అకుంఠిత దీక్షతో అభివృద్ధి


Sun,August 25, 2019 02:16 AM

-70ఏళ్లలో లేని పనులు ఐదేళ్లలో చేశాం
-మిషన్ కాకతీయతో రాష్ట్రంలో 46వేల చెరువులను పునరుద్ధరించాం
-సకల సౌకర్యాలతో గురుకులాల్లో విద్యనందిస్తున్నాం
-టెంపుల్ సిటీని అద్భుతంగా తీర్చి దిద్దుతాం
-హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
-సర్కారుతో ప్రజలంతా కలిసిరావాలి
-మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత
-రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
-రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-గొల్లపల్లి మండలం చందోలిలో హరితహారం


ధర్మపురి, నమస్తేతెలంగాణ/రాయికల్/గొల్లపల్లి: స్వరాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్ష మేరకు నిర్విరామంగా అకుంఠిత దీక్షతో అభివృద్ధి చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, గొల్లపల్లి మండలం చందోలిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేసి చూపించి సుస్థిర పాలన అందిస్తున్నామన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటు, నిరంతర విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ఎన్నో పనుల్ని సుసాధ్యం చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 70 ఏళ్లుగా గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం ఐదేళ్లలోనే చేసి చూపించి తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా చేశామన్నారు.

ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై దృష్టి
ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన్ల మంత్రి ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి పట్టణంలో నక్కలపేట రోడ్డు వైపుగల ఇందిరమ్మకాలనీ, కమలాపూర్‌రోడ్ ఇందిరమ్మకాలనీ, ముదిరాజ్‌కాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్సీబీసీ కాలనీ, కాశెట్టి వాడ, హనుమాన్‌వాడ, మేరుసంఘం వాడ, కూనపులివాడల్లోని పలు వీదుల్లో రూ.11కోట్లా10లక్షల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో సీసీ రోడ్లు, మురుగుకాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ధర్మపురి పట్టణంలో భవిష్యత్తులో సీసీ రోడ్డు, మురుగుకాలువ లేని వీది ఉండబోదన్నారు. మేజర్ పంచాయతీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించి రూ.25కోట్లు మంజూరు చేయించానన్నారు. పనులన్నీ పూర్తయితే ధర్మపురి క్షేత్రం మోడల్ సిటీగా తయారవుతుందన్నారు. దేవస్థానం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ బడ్జెట్‌లో రూ.50కోట్లు ఇదివరకే కేటాయించారనీ, ఈనెల 6న స్వామివారిని దర్శించుకున్న సందర్భంలో మరో రూ.50కోట్లు ప్రకటించారని గుర్తుచేశారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా రూ.3కోట్ల 80లక్షలతో ప్రత్యేక మురుగుకాలువను స్నానఘట్టాల ఆవలి వరకూ నిర్మిస్తున్నామని చెప్పారు.

రూ.6 కోట్లతో గోదావరి ఒడ్డున నీటిశుద్ధి కేంద్రం నిర్మించనున్నామన్నారు. రూ.కోటి పురపాలక నిధులతో వైకుంఠధామం నిర్మిస్తామని తెలిపారు. పట్టణంలో రూ.66లక్షలతో తమ్మళ్లకుంటను సుందరీకరిస్తున్నామన్నారు. రూ.కోటీ 35లక్షలతో చింతామణి చెరువును ఇదివరకే సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లయిన సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహం, స్వామీ వివేకానందచౌక్, అంబేడ్కర్‌చౌక్, పుష్కర పైలాన్, గాందీ విగ్రహం, నంది విగ్రహం కూడళ్ల వద్ద రూ. 6కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాన ఆలయాన్ని, ఉగ్రనారసింహస్వామి ఆలయాన్ని రాతి కట్టడంతో పునర్మించి విస్తరణ పనులు చేపట్టనున్నామన్నారు. క్షేత్రంలోని యమధర్మరాజు ఆలయాన్ని కూడా పునర్నిర్మించనున్నట్లు తెలిపారు. సత్యవతి ఆలయం, ఇసుకస్తంభాన్ని ఆధునీకరిస్తామన్నారు.

