సజావుగా రాకపోకలు


Sun,October 13, 2019 12:47 AM

- నేటి నుంచి పెరగనున్న మరిన్ని బస్సులు
- పెద్ద సంఖ్యలో తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు
- ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ప్రాధాన్యత
- నేడు ఆయా డిపోలకు వెళ్లాలని ఆర్‌ఎం విజ్ఞప్తి

కరీంనగర్‌ ప్రతినిధి,/పెద్దపల్లి ప్రతినిధి నమస్తే తెలంగాణ/ఫెర్టిలైజర్‌సిటీ: ఆర్టీసీలో కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఇది వరకు పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగులు, కార్మికుల సేవలను వినియోగించుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రోజు వారీగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుంటున్న అధికారులు ఆదివారం నుంచి విశ్రాంత ఉద్యోగులైన వోల్వో బస్సు డ్రైవర్లు, నిర్వాహకులకు రోజు వారీగా భారీ వేతనం అందించి సేవలు వినియోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వోల్వో బస్సు డ్రైవర్లకు, నిర్వాహకులకు రోజుకు 2 వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. అలాగే ఐటీఐ సాఫ్ట్‌వేర్‌లో అనుభవమున్న వారికి 1,500, ఇతర విభాగాల్లో అనుభవమున్న వారికి 1000 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. డ్రైవర్లు, విశ్రాంత డ్రైవర్లకు 1,500, కండక్టర్లు, విశ్రాంత కండక్టర్లకు 1000, వివిధ విభాగాల్లో పనిచేసి విశ్రాంతి పొందుతున్న ఆఫీసర్లకు 1,500, విశ్రాంత మెకానిక్‌లు, సూపర్‌వైజర్లకు 1,500, మెకానిక్‌, శ్రామిక్‌, క్లరికల్‌ స్టాఫ్‌తో పాటు ఇతర విభాగాల్లో పనిచేసే వారికి 1,000 చెల్లించి రోజు వారీగా సేవలు వినియోగించుకోనున్నామని ఆర్టీసీ ఆర్‌ఎం పీ జీవన్‌ ప్రసాద్‌ తెలిపారు. ఆసక్తి ఉన్నవారి ఆదివారం ఉదయం అందుబాటులో ఉన్న డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

ఆర్టీఏ అధికారుల తనిఖీలు..
సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసు కుంటున్నది. ఓ వైపు బస్సుల సంఖ్యను పెంచుతూ ప్రయాణాన్ని సులభతరం చేస్తూనే, ఆదనపు వసూ లు చేస్తున్నారనే ఆరోపణలపై సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలో శనివారం జిల్లా వ్యాప్తంగా ఆర్టీఏ అధి కారులు విస్తృత తనిఖీలు చేశారు. పెద్దపల్లి-గోదావరిఖని, పెద్దపల్లి-మంథని, గోదావరిఖని-కరీం నగర్‌, మంథని-కరీంనగర్‌ రూట్లల్లో నడుస్తున్న ఆర్టీసీ, హైర్‌ బస్సులను నిలిపి టికెట్‌ చార్జీల పట్టికలో అధికంగా చార్జీలు వసూలు చేశారా..? అనే విషయమై ఆరా తీశారు. ఇందుకు గాను పెద్దపల్లి ఆర్టీఓ ఆఫ్రిన్‌ సిద్ధిఖీ, ఎంవీఐలు మధూ, రంగారావు, డీటీసీలు జిల్లా వ్యాప్తంగా కలియదిరిగారు.

యథావిధిగా నడిచిన బస్సులు..
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు. శనివారం 670 బస్సులు నడపాల్సి ఉండగా 366 ఆర్టీసీ, 202 అద్దె బస్సులను నడిపించారు. మరో 19 స్కూల్‌, 62 సీసీ బస్సులు, మరో 230 వరకు మ్యాక్సీ క్యాబ్‌లు నడిపించారు. ఆర్టీఏ కమిషనర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నుంచే కొన్ని బస్సుల్లో టికెట్లు ప్రవేశ పెట్టారు. అద్దె బస్సుల తప్పనిసరిగా డిపోల్లో రిపోర్టు చేసి వెళ్లాలని ఆదేశాలిచ్చారు. రీజియన్‌ పరిధిలో 15 బస్సుల్లో టికెట్లు ప్రవేశ పెట్టారు. ఆదివారం మరిన్ని బస్సుల్లో టికెట్లు ప్రవేశ పెడుతున్నట్లు ఆర్‌ఎం తెలిపారు. కరీంనగర్‌, గోదావరిఖని, మంథనితోపాటు పలు చోట్ల ఉన్న బస్టాండ్లలో జనం కిటకిటలాడారు. ప్రతి చోట ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు నడిపించారు. ఈ రోజు 85 శాతానికిపైగా బస్సులు నడిపించారు. నేటి నుంచి మరిన్ని బస్సుల సంఖ్యను పెంచి, నడిపించనున్నారు.

14వేల మంది తరలింపు..
గోదావరిఖని, మంథని ఆర్టీసీ డిపోల పరిధిలో శనివారం 89 ఆర్టీసీ, 43 హైర్‌ బస్సులు నడిపి దాదాపు 14వేల మందిని గమ్య స్థానాలకు చేర్చారు. గోదావరిఖని డిపో నుంచి 52ఆర్టీసీ, 31అద్దె బస్సుల ద్వారా 9వేల మంది, మంథని డిపో నుంచి 37 ఆర్టీసీ, 12 అద్దె బస్సుల్లో 5వేల మందిని గమ్య స్థానాలకు చేర్చారు.

డిపోల చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులు..
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రైవేటుగా ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు డ్రైవర్లను, కండక్టర్లను తీసుకుంటుండడంతో నిరుద్యోగులు డిపోల చుట్టే తిరుగుతున్నారు. ప్రతి రోజూ ఉదయం 5గంటల నుంచే డ్యూటీల కోసం డిపోల గేట్ల వద్ద క్యూ కడుతున్నారు. ఇప్పటికే సమర్పించిన సర్టిఫికేట్లకు తోడుగా డ్యూటీలు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో మంథని, గోదావరిఖని డిపోల వద్ద డ్యూటీల కోసం వచ్చే వారితో గేట్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తున్నది.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...