చిల్లర గ్యాంగ్‌ల ఆటలు సాగనివ్వం


Thu,December 5, 2019 01:19 AM

-డీసీపీ రవీందర్‌ యాదవ్‌
-పెద్దపల్లి, ధర్మారంలో ఆపరేషన్‌ చబుత్రలో అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు, కౌన్సెలింగ్‌

కలెక్టరేట్‌: ప్రస్తుత రోజుల్లో ఎక్కడైనా యువతీ యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దనీ, చిల్లర గ్యాంగ్‌ల ఆటలను సాగనివ్వబోమని పెద్దపల్లి జోన్‌ డీసీపీ పులిగిళ్ల రవీందర్‌ యాదవ్‌ పేర్కొన్నారు. రామగుండం పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ ఆదేశాల మేరకు పెద్దపల్లిలో మంగళవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్‌ చబుత్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దపల్లి రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, శాంతినగర్‌, ైప్లెఓవర్‌ బ్రిడ్జి, మసీద్‌, సాగర్‌రోడ్‌, కమాన్‌రోడ్‌తో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలను డీసీపీ,ఏసీపీల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ కనిపించిన 22 మందిని అదుపులోకి తీసుకుని బుధవారం పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం డీసీపీ మాట్లాడారు. ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని రామగుండం పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పోలీసుశాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోని 66 ప్రాంతాలను అల్లరి మూకలకు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని వెల్లడించారు. సీపీ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైన భద్రత చర్యలను కట్టుదిట్టం చేస్తూ నిఘాను తీవ్రతరం చేశామన్నారు. పెద్దపల్లి పరిసర ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా యువకులతో పాటు ఎవరైనా మద్యం తాగడంతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాత్రివేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, పుట్‌పాత్‌లపైన అడ్డాలు వేసి గుంపులు గుంపులుగా ఉన్నా, బహిరంగంగా మద్యం తాగినా, అనుమానాస్పదంగా తిరిగినట్లు కనిపించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్‌, సీఐలు ప్రదీప్‌కుమార్‌, గట్ల మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు ఉపేందర్‌రావు, షేక్‌ జాని పాషా, లక్ష్మణ్‌, చంద్రకిరణ్‌, రాజేశ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...