ఆర్టిజన్ల సర్వీసు క్రమబద్ధీకరణ


Sun,October 20, 2019 04:33 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: విద్యుత్ సంస్థలో ఆర్టిజన్లుగా నియామకమైన సబ్‌స్టేషన్, కంప్యూటర్ ఆపరేటర్ల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలు పలు సంఘాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. శనివారం హైదరాబాద్‌లో ఈ సంస్థల సీఎండీ ప్రభాకర్‌రావుతో తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం, 1104, 327 గుర్తింపు సంఘాలతో జరిగిన చర్చలు ఫలించాయి. ఈ మేరకు ఆర్టిజన్లుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 23 వేల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 900 మందికి పైగా లబ్ధి పొందుతారు. ఆర్టిజన్లను శాశ్వత ఉద్యోగులుగా సర్వీసుల నిబంధనలు వర్తింపజేయాలని విద్యుత్ సంఘాలు కోరుతూ వచ్చాయి. సీఎండీ ప్రభాకర్‌రావుతో ఈ సంఘాలు జరిపిన చర్చలు విజయవంతం కావడంతో ఇపుడు వీరి సర్వీసును క్రమబద్ధీకరిస్తున్నారు. వీరి 15 ప్రధానమైన డిమాండ్లను నెరవేర్చేందుకు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అంగీకరించారు. ఈ నెల 1 నుంచి అన్ని అలవెన్స్‌లు, పే స్కేల్‌తో సహా వర్తించనున్నాయి. ఆర్టిజన్ కార్మికులకు సర్వీసు బుక్కుతోపాటు పేస్లిప్పులు, పెయిడ్ హాలీడేస్ వర్తింపజేస్తారు. 2016 డిసెంబర్ 4 తర్వాత చనిపోయిన ఆర్టిజన్ కార్మికుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. అంతే కాకుండా దహన సంస్కారాల ఖర్చులు కూడా చెల్లిస్తారు. 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 వరకు నియామకమైన వారికి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ మార్చి పెన్షన్ స్కీం వర్తింపజేస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నదని తెలిపారు. కార్మికులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ ఒప్పందంతో ఆర్టిజన్ల సర్వీసు క్రమబద్ధీకరణ జరిగి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించబడతారని స్పష్టం చేశారు. అలాగే పలు విద్యుత్ సంఘాల నాయకులు కూడా ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...