కాషాయం.. నిలువెల్లా విషం


Thu,July 11, 2019 03:58 AM

కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో మైదానంలో సచివాలయం కట్టాలని ముందుగా తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెనక అనేక ప్రజా ప్రయోజనాలున్నాయి. ఇందులో భాగంగానే సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలోని భూములను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. పలుసార్లు కేంద్రం వద్దకు వెళ్లి రక్షణశాఖ భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భూములు ఇచ్చేందుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు ముందుగా వార్తలు కూడా వచ్చాయి. నిజానికి, బైసన్‌పోలో మైదానంలో సచివాలయం నిర్మాణం చేయాలన్న ఆలోచన వెనుక అనేక రకాల ప్రజా ప్రయోజనాలున్నాయి. దశాబ్ద కాలంగా సికింద్రాబాద్‌లోని జేబీఎస్ బస్టాండ్ నుంచి తిరుమలగిరి, అల్వాల్ మీదుగా కరీంనగర్ వచ్చి వెళ్లే ప్రధాన మార్గం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. అలాగే, జేబీఎస్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి మీదుగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వచ్చి వెళ్లే మార్గం కూడా ఇదే స్థితిలో ఉంది. హైదరాబాద్ ప్రాంతానికి రాకపోకలు విపరీతంగా పెరిగిన దరిమిలా ఈ రోడ్ల విస్తరణ అనివార్యంగా మారింది. దీనికి కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ భూములు అడ్డంకిగా మారాయి. కేంద్రం అనుమతి లేకుండా రక్షణ శాఖ భూముల్లో నిర్మాణాలు చేయడానికి వీలులేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ భూములను ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. రక్షణ శాఖ భూములు అప్పగిస్తే.. రహదారుల విస్తరణతోపాటు రెండు రహదారులపై రెండు ఎలివేటడ్ ైఫ్లె ఓవర్లు నిర్మాణం చేసే ఆలోచనను కూడా చేసింది. దాని వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలోని నిజమాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా వాసులే కాదు, సికింద్రాబాద్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

విషం కక్కిన కమలం..
రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాల్సిన భారతీయ జనతాపార్టీ విషం కక్కింది. రక్షణ శాఖ భూములు అప్పగించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి.. అడ్డుపడింది. రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా మేమే అడ్డుకున్నామని నిస్సిగ్గుగా భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ చెప్పడంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. ప్రస్తుతం సచివాలయం కూల్చివేత అంశంపై ఇటీవల ఓ చానల్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు యావత్ తెలంగాణ ప్రజలను విస్మయానికి గురిచేసింది. బైసన్‌పోలో మైదానంలో సచివాలయం కడుతామని గత అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమని కేసీఆర్ చెప్పారు. కానీ, మేం మాత్రం ఆపి తీరుతామని చాలెంజ్ చేశాం. ఆ మేరకు ప్లాన్ (సార్ట్ అవుట్) చేశాం. చివరకు కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ నుంచి సదరు భూములు ఇవ్వకుండా అన్ని ప్రయత్నాలూ చేసి ఆపు చేశాం అంటూ ఆయనే స్వయంగా రౌండ్‌టేబుల్ సమావేశంలో వెల్లడించారు.

