అకాల వర్షంతో రైతులకు ఇబ్బంది


Tue,December 3, 2019 01:31 AM


-కోతకు వచ్చిన పంటకు నష్టం
-తడిసిన వరి ధాన్యం, పత్తి

ఓదెల: అకాల వర్షంతో రైతులు ఇబ్బంది పడ్డారు. సోమవారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడడంతో పాటు మంచు కమ్మేసింది. మధ్యాహ్నం 12గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. వాతావరణం చల్లబడి ఉంటుందని భావించిన రైతులకు ఊహించని పరిణామం ఎదురైంది. వర్షం ప్రారంభమవడంతో కొనుగోలు కేంద్రాల్లో పోసుకున్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు అద్దెకు పరదాలు (పాలిథిన్ కవర్లు) తీసుకువచ్చి కప్పారు. వర్షం కారణంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి.

ఇప్పుడిప్పుడే వరి కోతలు ఊపందుకుంటుండగా అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం పడితే గింజలు నేల వాలడంతో పాటు పొలంలో నీరు నిలిచి కోతకు అనుకూలంగా ఉండదని రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం పత్తిని కూడా రైతులు కూలీలతో ఏరిస్తున్నారు. వర్షం కారణంగా పత్తి ఏరేందుకు ఆటంకం కల్గుతుందని వాపోయారు. మహిళా కూలీలు వర్షం పడడంతో మధ్యాహ్నం వేళ ఇంటిముఖం పట్టారు. వర్షం కారణంగా పరదాల కిరాయి కూడా తడిసి మోపడవనున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.


కలెక్టరేట్: వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల మూలంగా సోమవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసింది. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్, సబ్బితం, నిట్టూరు, బొంపల్లి, నిమ్మనపల్లి, రాఘవాపూర్, మారేడుగొండ, గుర్రాంపల్లి తదితర గ్రామాల్లో ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. అకాల వర్షం కురవడంతో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రంలో ఉన్న వరి ధాన్యం కుప్పలను జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్‌వూపసాద్ పరిశీలించి రైతులు, సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. వర్షంతో ధాన్యం తడిసిన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానిని ఆరబెట్టి చివరి సమయంలో కొనుగోలు చేస్తామని డీఏవో పేర్కొన్నారు.


ధాన్యాన్ని తీసుకురావద్దు..
వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడే ప్రమాదము ఉన్నట్లు వాతావరణ కేంద్రం ద్వారా అందుతున్న సూచనలు అందాయని డీఏఓ తెలిపారు. జిల్లాలోని రైతులంతా వరి కోతలు నిలిపివేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావద్దని సూచించారు. జిల్లాలో ఇంకా 40 శాతం మేరకు పొలాలు కోతలు జరగాల్సి ఉన్నా నేపథ్యంలో రైతులంతా అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకొని వరి ధాన్యాన్ని నూర్పిడి చేసుకోవాలని వివరించారు. అందుకు వ్యవసాయాధికారుల సూచనలు తీసుకోవాలనీ, ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి కుప్పలు పోసిన రైతులంతా వాటిని తడవకుండా టార్ఫాలిన్లు కప్పి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అలాగే పత్తి రైతులు 2,3 దశలు ఏరడం పూర్తయిన నేపథ్యంలో దానిని అమ్మకానికి మార్కెట్‌కు తీసుకురాకుండా జాగ్రత్త వహించాలని, ప్రభుత్వ మద్దతు ధర దక్కాలంటే తేమ శాతం అనుకూలంగా మారాకే తీసుకురావాలని, చేన్లపై

ఉన్న పత్తిని కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించాకనే ఏరాలని సూచించారు.
సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మార్కెట్‌ను డీఏఓ సోమ వారం సందరిశంచారు. ఈ సందర్భంగా వరి ధాన్యాన్ని పరిశీలించారు.ధాన్యాన్నికి టార్ఫలిన్ కవర్లు కప్పాలని సూచించారు. పత్తి విషయంలో కూడా ఇవే జాగ్రత్తలు పా టించాలన్నారు. ఆయన వెంట ఏఓ డేవిడ్‌రాజ్, ఏఏఓ ప్రశాంత్ తదితరులున్నారు.
కాల్వశ్రీరాంపూర్ : వాతావరణంలో మార్పుల కారణంగా మండలంలో అకాల వర్షానికి ఆయా గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యం కుప్పలు తడిసాయి.

చేతికందిన ధాన్యం తమ కళ్లముందే ఇలా తడిసి పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మండలంలో సెర్ప్, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు నిల్వ ఉన్నాయి. కోతకోయని వరి పొలాలు మొత్తం నేలవాలాయి.

సుల్తానాబాద్‌రూరల్: మండల వ్యాప్తంగా వర్షం కుర వడంతో గ్రామాల్లోని ధాన్యం తడిసింది. రైతులు ధాన్యంపై టార్ఫాలిన్ కవర్లు, పరదాలు కప్పినా నానింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఒక్కసారిగా కురిసిన వర్షానికి తడిసిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles