గోదారి.. ఎదురీదీ!


Thu,July 18, 2019 04:34 AM

- అబ్బుపరుస్తున్న కాళేశ్వరం
- రివర్స్ పంపింగ్‌తో మహాద్భుతం
- నదీ తీరమంతా జలశోభితం
- వాగులూ వంకలకు ఎదురెక్కుతున్న జలాలు
- మానేరు నదిలోకీ ప్రాణహిత నీళ్లు
- వెట్న్‌క్రు సిద్ధంగా అన్నారం పంప్‌హౌస్
- అప్రోచ్ కెనాల్ నుంచి ఫోర్‌బేలోకి నీరు వదిలిన ఇంజినీర్లు
- సుందిళ్ల బ్యారేజీలోకి ఎత్తిపోసేందుకు రెడీ

మంథని, నమస్తే తెలంగాణ / మంథని రూరల్ : ఇన్నాళ్లూ నీళ్లు లేక ఎడారిగా ఉన్న గోదావరి, కాళేశ్వరం నీటితో ఎదురీదుతున్నది. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి వచ్చి చేరుతున్న నీటితో రెండు ఒడ్లను తాకుతూ ప్రవహిస్తున్నది. నిండుకుండలా మారిన గోదారమ్మను చూసి రైతాంగం తరిస్తున్నది. దిగువకు ఉరకలెత్తే గోదావరికి రివర్స్ గేర్ వేసిన ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆశ్చర్యంగా తిలకిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి మొదలైన గోదారి ప్రవాహం.. కన్నెపల్లి పంప్‌హౌప్ ద్వారా అన్నారం బ్యారేజీని నింపుకుంటూ 74కిలో మీటర్లు ప్రయాణించి అన్నా రం పంప్‌హౌస్ హెడ్ రెగ్యులేటరీ వరకూ చేరింది.

వాగులూ వంకలూ రివర్స్ గేర్..
ఇంజినీరింగ్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రాణహిత నీళ్లు వెనక్కి మళ్లి, గోదావరి నదిలోకి ఎదురెక్కుతున్నాయి. ఈక్రమంలో పల్లానికి ప్రవహించాల్సిన గోదావరి.. రివర్స్ గేర్‌లో ఎత్తుకు చేరుతుండగా, తనలో కలిసే వాగులూ.. వంకలూ ఇదే రీతిలో ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా మానేరు నది, బొగ్గులవాగు, బొక్కలవాగుతోపాటు అనేక చిన్న చిన్న పాయలు ఎదురెక్కిన ప్రాణహిత నీటితో కళకళలాడుతున్నాయి. మంథని మండలం ఆరెంద వద్ద కలిసే మానేరు నదిలోకి ప్రాణహిత నీళ్లు ప్రవేశించి, వెనక్కి పారుతున్నాయి. ఆరెంద మూల మలుపు నుంచి 4కిలో మీటర్ల దూరం వరకూ మానేరు నదీ పొడవునా నీళ్లు వచ్చి చేరాయి. మంథని మండలం ఖానాపూర్ వద్ద గోదావరిలో కలిసే బొక్కల వాగులోనూ నీటి ప్రవాహం భారీగానే పెరుగున్నది. ఇదేసమయంలో మంథని గౌతమీ గోదావరి తీరంలోని చాతుర్ముఖ బ్రహ్మ, శ్రీరామ లింగేశ్వర స్వామి పాదాలను తడుపుతూ శివుడి విగ్రహం వద్దకు గోదారి పరుగులు తీస్తున్న ది. ఈ అద్భుతమైన దృష్యాన్ని చూసేందుకు ప్రతి రోజూ మంథని గోదావరి తీరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేస్తూ.. స్వాగతం పలుతుకున్నారు.

ఫోర్‌బేలోకి చేరిన నీరు..
అన్నారం పంప్‌హౌస్ హెడ్ రెగ్యులేటరీ వద్ద డ్రాట్ లెవల్ 115.3 వరకు నీరు చేరడంతో కాళేశ్వరం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ప్రభుత్వ నీటి పారుదల సలహాదారు పెంటారెడ్డి ఆధ్వర్యంలో అ ప్రోచ్ కెనాల్‌కు నీటిని వదిలారు. దీంతో గ్రావిటీ కెనాల్ ద్వారా ఆ నీరు అన్నారం పంపు హౌస్ ఫోర్‌బేలోకి చేరింది. ఈ క్రమంలో అన్నారం పంప్‌హౌస్‌లోని 1వ నెంబర్ మోటార్ ద్వారా వెట్న్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధంగా చేశారు. వెట్న్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంజినీరింగ్ నిపుణులు, విదేశీ ప్రతినిధుల ఆధ్వర్యంలో చేపట్టిన ముందస్తు పరీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయి. పంప్ వద్ద గల 220కేవీ బ్రేకర్స్, ఫీ ల్డ్ బ్రేకర్స్, డిశ్చార్జ్ వ్యాల్యూ, కూలింగ్ వాటర్ సి స్టం, బ్రేక్ సిస్టం, హెచ్‌ఎస్ ల్యూబ్రికేషన్ సిస్టం, ఎస్‌ఎఫ్‌సీ సిస్టంతోపాటు రిమోట్ ప్యానల్స్‌ను అధికారులు ఇ ప్పటికే పరీక్షించారు. పూర్తిస్థాయి పరీక్షలను పూర్తి చేసుకొని శుక్ర, లేదా శనివారాల్లో అన్నారం పంప్‌హౌస్‌లోని ఒకటవ నంబర్ మోటార్‌ను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంథని మండలం సిరిపురంలోని సుంది ళ్ల బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నారు.

గోదారి ఎదురీదుతున్నది. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి పైనున్న సుందిళ్ల వైపుగా పరుగులు పెడుతున్నది. తనలో కలిసే వాగులూ.. వంకలకూ వెనక నడక నేర్పిస్తూ సాగుతున్నది. ఫలితంగా మానేరు, బొక్కల వాగులోకీ ప్రాణహిత నీళ్లు చేరి.. తీరమంతా జలకళ సంతరించుకున్నది. ఇటు అన్నారం పంప్‌హౌస్ హెడ్ రెగ్యులేటరీ గేట్లు తెరిచిన అధికారులు, గ్రావిటీ కెనాల్ ద్వారా ఫోర్‌బేలోకి నీళ్లను వదిలారు. పంప్ హౌస్ ఒకటో నెంబర్ మోటార్‌ను ఆన్ చేసి, వెట్న్ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. మరో రెండుమూడు రోజుల్లో సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోయనున్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...