ప్రచారం.. ఆచరణ..


Tue,July 23, 2019 01:09 AM

- జిల్లాలో జలశక్తి అభియాన్‌పై కార్యాచరణ
- విస్తృత ప్రచారానికి ప్రణాళికలు
- విద్యార్థుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు భాగస్వామ్యం
- పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు
- ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):నీటి సంరక్షణ, నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమ అమలుకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కార్యాచరణ రూపొందించారు. నీటి సంరక్షణ - వర్షపు నీటిని నిలువ చేయడం, చెరువులు - కుంటలను పునరుద్దరించడం, వాడిన నీటిని తిరిగి వాడుకోవడం - రీచార్జి కేంద్రాలను ఏర్పాటు చేయడం, వాటర్‌షెడ్ అభివృద్ధి, విరివిగా మొక్కలు నాటడం వంటి ఐదు అంశాల్లో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ఈ కార్యాచరణ దోహద పడుతుందని డీఆర్‌డీఓ ఏ వెంకటేశ్వర్ రావు తెలిపారు.

ప్రచారంతోనే అవగాహన
జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికే ఈ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడుతున్నాయి. జలసంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం ఈ నెల 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు విస్తృతంగా ప్రచారం చేపట్టి ప్రజల్లో చైతన్యం తేవాలని నిర్ణచించింది. నీటి సంరక్షణలో భాగంగా ఇంటి పైకప్పుల నుంచి పడ్డ వర్షపు నీటిని సేకరించి నిలువ చేయడం, చెక్‌డ్యాంలు నిర్మించడం, కందకాలు తవ్వడం, నీటి కుంటలు తవ్వుకోవడం వంటి విషయాలపై ప్రచారం నిర్వహిస్తారు. చెరువులు కుంటల పునరుద్దరణలో భాగంగా చెరువు కట్టలకు 100 అడుగుల దూరంగా పూడికలు తీయడం, చెరువుకు వచ్చే ఫీడర్ చానల్స్‌లో పూడికలు తీయడం, చెరువుల నుంచి పొలాలకు వెళ్లే ఫీల్డ్ చానల్స్‌లో పూడిక తొలగించడం వంటి పనులపై ప్రచారం చేస్తారు. వాడిన నీటిని తిరిగి వాడుకునే విషయంలో గ్రే వాటర్‌ను ఇండ్లలో చెట్లకు మళ్లించడం, వ్యవసాయ బావులు, బోర్లు, మంచి నీటి బావులు, బోర్ల వద్ద రీచార్జ్ గుంతలు, ఇంటి అవరణ, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు తవ్వుకోవడం వంటి కార్యక్రమాలపై ప్రచారం నిర్వహిస్తారు. వాటర్‌షెడ్ అభివృద్ధిలో భాగంగా పర్కులేషన్ ట్యాంకుల నిర్మాణం, నీరు ఇంకే గుంతల తవ్వకాలు, స్ట్రాగర్ ట్రెంచ్‌లు తవ్వడంపై ప్రచారం చేస్తారు. తక్కువ నీటిని తీసుకుని ఎక్కువ ఎత్తు పెరిగే నల్లతుమ్మ, వేప, చింత, పనస, రావి, మర్రి వంటి మొక్కలు నాటడంపై విస్తృత ప్రచారం చేస్తారు.

