గోదావరిఖని,నమస్తే తెలంగాణ: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నగరంలో జరుగుతున్న గోదావరి కళా సంఘాల సమాఖ్య రజతోత్సవ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కళాకారులకు పుట్టినిల్లుగా వర్ధిల్లుతున్న పారిశ్రామిక ప్రాంతంలో చిరకాల వాంఛగా మిగిలిఉన్న ఆడిటోరియం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారుల పాత్ర అమోఘమన్నారు. ఉమ్మడి ప్రభుత్వ పాలకులు కళాకారులను ఏనాడూ పట్టించుకోలేదనీ, తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారులకు సముచిత స్థానం కల్పించి గౌరవించారన్నారు. స్థానిక కళాకారులకు ఎలాంటి సమస్యలున్నా తాను అండగా ఉండి పరిష్కరిస్తాన్నారు. అనంతరం పలువురు కళాకారులను, వివిధ రంగాల్లో సేవలందించిన వారిని జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. చివరి రోజున రాంమందిర్లోని నృత్యఖని పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్య, సాంస్కృతిక, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో పారిశ్రామిక ప్రాంతంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల జానపద, పౌరాణిక తదితర కళా ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య అధ్యక్షత వహించగా, కళాకారులు సోగాల వెంకటి, మేజిక్ రాజా, చంద్రపాల్, సంకె రాజేశ్, సర్వేశ్తోపాటు అంతర్జాతీయ నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వల, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.