పుట్టబంగారం సేకరణ స్థలాన్ని కూడా అభివృద్ధి చేస్తామనీ, బస్టాండ్ వద్ద మరో 60 గదులు, టీటీడీ ధర్మశాల వద్ద మరో 100 గదులు నిర్మిస్తామని తెలిపారు. విజయదశమి వేడుకలు జరుపుకునే శమీవృక్షం వద్ద గద్దె నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానిక నేతలను ఆదేశించారు. పాలరాతితో గద్దె నిర్మాణం చేపట్టి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా షెడ్డు కూడా నిర్మించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, దేవస్థానం మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి, నాయకులు అయ్యోరి రాజేశ్‌కుమార్, సౌళ్ల భీమయ్య, సంగి శేఖర్, మురికి శ్రీనివాస్, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావు, ఇనుగంటి వినోద్‌రావ్, సౌళ్ల నరేశ్, మ్యాన శంకర్, ఇందారపు రామన్న, అక్కనపల్లి సునీల్, లక్కాకుల భగవంతరావు, స్తంభంకాడి రమేశ్, అనంతుల లక్ష్మణ్, లింగన్న, చిలివేరి శ్యాంసుందర్, భీమరాజ్, జెట్టి రాజన్న, భారతపు గుండయ్య, స్తంభంకాడి మహేశ్, అలీమ్, ఇక్రామ్ పాల్గొన్నారు.


రాయికల్‌లో సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
రాయికల్ రూరల్ : రాయికల్ మున్సిపాలిటీలో రూ. 3కోట్లతో సీసీరోడ్ల నిర్మాణానికి జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి మంత్రి ఈశ్వర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షల మేరకు నిర్విరామంగా అకుంఠిత దీక్షతో అభివృద్ధి చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేసి చూపించి సుస్థిర పాలన అందిస్తున్నామన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటు, నిరంతర విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ఎన్నో పనుల్ని సుసాధ్యం చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 70 ఏళ్లుగా గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం ఐదేళ్లలోనే చేసి చూపించి తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా చేశామన్నారు.పారిపాలన వికేంద్రీకరణకు చిన్న జిల్లాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి గ్రామాలకు నేరుగా నిధులిచ్చేందుకు ప్రభుత్వం కొత్త చట్టాలు చేసిందన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 46వేల చెరువుల మరమ్మతులు చేపట్టామన్నారు. ఏదిమంచో ఏది చెడో గమనించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకులను, ప్రభుత్వాలను కాపాడుకునే బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు అందడం ప్రారంభమైందనీ, ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞాణాన్ని చూసి ప్రపంచమే నివ్వేర పోతున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్య సంధ్య సురేందర్ నాయక్, వైస్ ఎంపీపీ మహేశ్వరావు, సర్పంచులు అనుపురం శ్రీనివాస్, పాలకుర్తి రవి, ఎంపీటీసీలు సురేందర్‌రెడ్డి, దొంతి నాగరాజు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పడాల తిరుపతి, యువజన అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, ఇంతియాజ్, మోర రామ్మూర్తి, గండ్ర రమాదేవి, ఎనగందుల ఉదయ శ్రీ, మోర హన్మాండ్లు, మ్యాకల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

హరిత తెలంగాణే లక్ష్యం
గొల్లపల్లి : తరిగిపోతున్న అడవులను పునరుద్ధరించేందుకే ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందనీ, హరిత తెలంగాణే లక్ష్యంగా పని చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గొల్లపల్లి మండలం చందోలిలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటే బాధ్యత అధికారులు, ఉపాధి హామీ కూలీలదే కాదనీ, వాటిని సంరక్షించే బాధ్యత మనమంతా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతమవుతుందన్నారు. మనకు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు తరిగిపోవడం వల్లే వాతావరణం కలుషితమవుతున్నదనీ, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనీ, అడవుల్లో ఉండాల్సిన కోతులు గ్రామాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని చెప్పారు.

ప్రతి ఊరికీ 80వేల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకున్నామనీ, గ్రామంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువు గట్టు, రోడ్ల వెంట నీడను, పండ్లనిచ్చే మొక్కలను నాటిస్తున్నామని పేర్కొన్నారు. మొక్కలను సంరక్షించేందుకు దాతలు, ప్రజాప్రతినిధుల నుంచి విరాళాల రూపంలో ట్రీగార్డులు సేకరించాలన్నారు. అనంతరం చందోలిలో 2వేల మొక్కలను నాటి, వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీ సభ్యుడు గోస్కుల జలందర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్తయ్య, సర్పంచ్ రవీందర్, ఎంపీటీసీ అశోక్, తహసీల్దార్ లకా్ష్మరెడ్డి, ఎంపీడీవో నవీన్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి, విండో అధ్యక్షుడు నారాయణ రెడ్డి, యూత్ అధ్యక్షుడు గంగాధర్, లింగారెడ్డి, కిషన్, నల్లగొండం, రమేష్, హన్మాండ్లు, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...