిన వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

326
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS