రైతు సంక్షేమమే మా ధ్యేయం


Mon,November 4, 2019 02:12 AM

-అనేక పథకాలతో అండగా రాష్ట్ర ప్రభుత్వం
-పండించిన ప్రతి గింజనూ కొంటాం
-కాళేశ్వరంతో కరువుదీరా నీళ్లు
-రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
-కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు

కమాన్‌పూర్: వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదనీ, రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయమనీ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. మండలకేంద్రంలోని బాపూజీ నగర్‌లో ఆదివారం వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మార్కెట్ కమిటీల నిర్వాహణ, కొత్త మార్కెట్లు ఏర్పాటు చేయడంతోపాటు అన్నివర్గాల వారికి మార్కెట్ కమిటీల్లో అవకాశం కల్పించడం కోసమే రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గతంలో మార్కెట్ కమిటీలు పేరుకు మాత్రమే అలంకార ప్రాయంగా ఉండేవనీ, నేడు మార్కెట్ కమిటీలకు బాధ్యత పెరిగిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో గోదాముల సౌకర్యాలు 400మెట్రిక్ టన్నులు ఉండగా టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐదేండ్ల కాలంలోనే 2400 మెట్రిక్ టన్నుల సౌకర్యం కలిగిన గోదాములను నిర్మించామని గుర్తు చేశారు. తాగు, సాగునీరు, విద్యుత్‌తోపాటు తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ, నేడు వాటన్నంటి శాశ్వత పరిష్కారం దిశగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణ రాష్ట్రంలోని సగ భాగాన్ని సస్యశ్యామలం చేయవచ్చని చెప్పారు. గత పాలకుల హయాంలో ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణానికి 20ఏండ్ల కాలం పట్టేదనీ, రీడిజైనింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేవలం మూడేండ్లలోనే పూర్తి చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖ్యాతి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సాధించడం రాష్ర్టానికే గర్వకారణమన్నారు. రైతులు చాల సంతోంగా ఉండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఈసారి వరిసాగు పెరగడంతో ధాన్యం దిగుబడి పెద్దఎత్తున మార్కెట్లోకి రానుందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎఫ్‌సీఐ కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని విశ్లేషకులు అంటున్నారనీ, కానీ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాదని తేల్చిచెప్పారు. నెల రోజుల క్రితమే ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన చర్యలను ప్రారంభించామన్నారు. మార్కెట్ కమిటీలు ప్రభుత్వానికి, రైతులకు వారధిలా సేవలందించాలని అన్నారు.

అనంతరం జడ్పీ చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్‌లు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గాలు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. పార్టీలో ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో రాయితీలతో కూడిన సాంకేతిక యంత్రాలను అందిస్తున్నదనీ, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంతకుముందు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్‌పర్సన్ రేణుక, ఎంపీపీలు రాచకొండ లక్ష్మి, ఆరెల్లి దేవక్క, కొండ శంకర్, ముత్తయ్య, జడ్పీటీసీలు మేదరబోయిన శారద, చెలుకల స్వర్ణలత, నారాయణ, రాంమూర్తి, ఎంపీటీసీలు కోటేలి చంద్రశేఖర్, బోనాల వెంకటస్వామిలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...