గురుకుల మహోత్సవం


Tue,June 18, 2019 01:09 AM

-ఉమ్మడి జిల్లాలో అట్టహాసంగా 13 బీసీ గురుకులాలు ప్రారంభం
-మంత్రులు ఈటల, కొప్పుల, ఎమ్మెల్యేల చేతుల మీదుగా శ్రీకారం
-పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు
-ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
కలెక్టరేట్/ మంథనిరూరల్/ రాంమందిర్‌ఏరియా: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న రాష్ట్ర సర్కారు, ఇటీవలే నియోజకవర్గానికో మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 13 బీసీ గురుకులాలు మంజూరు కాగా, సోమవారం ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు కొప్పుల, ఈటలతో పాటు ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలు చేశారు. హుజూరాబాద్‌కు మంజూరైన బాలుర బీసీ గురుకులాన్ని తాత్కాలికంగా హుజూరాబాద్‌లో ప్రారంభించారు. 240 సీట్లతో ప్రారంభమైన ఈ పాఠశాలలో అన్ని సీట్లు భర్తీ చేశారు. కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలానికి మంజూరైన బాలుర గురుకులాన్ని స్థానిక విట్స్ కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ప్రారంభించారు. ఇందులో 240 సీట్లకు ఇప్పటికే 110 సీట్లు భర్తీ చేశారు. చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని గంగాధర మండలం బూరుగుపల్లిలో ఏర్పాటు చేయాల్సిన బాలుర గురుకుల పాఠశాలను తాత్కాలికంగా గంగాధరలో ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఇందులో 240 సీట్లు ఉండగా ఇప్పటికే 178 మంది అడ్మిషన్ తీసుకున్నారు. మానకొండూర్ నియోజకవర్గానికి మంజూరైన బాలికల గురుకులాన్ని గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో తాత్కాలికంగా ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు. ఇన్‌చార్జి కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ ఇక్కడ పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజవర్గానికి మంజూరైన బాలికల గురుకులాన్ని హుస్నాబాద్ పట్టణ శివారులోని పోతారం(ఎస్)లో ఆర్డీఓ అనంతరెడ్డి ప్రారంభించారు.

-పెద్దపల్లి మండలం రంగంపల్లి సహజ స్కూల్ ఆఫ్ బిజినెస్ కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన బాలికల గురుకులాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. గోదావరిఖనిలోని ప్రశాంతినగర్ నగర్‌లో నుతనంగా ఏర్పాటు చేసిన బాలుర గురుకులాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించాల్సి ఉండగా, ఆయన ఢిల్లీ పర్యటన వెళ్లడంతో ప్రిన్సిపాల్ రమ్యనన్నపురాజ్ సరస్వతీ పూజ చేసి ప్రారంభించారు. ఇక మంథని మండల వెంకటాపూర్‌లో ఏర్పాటు చేసిన బాలుర గురుకులాన్ని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

-జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి కేటాయించిన బాలికల గురుకులాన్ని తాత్కాలికంగా జగిత్యాలలో, జగిత్యాల నియోజకవర్గానికి కేటాయించిన బాలికల గురుకుల పాఠశాలను జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. కోరుట్ల మండలంలోని అయిలాపూర్‌లో ఏర్పాటు చేసిన గురుకులాన్ని ఎంపీపీ తుమ్మనపల్లి భారతి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ శరత్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు హరిచరణ్ రావు, జిల్లా గురుకులాల పర్యవేక్షణాధికారి రామానుజాచారి, గురుకుల ప్రత్యేకాధికారి ఆనంద్‌రావు పాల్గొన్నారు.

-రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారిలో బాలుర గురుకులాన్ని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన బాలికల గురుకుల పాఠశాలను ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...