గాడిన పడుతున్న ఆర్టీసీ


Thu,October 17, 2019 02:44 AM

-రీజియన్‌లో ఒక్కసారిగా పెరిగిన బస్సులు
-బుధవారం 95.75 శాతం రోడ్డెక్కినయ్
-కోరుట్ల, వేములవాడ డిపోల్లో వంద శాతం
-226 బస్సుల్లో టిమ్స్.. మరో 36 బస్సుల్లో టికెట్ల ద్వారా చార్జీలు
-పలు డిపోలను పరిశీలించిన ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్

కార్మికులు సమ్మెలో ఉన్నా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలతో ఆర్టీసీ గాడిలో పడుతున్నది. రోజూ ఒకట్రెండు బస్సుల చొప్పున పెరగ గా బుధవారం ఒక్కసారిగా 41 బస్సులు పెంచగలిగారు. నడిచిన బస్సుల్లో 2 26 టిమ్ మిషన్ల ద్వారా, మరో 36 బస్సుల్లో సాధారణ టికెట్ల ద్వారా చార్జీలు వసూలు చేశారు. మొత్తానికి ఈ రోజు 433 ఆర్టీసీ, 198 అద్దె బస్సులు రోడ్డెక్కాయి. మరో 48 సీసీ బస్సులు వీటికి తోడయ్యాయి. కోరుట్ల, వేములవాడ డిపోల్లో వంద శాతం బస్సులు నడిచాయి. సిరిసిల్ల, మెట్‌పల్లి, జగిత్యాల డిపోలను సందర్శించిన ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్.. వంద శాతం బస్సులు నడపాలనీ, టిమ్ మిషన్ల ద్వారా చార్జీలు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఫలిస్తున్న ప్రత్యామ్నాయం..
ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. సమ్మె మొదలైన రోజు నుంచి అనుకున్న రీతిలో బస్సులు నడిపించారు. రెవెన్యూపరంగా ఆర్టీసీ నష్టపోయినా ప్రయాణికులు ఇబ్బంది పడవద్దనే లక్ష్యంతో పెద్ద సంఖ్యలో బస్సులు నడిపారు. దీనికి తోడు కాంట్రాక్టు క్యారియర్ బస్సులు కూడా నడుస్తున్నాయి. పండగ సమయంలో ప్రయాణికుల రద్దీ కారణంగా కొద్ది రోజులు పాఠశాల బస్సులు కూడా నడిపారు. దీంతో ప్రయాణికులు ఎక్కడ కూడా ఇబ్బందులు పడలేదు. అయితే తాత్కాలికంగా నియమించుకున్న కొందరు కండక్టర్లు మాత్రం ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టారు. వచ్చిన రెవెన్యూలో సంస్థకు కూడా అప్పగించని పరిస్థితి నెలకొన్నది.

ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇతర శాఖల సిబ్బందిని ఆర్టీసీకి కేటాయించింది. ప్రతి డిపోకు ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లను ఇచ్చింది. వ్యవస్థను మరింతగా గాడిలో పెట్టే లక్ష్యంతో ప్రతి డిపోకు ఒకరిని ఇతర శాఖల నుంచి నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. ఈ చర్యలు ఆర్టీసీ అధికారులకు అదనపు బలంగా మారడంతో వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతున్నది. ఒక పక్క ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండగానే ఇటు ప్రత్యామ్నాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు..

95 శాతం రోడ్డెక్కిన బస్సులు..
ఆర్టీసీ కార్మికుల సమ్మె 12 రోజులకు చేరింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకంతో అధికారులు బస్సులు నడుపుతున్నారు. ప్రతి డిపోకు ఒక నోడల్ అధికారిని, కంప్యూటర్ ఆపరేటర్లను, రూట్ ఆఫీసర్లను ఇతర శాఖల నుంచి నియమించుకోవడంతో బుధవారం ఒక్కసారిగా బస్సుల సంఖ్య పెరిగింది. పర్యవేక్షణ కోసం అధికారులు లేకపోవడంతో రోజుకు ఒకట్రెండు బస్సులు మాత్రమే పెంచుకుంటూ వచ్చారు. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం 41 బస్సులు పెరిగాయి. ఇందులో ఆర్టీసీ బస్సులే 45 ఉన్నాయి. మంగళవారం అద్దె బస్సులు 202 నడవగా, బుధవారం 198 మాత్రమే నడిచాయి. వీటి స్థానంలో 4 ఆర్టీసీ బస్సులు అదనంగా నడిచాయి. కోరుట్ల, వేములవాడ డిపోల్లో 100 శాతం బస్సులు నడిపారు. కరీంనగర్-1 డిపోలో 95.31, కరీంనగర్ -2 డిపోలో 98.73, హుజూరాబాద్‌లో 83.33, గోదావరిఖని డిపోలో 93.33, మంథని డిపోలో 86.44, జగిత్యాల డిపోలో 98.11, మెట్‌పల్లి డిపోలో 97.83, సిరిసిల్ల డిపోలో 94.92 శాతం బస్సులు నడిచాయి. రీజియన్ మొత్తంలో 95.75 శాతం బస్సులు నడపడంలో ఆర్టీసీ అధికారులు సఫలమయ్యారు.

బస్సుల్లో ప్రవేశ పెట్టిన టిమ్ మిషన్ల సంఖ్య కూడా ఒక్క సారిగా పెరిగింది. మంగళవారం 47 బస్సుల్లో మాత్రమే టిమ్ మిషన్లను వినియోగించగా, బుధవారం వీటి సంఖ్య 226కు చేరింది. అలాగే, నిన్న 9 బస్సులకే పరిమితమైన టికెట్లు బుధవారం 36 బస్సుల్లో ప్రవేశ పెట్టారు. ఇలా ఆర్టీసీ వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతున్నది. కాగా, ఆర్టీసీ ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్ రీజియన్ పరిధిలోని సిరిసిల్ల, మెట్‌పల్లి, జగిత్యాల డిపోలను సందర్శించి, పూర్తిస్థాయిలో బస్సులు నడపాలనీ, అన్నింటిలో టిమ్ మిషన్ల ద్వారా చార్జీలు వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles