వాటా వస్తోంది..


Fri,August 23, 2019 01:26 AM

-మరో నెలరోజుల్లోనే సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా
- ప్రకటించిన గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌..
-2018-19 సంవత్సరంలో సంస్థకు రికార్డులో స్థాయిలో 1,766కోట్ల ప్రాఫిట్‌
-గతేడాది 27శాతం కన్నా మెరుగ్గా ఉండే అవకాశం..?
-సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు టీబీజీకేఎస్‌, కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల కృషి

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : గతంలోకంటే భారీగా లాభాలను అర్జించిన సింగరేణి ఈసారి కార్మికులకు వాటాను అదే స్థాయిలో చెల్లించనుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రికార్డు స్థాయిలో రూ. 1766 కోట్ల లాభాలను గడించింది. అంతక్రితం సంవత్సరం సింగరేణి సాధించిన రూ. 1212 కోట్ల లాభాలను అధిగమించి దాదాపు మరో 500 కోట్ల పైచిలుకు లాభాలు వచ్చాయి. దీంతో ఈసారి కార్మికులకు లాభాల వాటా భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం ఆదేశాలతో ఎప్పుడైనా వాటాను చెల్లించేందుకు సంస్థ సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్‌కు యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీబీజీకేఎస్‌ ముఖ్య కోల్‌బెల్ట్‌ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, ఎంపీలు సీఎంను క లిసి లాభాల వాటాను ప్రకటించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ హాయంలోనే..
సింగరేణిలో 1999-2000 సంవత్సరం నుంచి లాభాల వాటాను చెల్లిస్తూ వస్తున్నారు. మొదట కార్మికులకు 10 శాతం వాటాతో ప్రారంభమై 2012-13 ఆర్థిక సంవత్సరం వరకు లాభాల వాటాను 18శాతంకు పెరిగింది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి లాభాల వాటాను 20 శాతానికి పెంచారు. ఆ తర్వాత 2014-15లో 21 శాతానికి, 2015-16లో 23శాతానికి, 2016-17లో 25 శాతానికి, 2017-18లో 27 శాతానికి పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మికుల పక్షాన ఉండి భారీగా వాటాను పెంచడం విశేషం. అయితే, గడిచిన సంవత్సరంలో సాధించిన రూ.1766 కోట్ల లాభాలపై 27శాతం వాటాగా రూ.476.82 కోట్లుగా వస్తోంది. అంటే అంతక్రితం ఏడాది కార్మికులకు చెల్లించిన రూ.327.27కోట్ల కంటే అదనంగా దాదాపు రూ.150కోట్లు వస్తాయి. లాభాల వాటా శాతం పెరిగితే కార్మికులకు వాటాగా రూ. 500కోట్లకు పైగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే, సింగరేణి పనిచేస్తున్న 52 వేల పైచిలకు కార్మికులకు దాదాపుగా ఒక్కొక్కరికి దాదాపు రూ. లక్ష వరకు లాభాల వాటా వస్తుందని అంచనా వేస్తున్నారు.

నెలలో ఇప్పించేలా..
యాజమాన్యం లాభాలు రూ. 1766 కోట్లుగా ప్రకటించగా, అందులో వాటాను కార్మికులకు మరో నెలరోజుల్లోనే ఇప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఇటీవల టీబీజీకేఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావ్‌, రాజిరెడ్డి పేర్కొన్నారు. వాటా అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వాటాను త్వరితగతిన ప్రకటించేలా చూస్తామనీ, అంతక్రితం ఏడాది కన్న వాటాను పెంచేలా కృషి చేస్తామని వారన్నారు. కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలను, ఎంపీలను తీసుకోని సీఎం కేసీఆర్‌ వద్దకు వెళ్లి ప్రయత్నాలు చేస్తామన్నారు. టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తామని వారు స్పష్టం చేశారు.

జాతీయ సంఘాల తప్పుడు ప్రచారం..
సింగరేణిలో లాభాల వాటాను చెల్లించడంలో జాప్యం జరుగుతున్నదని జాతీయ కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. సింగరేణిలో ఆడిటింగ్‌ ఇతర వ్యవహరాలు పూర్తయిన తర్వాత లాభాలను ప్రకటిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మూడు నెలల అనంతరమే లాభాల ప్రకటన చేస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రకటన ఇంకా ఆలస్యమవుతోంది. ఆ తర్వాత వాటా చెల్లించేందుకు సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆగస్టులో మినహా ఎప్పుడు ఆగస్టు నెలకు ముందుగా లాభాల వాటాను చెల్లించిన సందర్భాలు లేవు. ఇదే విషయాన్ని టీబీజీకేఎస్‌ నాయకులు కార్మికులకు తెలియజేస్తున్నారు. లాభాల ప్రకటన ఇటీవలే వెలువడిన క్రమంలో వాటాను చెల్లించే విధంగా కృషి చేస్తున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. కార్మికులకు ఇప్పటికే అనేక హక్కులు కల్పించిన సీఎం కేసీఆర్‌ కార్మికులకు ఈసారి మెరుగైన లాభాల వాటా ఇస్తారనీ, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని గుర్తింపు సంఘం నాయకులు పేర్కొంటున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...