మత్స్య సంపద వృద్ధే ప్రభుత్వ లక్ష్యం


Sat,September 21, 2019 01:11 AM

కలెక్టరేట్ : రాష్ట్రంలో మత్స్యసంపదను వృద్ధి చేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు (మినీ ట్యాంకు బండ్)లో మత్స్యశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే దాసరి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో కనుమరుగైన కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొస్తూ సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో తక్కువ ఆదాయంలో ఉండే మత్స్య సం పదను ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. చెరువులు, ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున చేప పిల్లలను వదిలి, మత్స్యసంపదను పెంపొందించేలా ప్రత్యేక పథకాన్ని రూపొందించారని పేర్కొన్నారు. పెద్దపల్లి మండలంలోని 116 చెరువుల్లో 9.41 లక్షల చేప పిల్లలను పోసి, పెంపకం చేసేలా సొసైటీలకు బాధ్యతలను అప్పగించామన్నారు. ఎల్లమ్మ-గుండమ్మ చెరువులో రూ.1,20,500 విలువ చేసే 86,640 చేప పిల్లలను వదిలామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా సీఎం కేసీఆర్ చెరువులను బాగు చేయించి, రైతులతోపాటు మత్స్యకారులకూ ఉపాధి కల్పిస్తున్నారని చెప్పా రు. రాబోయే రోజుల్లో ప్రతి చెరువు 12 నెలల పాటు నీళ్లతో కళకళలాడనున్నాయని పేర్కొన్నారు.

ఎస్సారెస్పీతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లాతోపాటు నియోజకవర్గంలోని గొలుసు కట్టు చెరువులన్నింటినీ నింపేందుకు తూములను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మూడు నెలల తర్వాత చెరువుల్లోకి నీరు వచ్చేలా పనులు జరుగుతున్నాయన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం 81 సంఘాలకు 1032 మోపెడ్ వాహనాలు, 58 ఆటోలు, 21 మొబైల్ ఫిష్ అవుట్‌లెట్లను సబ్సిడీ కింద అందించామని గుర్తు చేశారు. వ్యాపారవృద్ధి కోసం పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో కోల్డ్ స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, నాయకులు ఉప్పు రాజు, బండారి శ్రీనివాస్‌గౌడ్, ఉప్పు రాజ్‌కుమార్, గజవెల్లి పురుషోత్తం, పుట్ట మొండయ్య, వేల్పుల లక్ష్మీనారాయణ, కొలిపాక రాయమల్లు, కొలిపాక శ్రీను, మౌటం నర్సింగం, కొలిపాక నర్సయ్య, భూతగడ్డ సంపత్, గండు రంగయ్య, మౌటం శంకర్, వంశీ, కుంభం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...