కుల వృత్తులకు పెద్దపీట


Wed,August 21, 2019 03:17 AM

-కాళేశ్వరంతో మత్స్యకార జీవితాల్లో వెలుగులు
-చేపల పెంపకమేకాదు.. మార్కెటింగ్‌కూ ప్రణాళికలు
-జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
-పార్వతి బరాజ్‌లో చేప, రొయ్య పిల్లల విడుదల
మంథని, నమస్తే తెలంగాణ/మంథని రూరల్: రాష్ట్రంలో చేప పిల్లల పెంపకంతోపాటుగా వాటిని మార్కెటింగ్ చేసి మత్స్యకారులు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మంథని మండలం సిరిపురంలో నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బరాజ్‌లో ఆయన తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన చేప, రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో ఆదరణ లేక వట్టిపోయిన మత్స్యకారుల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకొని నీటి నిల్వను చేసుకున్న తరుణంలో పెద్దఎత్తున ఆ నీటిలో మత్స్య సంపదను పెంచాలనే సంకల్పంతో కోట్లాది చేప పిల్లలను ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం నుంచి ఉచితంగా వదలడం జరుగుతున్నదన్నారు. చేప పిల్లలను, రొయ్యలను పెంచడం వల్ల గోదావరి ప్రాంతం వెంట ఉన్న మంథని నియోజకవర్గ మత్స్యకారులు అభివృద్ధి సాధిస్తారని చెప్పారు. గోదావరిలో వేసే చేప పిల్లలతో మత్స్యసంపద సృష్టించేలా జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మత్స్యకారులకు వినూత్న పద్ధతిలో చేపలను పట్టేలా ప్రోత్సహించాలన్నారు. ఇందుకు అవసరమైన అన్ని మెళకువలను నేర్పించాలని, అవగాహన కోసం వివిధ ప్రాంతాలకు మత్స్యకారుల టూర్ ప్రోగ్రాంలను ఏర్పాటు చేయాలని సూచించారు.

గత ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13నియోజకవర్గాల మత్స్యకారుల అభివృద్ధికి కేవలం రూ.10లక్షలు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒక్క పెద్దపల్లి జిల్లాకే 100కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులకు జీవం పోస్తున్న తరుణంలో ప్రతిపక్ష నాయకులు కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకే విధంగా వ్యవహరించడం హాస్యాస్పదం అని అన్నారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి నేటి వరకూ విమర్శలు కురిపిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయం చేయడం తన జీవితంలోనే లేదని, ప్రాజెక్టు మొదటి నుంచి ఇక్కడి రైతులతో మాట్లాడి భూములు ఇచ్చే విధంగా ప్రోత్సహించామని గుర్తుచేశారు. మత్స్యకారులు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా తమ స్వగ్రామాలకు వచ్చి మత్స్య సంపదను సృష్టించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలన్నారు. మండలంలోని బెస్తపల్లి, సిరిపురం సుందిళ్ల, జల్లారం, ముస్త్యాల గ్రామాల్లోని మత్స్యకారులు ఉపాధి కోసం హైదరాబాద్, ముంబాయి లాంటి ప్రదేశాల్లో నివసిస్తున్నారని, వారంతా తిరిగి రావాలని కోరారు.

రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా ఉచితంగా చేప పిల్లల పంపిణీతో పాటుగా వివిధ రకాల సబ్సిడీ పథకాలను అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని మత్స్యకారులు అభివృద్ధిని సాధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి మల్లేశం, ప్రత్యేక అధికారి హన్మంతు, మంథని, ముత్తారం ఎంపీపీలు కొండా శంకర్, జక్కుల ముత్తయ్య, మంథని జడ్పీటీసీ తగరం సుమలత, మంథని, ముత్తారం పీఏసీఎస్ చైర్మన్లు ఎక్కేటి అనంతరెడ్డి, గుజ్జుల రాజిరెడ్డి, ఎంపీటీసీ గుమ్మడి సత్యవతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఆకుల కిరణ్, కొత్త శ్రీనివాస్, ముత్తారం మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు పోతిపెద్ద కిషన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు ఏగోళపు శంకర్‌గౌడ్, సర్పంచ్‌లు తోకల శైలజ, నాయకులు వేల్పుల గట్టయ్య, తోకల నర్సయ్య, ఆవునూరి లింగయ్య, దాసరి రాజలింగు, పిక్కల రాజయ్య, బండారి సమ్మయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...