విద్యా సంస్థలకు భాగస్వామ్యం
జలశక్తి అభియాన్‌లో భాగంగా జిల్లాలో ఇప్పటికే మూడు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించి వెళ్లింది. నీటి సంరక్షణపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చేసిన సూచనల మేరకు వివిధ శాఖలకు కలెక్టర్ సర్క్యులర్స్ జారీ చేశారు. అందులో భాగంగా పాఠశాలలకు సెప్టెంబర్ 11 వరకు 9 రోజుల కార్యాచరణ ఇచ్చారు. జలశక్తి అభియాన్‌పై అవగాహన నినాదాలతోపాటు ఈ నెల 24న ప్రతిజ్ఞ, మానవహారం, 31న ఇంకుడు గుంతల నిర్మాణం, ఆగస్టు 8న వ్యాసరచన పోటీలు, 14న పాటల పోటీలు, 21న నాటకాలు, ఏకపాత్రాభినయాలు, 28న చిత్రలేఖనం, సెప్టెంబర్ 4న పాఠశాలల్లో మొక్కలు నాటించడం, 11న జలశక్తిపై జరుగుతున్న కార్యక్రమాలపై పునశ్చరణ, ఆచరణ వంటి కార్యక్రమాలు చేపడతారు. కళాశాలల్లోనూ అవగాహన, నినాదాలు, ప్రతిజ్ఞ, వ్యాస రచన, చిత్రలేఖనం, చెట్లు నాటడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇతర సంస్థల భాగస్వామ్యం
మహిళా స్వశక్తి సంఘాలకు ఈ నెల 15 నుంచి కార్యాచరణ ఇచ్చారు. ఈ నెల 23 నుంచి విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. 23, 24న ఇంటింటా అవగాహన, 25న రీచార్జ్ ఫిట్స్‌తో ఉపయోగాలు, 26న ప్రతి సభ్యురాలి ఇంటిలో మొక్కలు నాటడం, 30న ప్రతిజ్ఞ, మానవ హారం వంటి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఇవే కార్యక్రమాలను వారికి కేటాయించిన తేదీల్లో మళ్లీ మళ్లీ ప్రచారం చేస్తారు. అదే విధంగా ఎన్‌జీఓలకు కూడా ఇవే అంశాలపై బాధ్యతలు అప్పగించారు. వీరికి ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు కార్యాచరణ రూపొందించి ఇచ్చారు. వారికి కేటాయించిన తేదీల్లో ఎన్‌జీఓలు ప్రచారం చేస్తారు. ఈ నెల 23 నుంచి రైతులకు కార్యాచరణ రూపొందించారు. 23న అవగాహన, ప్రతిజ్ఞ, 30న బోరుబావులు, బావుల చుట్టూ రీచార్జి ఫిట్స్, నీటి కుంటలు, కమతం చుట్టూ కందకాలు తవ్వుకోవడం, ఆగస్టు 6న చెట్టు నాటడం, బండ్, బ్లాక్ ప్లాంటేషన్, పండ్ల తోటల పెంపకం, ఆరుతడి పంటల ప్రాముఖ్యత, తక్కువ నీటితో సాగుపై ప్రచారం చేయడం, 13న రైతు సంఘాల సమావేశాలు, అవగాహన, ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇలా సెప్టెంబర్ 11 వరకు రైతులకు సంబంధించిన కార్యక్రమాలపై ప్రచారం, ఆచరణ నిర్వహిస్తారు. యువజన సంఘాలను ఇందులో భాగస్వామ్యులను చేశారు. ఈ నెల 21 నుంచి అమలు చేస్తున్నారు. అందులో భాగంగా 28న గ్రామంలోని రోడ్లు, దేవాలయాలు, శ్మశాన వాటికలు, ముఖ్య కూడళ్లలో చెట్లు నాడటం, ఆగస్టు 4, 11, 18, 25, సెప్టెంబర్ 1, 8, 15 తేదీల్లో కూడా ఇవే కార్యక్రమాలు చేపట్టే విధంగా కలెక్టర్ కార్యాచరణ రూపొందించారు. ఎన్‌సీసీకి కూడా భాగస్వామ్యం కల్పించారు. జలశక్తి అభియాన్‌పై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించడం, అవగాహన కల్పించడం, సర్పంచుల సలహాలతో శ్రమదానం చేపట్టడం వంటి పనులను ఈ సంస్థకు అప్పగించారు. ఈ నెల 21న మొదలైన ఈ కార్యాచరణ సెన్టెంబర్ 15తో ముగుస్తుంది. జూలై 28, ఆగస్టు 4, 10, 18, 24, సెప్టెంబర్ 1, 8,15 తేదీల్లో ఎన్‌సీసీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అలాగే ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు జలశక్తిపై అవగాహన కల్పించడం, గ్రామాలకు సంబంధించిన పనుల అవసరాన్ని బట్టి శ్రమదానం ద్వారా పనులు చేపడ్డటం, పబ్లిక్ బోర్స్ వద్ద రీచార్జ్ ఫిట్స్ నిర్వహించడం, చెట్లు నాటించడం వంటి పనులు చేపడతారు. ఈ నెల 28, ఆగస్టు 4, 10, 18, 24, సెప్టెంబర్ 1, 8, 15 తేదీల్లో ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలు ఉంటాయి. సెప్టెంబర్ 15న మాజీ సైనికులు కూడా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. పునశ్చరణ, ఆచరణ వంటి కార్యక్రమాలు చేపడతారు..

నీటి సంరక్షణపై విస్తృత ప్రచారం
జిల్లాలో నీటి సంరక్షణ, నిర్వహణపై కలెక్టర్ సర్ఫరాజ్ ఆదేశాలతో పక్కా కార్యాచరణ రూపొందించాం. పలు సంస్థల భాగస్వామ్యంతో వీటిని విజయవంతంగా నిర్వహిస్తాం. మా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉంటుంది. జలశక్తి అభియాన్ అంటే నీటి సంరక్షణపై విస్తృత ప్రచారం కల్పించడమే. అందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కలెక్టర్ కార్యాచరణలో మరింత విస్తృతంగా ప్రచారం అవుతుంది. పలు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నాయి. నీటిని సంరక్షించుకోడం, చెట్టు నాటడం వంటి ప్రధాన లక్ష్యాలతో ఈ కార్యాచరణ రూపొందించాం.
- ఏ వెంకటేశ్వర్‌రావు, డీఆర్‌డీఓ

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...