ధర్మారం: విద్యతోనే విజ్ఞాన అభివృద్ధి సాధ్యమనీ, విద్యార్థులు విద్యార్థి దశలోనే మూఢనమ్మకాలను వీడాలని భారత నాస్తిక సమాజం రాష్ట ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేశ్ అన్నారు. నందిమేడారం గురుకుల పాఠశాల, కళాశాలలో గురువారం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ప్రిన్సిపాల్ స్వరూప అధ్యక్షతన సమాజంలో మహిళల పాత్ర-మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశంపై చైతన్య సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు విద్యార్థి దశలోనే ప్రశ్నించేతత్వం పెంపొందించుకుని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దొంగస్వాములు, భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని అన్నారు. విద్యార్థులు ఏది నిజం ఏది అపోహో అనే వాస్తవిక విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్ మ్యూజిక్ షో నిర్వహించారు. పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.