ప్రయాణం సాఫీగా సాగాలి


Sun,October 13, 2019 12:46 AM

కలెక్టరేట్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో, ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలనీ, ప్రతి ఒక్కరి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీదేవసేన ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె, రవాణా సౌకర్యాల కల్పన తదితర అంశాలపై కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవసేన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులంతా సమ్మె చేస్తున్నందున, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ నిర్దేశకాల ప్రకారం విద్యార్థులు, జర్నలిస్టులకు ఉన్న బస్సు పాసులను వివిధ రకాల బస్సుల్లో అనుమతించాలని ఆదేశించారు. ఆ దిశగా డిపో మేనేజర్లంతా తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. రోడ్డు రవాణా సంస్థ నిబంధనల మేరకు మాత్రమే చార్జీలు వసూలు చేయాలని, చార్జీల వివరాలతో కూడిన చార్ట్‌ను బస్సులో అంటించాలని సూచించారు. బస్సు పాసులను అనుమతిస్తున్నట్లు ప్రతి బూత్‌లో నోటీసు అందించాలని చెప్పారు. ఆదివారం నుంచి కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వారు ప్రయాణికులకు తప్పనిసరిగా మాన్యువల్‌ టికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా సంబంధిత అధికారులంతా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

బస్సు డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేయాలనీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థలు బస్సుల ఫిట్‌నెస్‌ను పరీక్షించాకే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి బస్టాండ్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, బస్సు చార్జీలు, సర్వీసులు, బస్సు పాసులను అనుమతిస్తున్న వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపర్చాలని చెప్పారు. రవాణాశాఖ నుంచి మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేసి, అధిక చార్జీలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని బస్సు డిపోల వద్ద 144 సెక్షన్‌ కొనసాగించాలనీ, బస్సులు నడుపుతున్న డ్రైవర్లు, ఉద్యోగులపై ఎలాంటి దాడులు జరుగకుండా చూడాలని ఆదేశించారు. రాత్రిపూట నడిచే సర్వీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం కేటాయించిన 08728-297555 ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌కు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలనీ, సామూహిక మరుగుదొడ్లను వినియోగించుకునేలా నీటి సరఫరా అందించాలని ఆదేశించారు. అందుకోసం ఒక్కో మరుగుదొడ్డికి ప్రభుత్వం రూ.1.75 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. సామూహిక మరుగుదొడ్ల సమీపంలో మొక్కలు నాటి, సంరక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జోన్‌ డీసీపీ సుదర్శన్‌గౌడ్‌, ఇన్‌చార్జి డీఆర్వో కే నర్సింహమూర్తి, జిల్లా రవాణా శాఖాధికారి అఫ్రిన్‌ సిద్ధిఖీ, ఎంవీఐ ఆలె శ్రీనివాస్‌తోపాటు డిపో మేనేజర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...