పెరగనున్న ట్రాఫిక్ తిప్పలు..
హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్లి వచ్చే ప్రయాణికులకు మున్ముందు ప్రయాణం నరకంగా మారే ప్రమాదమున్నది. రక్షణ శాఖ భూములు ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడ్డుపుల్ల వేసిన నేపథ్యంలో.. భవిష్యత్‌లోనూ ఈ భూముల అప్పగింతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవైపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ రోజురోజుకూ పెరుగుతుండగా.. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు వచ్చిపోయే సికింద్రాబాద్‌లోని ప్రధాన రహదారి మాత్రం రోజురోజుకూ కుంచించుకుపోతుంది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తున్నది. మున్ముందు ట్రాఫిక్ తిప్పలు మరింత పెరిగే ప్రమాదమున్నది. నిజానికి కరీంనగర్ నుంచి అల్వాల్ వరకు వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందో.. అక్కడి నుంచి సికింద్రాబాద్ చేరేందుకూ అంతే సమయం పడుతున్నది. కొన్నిసార్లు అల్వాల్ నుంచి తిరుమలగిరి చౌరస్తా మీదుగా సికింద్రాబాద్ చేరుకునేందుకు రెండు, మూడు గంటల సమయం అవుతున్నది. ఈ సమస్యను అధిగమించాలంటే రోడ్ల విస్తరణ జరగాలి. అలాగే, ఎలివేటడ్‌ై ఫ్లెఓవర్లు నిర్మాణం కావాలి. ఇవి సాధ్యపడాలంటే రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. అంతర్జాతీయ నగరంగా హైదాబాద్ దినదినం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగాల్సిన అవసరమున్నది. వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలం రాజకీయ దురుద్దేశ్యంతో కేంద్ర డిఫెన్స్ శాఖ నుంచి భూములు రాకుండా బీజేపీ అడ్డుకోవడంపై తెలంగాణవాదుల నుంచే కాదు.. ఆయా జిల్లాల ప్రజలనుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భూములిస్తేనే ట్రాఫిక్ సమస్యకు చెక్..
ప్రస్తుతం సచివాలయం ఇతర ప్రాతంలో నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం పనులు సాగుతున్నాయి. ఇక్కడ కూడా ప్రతిపక్షాలతో కలిసి బీజేపీ అడ్డుకుంటోంది. అయితే, ఈ విషయాన్ని కొద్ది సేపు పక్కన పెడితే.. ప్రజా ప్రయోజనాల కోసమే తాము పనిచేస్తున్నామని చెప్పే రాష్ట్ర భారతీయ జనతాపార్టీ, చిత్తశుద్ధి ఉంటే ఆ దిశగా అడుగులు వేయాలన్న డిమాండ్ తెలంగాణవాదుల నుంచి వస్తున్నది. బైసన్‌పోలోలో సచివాలయం నిర్మాణం కాకుండా ఉండేందుకు రక్షణ శాఖ భూములు ఇవ్వకుండా అడ్డుకున్నామని చెబుతున్న బీజేపీ ముందు పలు ప్రశ్నలు ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. సచివాలయాన్ని వేరే ప్రాంతంలో నిర్మాణం చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మాత్రం ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రక్షణ శాఖ భూములు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు, అలాగే రోడ్ల విస్తరణకు, ఎలివేటెడ్ ైఫ్లెఓవర్ల నిర్మాణానికి కావాల్సిన భూములను రక్షణశాఖ నుంచి ఇప్పించే బాధ్యతను రాష్ట్ర కమళదళం తీసుకోవాలన్న డిమాంగ్ గట్టిగా వినిపిస్తున్నది. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులు, రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ సమస్యకు చెక్ పెట్టాలంటే రహదారుల విస్తరణ ద్వారానే సాధ్యమనీ, ఈ విస్తరణ కావాలంటే రక్షణశాఖ భూములిస్తేనే సాధ్యం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ప్రజాప్రయోజనాల కోసం పనిచేసే ఉద్దేశం బీజేపీకి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి రక్షణ శాఖ నుంచి ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలన్న డిమాండ్ వస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఆ పార్టీకి సంబంధించి ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎంపీలు సైతం హైదాబాద్ వెళ్లి వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ సమస్యను ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. కళ్లెదుట ఉన్న సమస్యను పరిష్కరించే అంశంపై దృష్టిపెట్టి కేంద్రాన్ని ఒప్పిస్తారా? లేక ప్రజల ఇక్కట్లు పట్టకుండా వ్యవహరిస్తారా? అన్న విషయం ముందు ముందు తేలనున్నది.

కపటబుద్ధిని బయట పెట్టుకున్నారు..
ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు మాత్రం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పాటుపడాలి. కానీ, రక్షణ భూముల అప్పగించకుండా అడ్డుకున్నామని స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే చెప్పడం సిగ్గుచేటు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. స్వరాష్ట్ర అభివృద్ధికి బాధ్యతాయుతంగా పని చేయాల్సిన వారే కేంద్రంతో మాట్లాడి భూములు ఇవ్వకుండా ఆపినట్లుగా ప్రకటించుకోవడం బాధాకరమైన విషయం. రక్షణ భూముల అప్పగింత వెనక్కి వెళ్లడం వల్ల ఉత్తర తెలంగాణ ప్రాంత వాసులకు ఎనలేని నష్టమే. దశాబ్దాలుగా ఇరుకు రోడ్ల విస్తరణ లేకపోవడంతో అనేక ఇబ్బందులు నిత్యం ఎదరువుతూనే ఉన్నాయి. బీజేపీ నేతల కళ్లకు ఈ ఇబ్బందులు కనిపించడం లేదా? ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలి.
- సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే

కేంద్రం వైఖరి సరిగ్గాలేదు..
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ పనితనానికి మోదీ ప్రభుత్వమే అనేక మార్లు అవార్డులు అందించింది. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా పని చేస్తోంటే కేంద్రానికి నిద్ర పట్టడం లేదు. రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతోంది. మొన్నటికి మొన్న కేంద్ర బడ్జెట్‌లో మొండిచేయి చూపించింది. పైగా రక్షణ భూముల అప్పగింత వ్యవహారంలో కేంద్రం వైఖరి సరిగ్గా లేదు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతవాసులంతా రక్షణ భూముల్లోని రహదారుల గుండా ప్రయాణించేందుకు నిత్యం అవస్థలు పడుతున్నారు.
- రవీందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

రక్షణ భూములను బదలాయింపు చేయాలి..
రక్షణ భూముల అప్పగింత మూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరే లాభం కన్నా, లక్షలాది మంది ప్రజలకు మేలు చేకూరుతుంది. దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపడం కోసం కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తోంటే, ఎక్కడ మంచి పేరు వస్తుందేమోనని భయంతో బీజేపీ వాళ్లు ఇలాంటి నీచమైన కుట్రలకు దిగుతున్నారు. భూములు ఇవ్వకుండా కేంద్రం ద్వారా మేమే అడ్డుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే మాట్లాడడం వారి చిల్లర రాజకీయాలను ప్రస్ఫుటం చేస్తున్నది.
- హరిశంకర్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...