ఊరి బయట.. అమ్మ


Wed,June 19, 2019 01:51 AM

జగిత్యాల రూరల్ : నవమాసాలూ మోసీ, కనీ పెంచిన తల్లి ఆ కొడుకులకు కానిదైంది. తల్లిలా చూసుకోవాల్సిన కోడళ్లకు భారమైంది. ఇలా ఊరి బయట ఎప్పుడు కూలి మీద పడుతుందో తెలియని ఎండుటాకుల పందిరి కింద బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నది. కన్నోళ్లు కాదనుకొని పేగుబంధం తెంచుకొని గ్రామ శివారులో వదిలేసి చేతులు దులుపుకొంటే ఊరివాళ్లే అన్నీ తామై వారం నుంచీ సపర్యలు చేస్తున్న తీరు చూపరులను కలిచివేస్తున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన ఒర్సు వెంకటమ్మకు ఇద్దరు కొడుకులు కొమురయ్య, వెంకటేశ్ ఉన్నారు. వారు జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌లో అద్దె ఇంటిలో నివాసముంటున్నారు. వెంకటమ్మ ఇన్ని రోజులూ ఒక్కో కొడుకు ఇంటిలో నెల రోజుల చొప్పున ఉంటూ వచ్చింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది.

ఆమెకు ఎవరు ఊడిగం చేయాలంటూ కోడళ్లు ఈసడించుకోవడం, వెంకటమ్మ పరిస్థితి విషమంగా మారడంతో కొడుకులు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని టీఆర్‌నగర్ శివారులో గుడిసె వేసి అక్కడే ఆమెను వదిలేశారు. పది రోజులుగా ఊరు బయట గుడిసెలో ఉంటుండడంతో వెంకటమ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో వారం నుంచీ గ్రామస్తులే ఆమెకు భోజనం పెడుతూ ఆలనా పాలనా చూసుకుంటున్నారు. వరంగల్‌లో వెంకటమ్మకు సొంత ఇల్లు, జాగా ఉన్నదనీ కాటికి కాలుజాపిన వెంకటమ్మను చివరిరోజుల్లోనైనా బాగా చూసుకోవాల్సిన కొడుకులు, ఇలా వదిలేయడం, ఆమె ఎండకు ఎండుతూ ఇలా పందిరి కింద బిక్కుబిక్కుమంటూ పడి ఉండడం చూడలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...