ట్రాక్టర్.. ట్యాంకర్..


Mon,October 21, 2019 04:30 AM

- నెలాఖరులోగా కొనుగోలుకు సిద్ధం
- చెత్త సేకరణకు ట్రాలీలు సైతం..
- జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు
- చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా డీపీవో

కమాన్‌పూర్ : సంపూర్ణ పారిశుధ్యం, మొక్కల సంరక్షణతోపాటు ఇతర అవసరాల కోసం ఒక్కో గ్రామానికి ఒక ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్‌తోపాటు ట్రాలీలు కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెలు పచ్చగా ఉండాలనే ఉద్దేశ్యంతో తలపెట్టిన 30రోజుల ప్రణాళిక అంతటా విజయవంతం కాగా, ఆ పనులు నిరంతరం సాగాలనే కొనసాగాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు తాజాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రతి గ్రామంలో ఆ పంచాయతీల ఆర్థిక స్థోమత బట్టి కొనుగోలు చేయాలని భావిస్తుండగా, అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామాల్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ట్రాక్టర్లను అద్దెకు తీసుకుంటున్నారు. దీని వల్ల వేలకు వేలు బిల్లు అవుతోంది. అలా కాకుండా నేరుగా ట్రాక్టర్లు కొంటే నిత్యం ఉపయోగించుకోవడంతో పాటు, అద్దె ఆదా అవుతుందని భావించి నిర్ణయం తీసుకుంది. ఆయా గ్రామ పంచాయతీలో జనాభాను బట్టి ట్రాక్టర్ లేదా మినీ ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలను సైతం కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

నిబంధనల ప్రకారం..
ఆయా గ్రామ పంచాయతీల్లో ఎలాంటి ట్రాక్టర్లు కొనుగోలు చేయాలి? ఏ కంపెనీకి సంబంధించిన ట్రాక్టర్లు తీసుకోవాలి? అనే అంశంలో రాష్ట్ర అధికారులు పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చారు. మహీంద్ర, ఐషర్, స్వరాజ్, హెఎంటీ, కుబుట, ప్రీత్, ఫెర్గూసన్, జాన్‌డీర్, తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా కంపెనీ ట్రాక్టర్ కెపాసిటీని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో జనాభాను పరిగణనలోకి తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. 500లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి 15 హెచ్‌పీ, 501 నుంచి 3వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి 20, 21 హెచ్‌పీ, 3వేలకు పైగా జనాభా ఉన్న గ్రామానికి 35 హెచ్‌పీ నుంచి ఆ పై కెపాసిటీ ఉన్న ట్రాక్టర్ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

అభిప్రాయాల సేకరణలో..
ట్రాక్టర్ల కొనుగోలు విషయంలో ఆయా గ్రామ పంచాయతీల పాలక అభిప్రాయాలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 263 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో కొన్నింటికి ఇప్పటికే ట్రాక్టర్లు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీలకు మినహాయిస్తే అన్నింటికి ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఏ గ్రామ పంచాయతీకి ఎంత కెపాసిటీ ఉన్న ట్రాక్టర్ అవసరమో ఆ జీపీ అధికారులు గుర్తిస్తున్నారు. ఆయా పంచాయతీల్లో సర్పంచ్, పాలకవర్గం, గ్రామ కార్యదర్శులకు చెప్పడమే గాక ఎంత కెపాసిటీ అవసరం, ఏయే కంపెనీల ట్రాక్టర్లు కొనుగోలు చేయాల్సిన ఉన్నదానిపై కూడా వివరిస్తున్నారు. ట్రాక్టర్ నడిపేందుకు ప్రస్తుతం పంచాయతీలోని సిబ్బందిలో ఒక్కరికి శిక్షణ ఇప్పించాలనీ, సిబ్బంది లేని పంచాయతీలో ట్రాక్టర్ నడిపే వ్యక్తిని డ్రైవర్‌గా నియమించుకోవాలని సర్పంచులకు సూచించారు.

కొనుగోళ్లపై కొనసాగుతున్న కసరత్తు..
ట్రాక్టర్లు, ట్రాలీలు ఎలా కొనుగోలు చేయాలి..? వాటికి సంబంధించి అవసరమైన నిధులు పంచాయతీల్లో అందుబాటులో ఉన్నాయా..? లేదా..? లేకపోతే ఏ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటారు? తిరిగి ఏ పద్ధతిన బ్యాంకులకు చెల్లిస్తారు..? ఇలాంటి అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలను అన్ని ఆయా గ్రామ పంచాయతీల దగ్గర తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఇవన్నీ గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన తర్వాత అధికారులు కలెక్టర్‌కు నివేదిక అందిస్తారు. ట్రాక్టర్ కొనుగోలు కోసం అప్పు అవసరమైన గ్రామ పంచాయతీల విషయంలో కలెక్టర్‌తో బ్యాంకర్లతో మాట్లాడనున్నారు. జిల్లాస్థాయి కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేస్తారు. పది రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని అధికారులకు అదేశాలు అందాయి.

జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు
ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీల కొనుగోలుకు సంబంధించి జిల్లా స్థాయిలో క మిటీ వేశారు. కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్, డీఆర్‌డీవో, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం కార్యనిర్వహణాధికారి, జిల్లా పరిశ్రమల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వచ్చిన నేపథ్యంలో వీటి కొనుగోలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించామనీ, పది రోజుల్లో కసరత్తు పూర్తి చేసి కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...